కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌కు అడ్డాగా కర్నూలు, 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (22:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా, క‌ర్నూలు జిల్లాలో ఒకే రోజు 52 కేసులు నమోదు కావడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రానికి మరో 18 కేసులు వచ్చి చేరడంతో, జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 74కు చేరింది.

 
ఏప్రిల్ 3 వరకు జిల్లాలో ఒక్క‌టే కేసు న‌మోదైంది. ఏప్రిల్ 4న 3 కేసులు వచ్చి చేరాయి. కానీ, ఏప్రిల్ 5, 6 తేదీలలో ఒకేసారి వరసగా 52, 18 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 74కి చేరింది. దాంతో, అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

 
జిల్లా కేంద్రమైన క‌ర్నూలుతో పాటు నంద్యాలలో ఎక్కువ కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారం న‌మోదైన 52 కేసుల్లో 19 నంద్యాలకు చెందిన‌వే. కర్నూలులో కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలకు చెందిన వారిలో కరోనా పాజిటివ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. దాంతో, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.

 
క‌ర్నూలు మునిసిప‌ల్, రెవెన్యూ అధికారులు దానికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ జి వీర‌పాండియ‌న్ తెలిపారు. క‌ర్నూలు, నంద్యాలతో పాటుగా ఆత్మ‌కూరు ఆదోని ప్రాంతాల్లోనూ కొత్త కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

 
తబ్లీగీ జమాత్‌లో పాల్గొని వచ్చిన వారే అధికం
క‌ర్నూలు జిల్లాలో కొత్త‌గా న‌మోద‌వుతున్న దాదాపు అన్ని కేసులు దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారు, వారి కాంటాక్ట్ కేసులేనని గుర్తించారు.

 
ఆదివారం రాత్రి వ‌ర‌కూ 56 కేసులు ఉండ‌గా సోమ‌వారం ఉద‌యం జిల్లాలో మ‌రో 3 కేసులు న‌మోద‌య్యాయి. దాంతో, జిల్లాలో బాధితుల సంఖ్య 59కి చేరింది. అందులో ఒక్క‌రు మిన‌హా దాదాపుగా అంద‌రూ ఢిల్లీ ఘ‌ట‌న‌తో ప్ర‌త్య‌క్షంగానీ, ప‌రోక్షంగా గానీ ముడిప‌డి ఉన్న‌ట్టు క‌ర్నూలు డీఎం అండ్ హెచ్ ఓ రామ‌సుబ్బ‌య్య తెలిపారు.

 
అందుబాటులోకి రాని వారి కోసం ప్ర‌య‌త్నాలు
మ‌త ప్రార్థ‌న‌ల కోసం దిల్లీ వెళ్లిన వారిలో క‌ర్నూలు జిల్లాకు చెందిన 295 మంది ఉన్న‌ట్లు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లా వారే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

 
ఇప్పటివరకు వారిలో 260 మంది ని గుర్తించారు. వారిలో అత్య‌ధికుల‌ను క్వారంటైన్ కి పంపించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ జిల్లాకు చెందిన వారిలో 80 మంది రిపోర్టులు రావాల్సి ఉంద‌ని డీఎం అండ్ హెచ్ ఓ ప్ర‌క‌టించారు.

 
అదే స‌మ‌యంలో మ‌ర్కజ్‌కు హాజ‌రైన వారిలో మ‌రో 40 మంది జాడ తెలియ‌క‌పోవ‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది. వారి స‌మాచారం సేక‌రించిన‌ప్ప‌టికీ మొబైల్ నంబర్లు స్విచాఫ్ చేసి ఉండ‌డంతో ఎక్క‌డున్నార‌న్న‌ది అంతుబ‌ట్ట‌డం లేదు. వారి స‌మాచారం కోసం ఇప్ప‌టికే రకరకాల పద్ధతుల్లో ఆరా తీసిన అధికారులు వారంతా జిల్లాకు వ‌చ్చి ఉండ‌ర‌నే అంచ‌నాలో ఉన్నారు.

 
దిల్లీ వెళ్లిన‌ప్ప‌టికీ ర‌వాణా లేక‌పోవ‌డం, లేదా ఇత‌ర కార‌ణాల‌తో ఎక్క‌డో చిక్కుకుని ఉంటార‌ని వారు భావిస్తున్నారు. వారిలో క‌ర్నూలు, నంద్యాల వాసులు 30 మంది, ఆత్మ‌కూరు, ఆదోని ప్రాంతాల వారూ 10 మంది ఉంటార‌ని డీఎం అండ్ హెచ్ ఓ రామ‌సుబ్బ‌య్య చెబుతున్నారు.

 
అధికారులు అప్ర‌మ‌త్తం... క‌రోనా హాస్పిటల్‌గా ప్రైవేట్ కాలేజీ
అనూహ్యంగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్తం అయ్యింది. అనుమానితులు, ల‌క్ష‌ణాల‌తో ఉన్న వారంద‌రినీ క్వారంటైన్ కి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా క‌ర్నూలులోని విశ్వ‌భార‌తి మెడిక‌ల్ కాలేజీని క‌ర్నూలు జిల్లా క‌రోనా ఆస్ప‌త్రిగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి త‌దిత‌రులు ఈ ప‌రిణామాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు సూచించారు.

 
తాజా చ‌ర్య‌ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ వీర పాండియ‌న్ బీబీసీతో మాట్లాడారు. "జిల్లాలో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. క్వారంటైన్, ఐసోలేష‌న్ కి సంబంధించిన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. కరోనా పాజిటివ్ కేసులకు విశ్వ భారతి మెడికల్ కాలేజీలో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశాం. ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాలి. అలాగే, రెడ్ జోన్లు కూడా గుర్తించాం. వారికి త‌గిన సూచ‌న‌లు చేస్తున్నాం. ప్ర‌త్యేకంగా వైద్య బృందాలు రంగంలోకి దించాం. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం. సామాజిక దూరం పాటించ‌డంలో ప్ర‌జ‌లు జాగ్రత్తగా ఉండాలి" అని కలెక్టర్ అన్నారు.

 
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు