కరోనావైరస్: రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?

సోమవారం, 15 జూన్ 2020 (15:16 IST)
మనం ప్రతి రోజు తాకే ఉపరితలాలను కొన్ని రకాల పదార్ధాలని ఉపయోగించి వినూత్నంగా తయారు చేయడం ద్వారా వైరస్‌ను, బాక్టీరియాను శరీరంలోకి చేరకుండా నిరోధించవచ్చు. సూక్ష్మజీవుల ద్వారా సోకే వ్యాధుల వలన ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోటి మరణాలు సంభవిస్తున్నాయని యూకే ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో పని చేస్తున్నఅంటువ్యాధుల పరిశోధకులు గెరాల్డ్ లారోయ్ మామస్ చెప్పారు.

 
యాంటీ బయోటిక్స్‌కి, ఔషధాలకి లొంగని వ్యాధులతో ఇప్పటికే సంవత్సరానికి 7 లక్షల మంది చనిపోతున్నారు. హానికరమైన బాక్టీరియాని నిరోధించడానికి పనికివచ్చే మందుల జాబితా కూడా రోజు రోజుకీ తగ్గిపోతోంది. కొత్త రకాల ఔషధాలు తయారు చేసే లోపు కొత్త కొత్త రకాల వైరస్‌లు, ఫంగస్‌లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీటి వలన వచ్చే వ్యాధులకు చికిత్స అందించటం కూడా వైద్యులకు కష్టంగా మారుతోంది.

 
వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి తోడ్పడే ఉపరితలాలనే వైరస్‌ను హరించడానికి ఆయుధాలుగా తయారు చేసేందుకు ఆయన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మనం ప్రతి రోజు తాకే ఉపరితలాల ద్వారా వైరస్ సోకే ప్రమాదముంటుందని లారోయ్ అన్నారు. కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ అట్టముక్కపైన మీద 24 గంటలు సజీవంగా ఉంటే, ప్లాస్టిక్,స్టెయిన్‌లెస్ స్టీల్ మీద మూడు రోజుల వరకు జీవించి ఉండవచ్చు. ఈకోలి, ఎంఆర్ఎస్ఏ లాంటి బాక్టీరియా అయితే అచేతనంగా ఉండే ఉపరితలాలపై కొన్ని వారాల నుంచి నెలల వరకు సజీవంగా ఉంటాయి. అందుకే ఎక్కువగా తాకే ఉపరితలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

 
మనం వాడే కొన్ని పరికరాల ఉపరితలాలని కొన్ని రకాల పూతలతో కప్పడం వలన సూక్ష్మజీవులని, వైరస్‌లని శరీరంలోకి ప్రవేశించకముందే హరించవచ్చని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 99 .9 శాతం సూక్ష్మజీవులని, వైరస్‌లను రెండు గంటలలో హరించే సహజ లక్షణం ఉండటం వలన రాగిని ఉపరితలాలపై పూతగా వాడాలని లారోయ్ సూచిస్తున్నారు. వెండి కంటే కూడా రాగి బాగా పని చేస్తుందని తెలిపారు.

 
రాగి లోహాన్ని కొన్ని లక్షల సంవత్సరాలుగా మానవ జాతి ఉపయోగిస్తున్న అనుభవం ఉండటం వలన దీని వాడకం మేలని లారోయ్ అభిప్రాయపడ్డారు. ప్రాచీన గ్రీకు జాతీయులు వంటకి, వైద్యానికి రాగి పాత్రలని వాడారని చెప్పారు.

 
ఆధునిక కాలంలో వైద్య రంగంలో రాగిని ఎక్కువగా వాడటం లేదని అన్నారు. రాగి ఖరీదైనది మాత్రమే కాకుండా కిలుమ్ పట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం కూడా కష్టం కావడం వలన చాలా మంది రాగి పాత్రలను వాడటానికి ఇష్టపడరు. లోహంతో చేసిన టాయిలెట్ సీట్ మీద కూర్చోవడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. దీంతో, నిత్య జీవితంలో తక్కువ ఖరీదులో దొరికే స్టీల్, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయిందని ఆయన అన్నారు.

 
అయితే, ప్రతీ ఉపరితలానికీ రాగితో పూత వేయడం కష్టమైన పని కావడంతో ఈ లోహాన్ని లిఫ్ట్ స్విచ్‌లు, తలుపు హ్యాండిళ్ళ దగ్గర వాడటం వలన కొంత వరకు సూక్ష్మ జీవులని హరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రాగితో చేసిన ఉపరితలాలని లేజర్ విధానం వాడి సూక్ష్మజీవులని హరించే విధంగా తయారు చేయవచ్చని ఆయన చెప్పారు.

 
యాంటీ బయోటిక్‌కి లొంగని బాక్టీరియాని కూడా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా హరింపచేయవచ్చని ఇండియానాలో పర్డ్యూ యూనివర్సిటీలో పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి విధానాల వలన డోర్ హ్యాండిల్స్‌కి మాత్రమే కాకుండా మోకాలు మార్పిడి లాంటి చికిత్సల్లో ఇంప్లాంట్‌లు చేయడానికి కూడా వాడటం వలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఉపరితలాల స్వరూపం మార్చడం వలన కూడా కొన్ని రకాల అంటువ్యాధులు సోకకుండా నిరోధించవచ్చు.

 
సికాడా అనే కీటకం రెక్కలు స్వీయ శుభ్రత లక్షణాలని కలిగి ఉంటాయని ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటి యూనివర్సిటీకి చెందిన ఎలెనా ఇవనోవా అనే మాలిక్యులర్ బయో కెమిస్ట్ చెప్పారు. వాటి రెక్కలపై పడిన నీటి చుక్కలు తామర ఆకుపై వాలిన నీటి చుక్కల్లా పైకి తేలడం వలన ఆ నీటితో పాటు సూక్ష్మజీవులు బయటకి వెళ్ళిపోతాయని చెప్పారు.

 
ప్రకృతి ఆధారంగా ఉపరితలాలపై సూక్ష్మజీవులు నిల్వ ఉండకుండా చూసే విధానాలను అభివృద్ధి చేసేందుకు ఇవనోవా పరిశోధన చేస్తున్నారు. టైటానియం లోహాన్ని అధిక ఉష్ణోగ్రతల్లో కరిగించడం ద్వారా రకరకాల బాక్టీరియాని హరించే సున్నితమైన పొరని తయారు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

 
టైటానియం డై ఆక్సైడ్‌.. అల్ట్రా వయొలెట్ కాంతితో కలిస్తే పెరాక్సైడ్‌లను ఉత్పత్తి చేసి మైక్రోబ్‌లను తటస్థం చేస్తుంది. దంతాలకు వాడే బ్రేస్లలో బాక్టీరియాని హరించడానికి ఇప్పటికే ఈ పద్దతిని వాడుతున్నారు. ఇదే కాంతిని వాణిజ్య దీపాలకు నాలుగు గంటల పాటు ప్రసారం చేస్తే బ్యాక్తీరియా నశిస్తుంది. ఇవి ప్రభావవంతంగా పని చెయ్యడానికి ప్రత్యేకమైన రసాయన ప్రక్రియ చేయనవసరం లేదని ఇవనోవా చెప్పారు.

 
ఉపరితలాలపై బాక్టీరియా లేకుండా నివారించడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే విధానాలను కరోనావైరస్ నిర్మూలనకు కూడా వాడవచ్చని వ్లాదిమిర్ బౌలిన్ అనే జీవ శాస్త్రవేత్త అంటున్నారు. లేదా ఉపరితలాల స్వరూపాన్ని మార్చటం వలన వైరస్‌ని నశింప చేయగలిగే అవకాశం ఉంటుందని మరి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 
ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రకృతి కూడా వివిధ మార్గాలను సూచిస్తుంది. బాక్టీరియాను, వైరస్‌ను హరించే సామర్థ్యం ఎస్సెన్షియల్ నూనెలకు ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని అర్జెంటీనాకి చెందిన అలెజాండ్రా పోన్స్ అనే కెమికల్ ఇంజనీర్ తెలిపారు. ఉదాహరణకు టీ ట్రీ ఆయిల్‌లో ఉండే ఘాటైన వాసన చాలా సౌందర్యసాధనాల్లో వాడటానికి ఉపయోగపడుతోందని చెప్పారు. ఈ నూనెకి 5-15 నిమిషాల లోపు 95 శాతం వైరస్ ప్రభావాన్ని తగ్గించే లక్షణం ఉంది.

 
అయితే, ఉపరితలాలపై వైరస్ వ్యాప్తి చెందకుండా అవలంబించే విధానాలన్నీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వీటి గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉంది. కానీ, ఇలాంటి పైపూతలపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని స్వీడన్‌కు చెందిన యాక్షన్ ఆన్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ నెట్‌వర్క్‌లో విధాన అధికారిగా పనిచేస్తున్న మెంగ్‌ఇంగ్‌ రెంగ్ చెప్పారు.

 
‘‘దేనికీ ఈజీ ఫిక్స్ అనేది లేదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వైద్య వ్యవస్థలను మెరుగుపర్చుకోవడం, వ్యాక్సిన్లు వంటివి చాలా ముఖ్యం’’ అని ఆమె తెలిపారు. లారోయ్ మామస్ మాత్రం గత 3 వేల సంవత్సరాల్లో రాగిని తట్టుకునే సామర్థ్యాన్ని బాక్టీరియా పొందలేదని, ఇక ముందు కూడా ఆ సామర్థ్యం బాక్టీరియాకు రాకపోవచ్చని చెప్పారు.

 
ఏది ఏమైనప్పటికీ వీటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికే కొన్ని వైద్య సాధనాల్లో షార్క్ లెట్ లాంటి బాక్టీరియా నిరోధక పదార్ధాలను వాడుతున్నారు. విమానంలో సీట్లలో బాక్టీరియా చేరకుండా మైక్రో షీల్డ్ 360 పూత పూస్తారు.

 
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ యాంటీబయాటిక్స్‌ను కూడా తట్టుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ వైరస్‌లను తట్టుకునేందుకు ఇలాంటి పైపూతలు సహాయం చేయొచ్చు. భవిష్యత్‌లో మీ ఇంటిని కూడా మైక్రోబ్‌లతో పోరాడే విధంగా తయారు చేసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు.

 
‘‘మన చుట్టూ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయి. మనం వాటితో ఇప్పుడు చేస్తున్న పోరాటం కొత్తదేమీ కాదు’’ అని లారోయ్ మామస్ అన్నారు. ‘‘చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మరో మహమ్మారితో పోరాటానికి సిద్ధం కావడం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు’’.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు