కరోనావైరస్: ప్రపంచం మొత్తానికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేదెప్పుడు? పేద దేశాలు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?

గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:25 IST)
కరోనాను పూర్తిగా నిర్మూలించడానికి వ్యాక్సీన్ ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అధ్నామ్‌ గెబ్రియేసస్‌ అన్నారు. కానీ ఇది జరగాలంటే కేవలం వ్యాక్సీన్‌ ఖర్చును భరించగలిగిన దేశాలు మాత్రమే టీకా వేసుకుంటే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌ల నుంచి ప్రజలకు కాపాడటానికి వ్యాక్సీన్‌లు ఉపయోగపడతాయన్నది తెలిసిన విషయమే అయినా, వాటిని అందరికీ అందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

 
ఈ అడ్డంకుల కారణంగానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. 'వ్యాక్సిన్‌ నేషనలిజం' రూపంలో కొన్ని ధనిక దేశాలు, రాజకీయ కూటములు పేద దేశాలకు వ్యాక్సీన్‌ అందకుండా పోటీలు పడి టీకాను సమీకరిస్తున్నాయి. కొన్ని దేశాలలో ప్రజలు వ్యాక్సీన్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోతుండగా, మరికొన్ని చోట్ల టీకా తయారీలో సమస్యలు వంటివీ ఉన్నాయి. ఇలాంటి అనేకానేక ఇబ్బందుల కారణంగా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడమనేది సవాలుగా మారుతోంది. మరి ఇన్ని అడ్డంకులు కనిపిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ మొత్తానికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే ఎంత కాలం పడుతుంది ?

 
వ్యాక్సినేషన్ ఎలా సాగుతోంది?
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తుండగా, టీకా ఉత్పత్తి, సరఫరాలలో వ్యత్యాసం కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 138 దేశాలలో 56.5 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను అందించారు. మార్చి 30న కోటి 39 లక్షల డోసులను ఇచ్చారని అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా(OWID) తెలిపింది. చూడటానికి ఇది పెద్ద నంబర్‌గానే కనిపించవచ్చు. కానీ ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లు ఉంది. ఈ మొత్తం వ్యాక్సీన్‌ కేవలం 7.2శాతం మందికి, అది కూడా మొదటి డోసును ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది.

 
ఇదే వేగంతో వ్యాక్సినేషన్‌ కొనసాగితే ప్రపంచ జనాభా మొత్తానికి టీకా ఇచ్చేందుకు మూడేళ్లకు పైగా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అనుమతి పొందిన అన్ని వ్యాక్సీన్‌లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంది.

 
అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద వాళ్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు 2022 జూన్ వరకు సమయం పడుతుందని 'ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌' (EIU) అంచనా వేస్తోంది. మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాలకు 2023 ఆరంభం నాటికి వ్యాక్సినేషన్‌ పూర్తి కానుండగా, పేద దేశాలు పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ కోసం 2024 వరకు ఎదురు చూడాల్సిందేనని అంచనా.

 
ఏ వ్యాక్సీన్‌లను ఉపయోగిస్తున్నారు?
ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, సినోఫామ్‌, సినోవాక్‌, స్పుత్నిక్‌ వి, జాన్‌స్సెన్‌, నోవాక్స్‌లాంటి వ్యాక్సీన్‌లు ఇప్పటి వరకు అనుమతి పొందాయి. ఇవి కాక మరో 200 ఫార్మా సంస్థలు తమ వ్యాక్సీన్‌ల ప్రభావం, రక్షణలపై ప్రయోగాలు చేస్తున్నాయి. వీటన్నింటికీ అనుమతులు వస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా టీకాలను తయారు చేయగలిగినా, వాటి తయారీ, సరఫరాలో అనేక అవాంతరాలు, అంతరాయాలు కలుగుతున్నాయి.

 
'వ్యాక్సీన్‌ నేషనలిజం' అంటే ?
తమ దేశ ప్రజలందరికీ ముందుగా, సరిపడా వ్యాక్సీన్‌ను సమీకరించడానికి వివిధ దేశాలు అవసరమైతే అక్రమ మార్గాల్లోనూ చేసే ప్రయత్నాన్నే 'వ్యాక్సీన్‌ నేషనలిజం' అంటున్నారు. డబ్బున్న దేశాలు తమ ప్రజలకు అవసరమైన దానికన్నా ఎక్కువగా వ్యాక్సీన్‌ను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకు కెనాడా దేశాన్నే తీసుకుంటే, ఆ దేశం తమ ప్రజలకు అవసరమైన దానికన్నా ఐదింతలు ఎక్కువ వ్యాక్సీన్‌ కోసం ఒప్పందాలు చేసుకుంది. అంతే కాక అమెరికా దగ్గర మిగిలిపోయిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను తీసుకోవడానికి కూడా సిద్ధమైంది.

 
దేశ జనాభాకు రెండుసార్లకు సరిపడా వ్యాక్సీన్‌ సిద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నా, పెద్ద మొత్తంలో వ్యాక్సీన్‌ను నిల్వ చేసినట్లు బ్రిటన్‌ మీద ఆరోపణలున్నాయి. ఇక తమ దేశాలలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేదాకా టీకాను బయటకు పంపడానికి వీల్లేదని యూరోపియన్‌ యూనియన్‌ తన పరిధిలోని ఫార్మా సంస్థలను హెచ్చరించింది. "వ్యాక్సీన్‌ విషయంలో ప్రభుత్వాల వైఖరి ఇలాగే ఉంటే 2009 నాటి స్వైన్‌ ఫ్లూ సమస్యలాగా, ఇది కూడా ఎక్కువ కాలం కొనసాగే ప్రమాదం ఉంది" అని 'గావీ' అనే వ్యాక్సీన్‌ అలయన్స్‌కు సీఈవోగా పని చేస్తున్న సెథ్‌ బెర్క్‌లీ అన్నారు.

 
అందాల్సిన వారికి అందుతున్నాయా?
వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాక్సీన్‌ కోయిలిషన్‌ 'కోవ్యాక్స్‌' మీదనే పేద దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కోవ్యాక్స్‌ ఇప్పటి వరకు 70 దేశాలలో 32 మిలియన్‌ డోసుల వ్యాక్సీన్‌ను సరఫరా చేసింది. ఆఫ్రికన్‌ దేశాలకు కూడా త్వరలోనే వ్యాక్సీన్‌ సరఫరా జరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.

 
వ్యాక్సీన్‌ వ్యతిరేకత అంటే ఏంటి ?
చాలా దేశాలో వ్యాక్సీన్‌ను తీసుకోవడానికి ఇష్టపడని వారున్నారు. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇమ్యూనిటీ సాధించే ప్రయత్నాలపై ప్రభావం చూపుతుంది. ధనిక దేశాలలో కూడా టీకాను ఇష్టపడని వారు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఫ్రాన్స్‌, జపాన్‌లలో ఇటీవల జరిగిన సర్వేలలో సగంమంది జనాభా తమకు టీకా తీసుకోవడం ఇష్టం లేదని వెల్లడించారు.ఇదే తరహాలో పేద దేశాలలో కూడా కొంతమంది టీకా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.

 
అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా వ్యాక్సీన్‌ వ్యతిరేకత కారణంగా టీకా ప్రక్రియ 2023 వరకు కొనసాగే అవకాశం ఉందని 'ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌'కు చెందిన అగాథే డెమరైజ్‌ అన్నారు. ఈ ధోరణి కారణంగా ఈ ప్రపంచం నుంచి వైరస్‌ను పారదోలే ప్రక్రియ ఆలస్యమవుతుందని డెమరైజ్‌ అభిప్రాయపడ్డారు.

 
హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం ఎలా ?
ఒక దేశంలో నిర్దిష్టమైన సంఖ్యలో ఇమ్యూనిటీ సాధిస్తే తద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చు. చాలాసార్లు ఇది వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమవుతుంది. టీకాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి వ్యాపించకుండా అడ్డుకుంటాయి. అయితే ఎంత జనాభా ఇమ్యూనిటీని సాధిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందన్నది ఒక్కో వైరస్‌ను బట్టి ఉంటుంది. ఉదాహారణకు గతంలో వచ్చిన తట్టు (మీజిల్స్‌) వ్యాధికి 95శాతం మందిలో ఇమ్యూనిటీ అవసరం పడగా, పోలియోకు 80శాతం మందితో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చింది.

 
ఇప్పుడు కోవిడ్‌ విషయంలో 70శాతం మంది ఇమ్యూనిటీ సాధిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్‌ వచ్చి ఏడాది దాటినా ఇంకా అదుపులో లేదు కాబట్టి 70 నుంచి 90శాతం మధ్య ఇమ్యూనిటీ సాధించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చీఫ్‌ మెడికల్‌ ఎడ్వైజర్‌ ఆంథోనీ ఫౌచి అన్నారు.

 
వ్యాక్సీన్‌లతో కోవిడ్‌ పూర్తిగా పోతుందా?
టీకాలతో పూర్తిగా వ్యాధిని నిర్మూలించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగని వ్యాక్సీన్‌ వృథా అనుకోవడం కూడా సరికాదని, టీకాలు లేకపోతే కొత్త వేరియింట్లు పుట్టుకొచ్చి వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని యూకే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీలాంటి వారు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ అసలు ఉద్దేశం ప్రాణాలు కాపాడటం, ఇమ్యూనిటీ సాధించడం తద్వారా ఇది ఇతరులకు వ్యాపించకుండా కట్టడి చేయడమేనని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌లో డిసీజ్‌ స్పెషలిస్టుగా పని చేస్తున్న అజ్రా ఘనీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు