కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అమలు చేసిన లాక్డౌన్ ప్రభావం తమ దేశంపై తీవ్రంగా ఉందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ప్రకటించారు. ఫలితంగా తమ దేశం ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికార పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తలు వేలాదిగా హాజరుకాగా, పాంగ్ యాంగ్‌లో జరిగిన రాజకీయ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాదాపు దశాబ్ద కాలంగా కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియాను పాలిస్తుండగా, కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పెట్టిన లాక్డౌన్‌తో వ్యవస్థ కుదేలైంది.
ఇదేసమయంలో అమెరికా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తుండటం, అణ్వాయుధాల ప్రయోగాల తర్వాత ఆంక్షల తీవ్రత పెరగడంతో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల వర్కర్స్ పార్టీ కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
జనవరిలో పార్టీ అధిష్టానం తీసుకున్న అన్ని నిర్ణయాలనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత ప్రభుత్వంపై కన్నా కార్యదర్శుల పైనే ఉందని కిమ్ జాంగ్ ఉన్ అభిప్రాయపడ్డారు. సరికొత్తగా రూపొందించిన ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక అమలును వేగంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు.