కోవిడ్-19: కరోనావైరస్ లక్షణాలున్నా పరీక్షల్లో నెగెటివ్ ఎందుకు వస్తోంది? ఏం చేయాలి?

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (13:06 IST)
కరోనావైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షల్లో కొందరికి నెగెటివ్ రిపోర్ట్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురవుతోంది. డాక్టర్లు కూడా 'ఫాల్స్ పాజిటివ్', 'ఫాల్స్ నెగెటివ్' అనే మాటలు తరచూ వాడుతున్నారు. కరోనావైరస్ సోకిందనడానికి జ్వరం, చలి, దగ్గు, కఫం, ఒళ్లు నొప్పులు, అలసట, విరేచనాలు లాంటివి ప్రధానమైన లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే చాలామంది టెస్ట్ చేయించుకుంటున్నారు.

 
కరోనా సోకిందో లేదో తెలుసుకోడానికి ఈ పరీక్ష తప్పనిసరి. ఇందుకోసం రెండు రకాల టెస్టులు ఉన్నాయి. ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్టు, రెండోది యాంటీజెన్ పరీక్ష. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ ఈ పరీక్షల్లో కొందరికి నెగెటివ్ వస్తోంది.

 
ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి కారణమేంటి ?
పరివర్తన చెందిన వైరస్‌ టెస్టుల నుంచి తప్పించుకుంటోందా? చాలామందిలో ఉన్న అనుమానాలు ఇవి. వీటికి నిపుణుల నుంచి సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేసింది బీబీసీ.

 
ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ అంటే ఏంటి?
'రియల్‌ టైమ్-రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్ చైన్ రియాక్షన్‌ టెస్ట్. దీనినే సంక్షిప్తంగా ఆర్టీ-పీసీఆర్‌ (RT-PCR) టెస్ట్ అంటారు. సాధారణ భాషలో 'స్వాబ్ టెస్ట్' అని కూడా అంటుంటారు. ఈ పరీక్ష కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరిస్తారు. కోవిడ్ సోకిందో లేదో కచ్చితమైన సమాచారాన్ని ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు ఇవ్వగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే వైద్యులు 'గోల్డెన్ టెస్ట్' అని కూడా అంటున్నారు.

 
పరీక్ష ఎలా చేస్తారు?
ఒక వ్యక్తి శరీరంలోకి వైరస్ చేరిందో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ముక్కు, గొంతు నుంచి శాంపిల్‌‌ను సేకరిస్తారు. ఒక ప్లాస్టిక్ పుల్లకు ఉన్న దూది(స్వాబ్)ని ముక్కు, గొంతుల్లో అంటించి, అక్కడి నుంచి ద్రవాన్ని సేకరిస్తారు. దీనిని ఒక ట్యూబ్‌లో భద్రపరిచి ల్యాబ్‌కు పంపిస్తారు.

 
లక్షణాలు ఉన్నా నెగెటివ్
ముంబైకి చెందిన నమ్రతా గోరే (పేరు మార్చాం)కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. కానీ టెస్టు చేయించినప్పుడు నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ''లక్షణాలు కనిపించగానే డాక్టర్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ రిజల్ట్ మాత్రం నెగెటివ్ వచ్చింది. జ్వరం, దగ్గు ఆగలేదు. డాక్టర్ వాటికి చికిత్స కొనసాగించారు. కొద్దిరోజుల తరువాత పరీక్షలో కరోనా ఉన్నట్లు బైటపడింది'' అని నమ్రతా వివరించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులో కరోనా వైరస్ సోకినదీ లేనిదీ కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మాత్రం లక్షణాలున్నా నెగెటివ్ అని వస్తోంది.

 
''కొంతమందిలో కోవిడ్ ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. కానీ టెస్టుల్లో నెగెటివ్ అని వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో 'ఫాల్స్ నెగెటివ్' అంటారు'' అని ఫోర్టిస్-హిరానందాని హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఫరా ఇంగాలే అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా లక్షణాలు ఉన్నా, నెగెటివ్ రిపోర్ట్ రావడం ప్రమాదకరం. ఎందుకంటే తనకు వైరస్ సోకలేదన్న నమ్మకంతో ఆ వ్యక్తి ఇతరులతో సన్నిహితంగా మెలుగుతాడు. అప్పుడు వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం పెరుగుతుంది.

 
తప్పుడు రిపోర్ట్ ఎందుకు వస్తుంది?
దీనికి పలు కారణాలున్నాయని డాక్టర్ ఫరా ఇంగాలే అంటున్నారు.
*సరైన స్వాబ్‌ను వాడకపోవడం.
*శాంపిల్ సరిపడనంత రాకపోవడం
*శాంపిల్‌ను సేకరించాక దానిని సరైన రీతిలో భద్రపరచకపోవడం
*శాంపిళ్లను సరైన రీతిలో ల్యాబ్‌కు చేర్చకపోవడం

 
''కోవిడ్-19 ఒక రకమైన రైబో న్యూక్లియిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ) వైరస్. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే దాని గుణాలు త్వరగా మారిపోతాయి. వేడికి మరింత త్వరగా మారిపోతుంది. కాబట్టి, సరైన వాతావరణ పరిస్థితుల్లో వీటిని ల్యాబ్‌కు చేర్చకపోతే పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది'' అని నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌లో మైక్రోబయాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఒక డాక్టర్ చెప్పారు. ఆయన తన పేరును చెప్పడానికి ఇష్టపడలేదు. స్వాబ్ టెస్టులు చేసే వారికి సరైన శిక్షణ లేకపోవడం కూడా ఇలా ఫాల్స్ నెగెటివ్ ఫలితాలు రావడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

 
ఆహారం, నీరు తీసుకుంటే తేడా వస్తుందా?
వస్తుందనే అంటున్నారు డాక్టర్ ఫరా ఇంగాలే. కోవిడ్-పరీక్షకు ముందు ఏదైనా తినడం, నీరు తాగడం లాంటివి టెస్ట్ ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ''ఈ రెండు అంశాలు శరీరంలో వివిధ క్రియలలో జోక్యం చేసుకుంటాయి. అందువల్ల ఫలితాలు తేడాగా రావచ్చు'' అన్నారామె.

 
కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?
పరివర్తన(మ్యుటేషన్) చెందిన వైరస్‌ కూడా ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుపై ప్రభావం చూపే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 16న వెల్లడించింది. ''ఇండియాలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ రెండు జన్యువులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వైరస్‌లో ఒక మ్యుటేషన్ ఉన్నా, అది టెస్టు ఫలితం మీద ప్రభావం చూపించదు. టెస్టు పని తీరు మారదు'' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ వెల్లడించింది. టెస్ట్ కిట్‌లలో లోపాల కారణంగా తప్పుడు నెగెటివ్ ఫలితాలు రావడంపై రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ నవంబర్‌లో విడుదల చేసిన తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

 
లక్షణాలు ఉన్నా నెగెటివ్ రిపోర్ట్ వస్తే ఏం చేయాలి?
''ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా ఐదారు రోజులు లక్షణాలు కొనసాగితే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి'' అని సూచించారు డాక్టర్ ఫరా ఇంగాలే. ''లక్షణాలున్నా నెగెటివ్ రిజల్ట్ వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. మరోసారి టెస్టు చేయించుకోవాలి. మళ్లీ నెగెటివ్ వస్తే సీటీ స్కాన్ చేయించుకోవాలి'' అని ఫోర్టిస్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో పని చేస్తున్న డైరెక్టర్ డా. సందీప్ గోరే అన్నారు.

 
'ఫాల్స్ పాజిటివ్' అంటే?
ఒక్కోసారి వ్యక్తి శరీరంలో వైరస్ లేకపోయినా, టెస్టుల్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని, దీనినే 'ఫాల్స్ పాజిటివ్' అంటారని మైక్రో బయాలజిస్టులు చెబుతున్నారు. వైరస్ బాధితుల శరీరంలో చనిపోయిన వైరస్ దీనికి కారణం కావచ్చని వారు అంటున్నారు. వైరస్ ప్రభావం తగ్గిపోయిన నెల రోజుల వరకు ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

 
పరివర్తన చెందిన వైరస్... టెస్టు నుంచి తప్పించుకుంటుందా?
''ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లు త్వరగా పరివర్తన చెందుతాయి. పరీక్షించబోయే శాంపిల్‌లో మ్యుటేషన్ జరిగితే ఫలితం భిన్నంగా ఉంటుంది. అందుకే మ్యూటేట్ అయిన వైరస్ కోసం ప్రభుత్వం టెస్ట్ కిట్‌ను మారుస్తోంది'' అని ఓ మైక్రోబయాలజిస్ట్ చెప్పారు. జన్యు పరివర్తన క్రమం కోసం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాలను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు. తద్వారా మ్యుటేట్ అయిన వైరస్‌ను గుర్తిస్తారు. ''మ్యుటేషన్ కారణంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు నుంచి వైరస్ తప్పించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేము'' అని నిపుణులు అంటున్నారు.

 
హెచ్ఆర్‌సీటీ టెస్ట్ అంటే ఏంటి ?
హైరిజల్యూషన్ సీటీస్కాన్ టెస్ట్... దీనినే సంక్షిప్తంగా హెచ్ఆర్‌సీటీ టెస్ట్ అంటున్నారు. ఎక్స్‌రేలలో కూడా అంతుబట్టని విషయాలు సీటీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. ఇది వైరస్ బాధితుడైన వ్యక్తి గుండెను త్రీడీ రూపంలో చూపించగలదు. రోగికి దగ్గు ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హెచ్ఆర్‌సీటీ టెస్ట్ ఉపయోగపడుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వాంఖేద్కర్ తెలిపారు.

 
అయితే దీని వల్ల ప్రమాదం కూడా ఉందని, ఈ టెస్టు కారణంగా మరికొన్ని చికిత్సలు కూడా తీసుకోవాల్సి రావచ్చని అంటున్నారు. ''రేడియేషన్ ప్రమాదం కూడా ఉంది కాబట్టి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఈ టెస్ట్ చేయాలి'' అన్నారు వాంఖేద్కర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు