హైదరాబాద్‌లో డాక్టర్‌ కిడ్నాప్, ఛేజ్ చేసి కాపాడిన ఏపీ పోలీసులు

బుధవారం, 28 అక్టోబరు 2020 (15:08 IST)
హైదరాబాద్‌కి చెందిన ఓ డెంటిస్ట్‌ని కిడ్నాపర్ల చెర నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాపాడారు. హైదారాబాద్‌లో కిడ్నాప్ చేసి బెంగళూరు, షిమోగా వైపు తరలిస్తుండగా అనంతరపురం వద్ద పోలీసులు బాధితుడిని రక్షించారు. రాప్తాడు సమీపంలో పోలీసులు కిడ్నాపర్లు ఉన్న వాహనాన్ని గుర్తించారు. అందులో ఉన్న బాధితుడిని రక్షించారు. మరో ఇద్దరు కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు అనంతపురం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
 
హైదరాబాద్ లోని కిస్మత్‌పూర్ డెంటల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ హుస్సేన్‌ని 27వ తేదీ మద్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆస్పతి నుంచి కిడ్నాప్ చేశారు. ఐదుగురు వ్యక్తులు బుర్ఖాలు ధరించి వచ్చి ఆయన్ని అపహరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అక్కడి నుంచి ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు మరాఠీ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి మరో నలుగురు బృందానికి బాధితుడిని అప్పగించిన తర్వాత బొలోరో వాహనంలో తరలిస్తుండగా తెలంగాణా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం పోలీసులు రంగంలో దిగారు.
 
హైదరాబాద్ లోని కిస్మత్‌పురాలో డాక్టర్ హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ప్రతిష్టాత్మక రాయల్ వుడ్స్ విల్లాల అమ్మకందారుడు కావడంతో భారీ మొత్తంలో నగదు కోసం ఆయన్ని అపహరించినట్టుగా చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. దాంతో బాధితుడిని విడిపించేందుకు రంగంలో దిగిన పోలీసులు కంగనాపల్లి వైపు వెళుతుండగా అన్ని వైపులా చుట్టిముట్టి బాధితుడిని కాపాడగలిగామన్నారు.
 
నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పొలాల మీదుగా పారిపోయినట్టు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి కారులో పడి ఉన్న బాధితుడిని కాపాడినట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు