ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో నంబర్ వన్‌గా ఎలా మారింది? వరి, చెరకు పండించడం ఎందుకు తగ్గుతోంది

శనివారం, 17 డిశెంబరు 2022 (16:59 IST)
తూర్పు గోదావరి జిల్లాలోని దొమ్మేరు అనే గ్రామం కొవ్వూరు మండలంలో ఉంటుంది. గోదావరికి చేరువలో ఉండడం వల్ల సాగునీటికి లోటులేని ప్రాంతం. రెండు దశాబ్దాల క్రితం పూర్తిగా ఆహారపంటలే పండించేవారు. వరి, చెరకు ఎక్కువగా పండేది. కానీ, రానురాను పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ ఆహార పంటల సాగు తగ్గిపోతోంది. ఇప్పటికే ఈ గ్రామంలో 80 శాతం మంది ఉద్యాన పంటలే సాగు చేస్తున్నారు. తొలుత అరటి తోటలతో మొదలుపెట్టి ఇప్పుడు కూరగాయలు, ఇతర ఫలసాయం వైపు మళ్లారు.

 
దొమ్మేరు గ్రామం మాత్రమే కాదు.. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని రైతు సంఘాలు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు చెప్తున్నారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లోనూ వరి సాగు కన్నా ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాయలసీమ ఉద్యాన పంటల్లో ముందంజలో ఉంది. ఉత్తరాంధ్రలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కోస్తాలోని సముద్ర తీరంలో ఆక్వా సాగు పెరుగుతున్న కారణంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుండగా హార్టికల్చర్‌లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానికి చేరింది. విదేశీ మారకద్రవ్యం సంపాదించే ఆక్వా ఎగుమతుల్లో 60 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు హార్టీకల్చర్‌లోనూ ఏపీ ఆ దిశలో పయనిస్తోంది. ఆహార ధాన్యాల దిగుబడులని మించి ఉద్యాన ఉత్పత్తులు వేగంగా పెరగడానికి కారణాలు ఏంటి.. రైతులు  సంప్రదాయ పంటల నుంచి ఎందుకు మళ్లుతున్నారన్నది కీలకాంశం.

 
ఉద్యాన పంటల వైపుగా...
రైతులను వరి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలంటూ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయినా అక్కడి రైతులు వరి సాగు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో రైతులు భిన్నంగా సాగుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 59 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది. అందులో సాగుకు అనుకూలమైన భూమిలో వరి ఎక్కువగా పండిస్తారు. కొన్ని చోట్ల రెండు పంటలు, కొన్ని చోట్ల ఒక్క పంటయినా వరి సాగు చేయడం ఆనవాయితీగా ఉండేది.

 
కానీ ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మారుతోంది.  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ  లెక్కల ప్రకారం వరి సాగు విస్తీర్ణం గమనిస్తే 2021లో 40.77 లక్షలు ఎకరాల్లో ఉంది. 2022లో మాత్రం వరి సాగు లక్ష్యం 35.25 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. దిగుబడి కూడా 72 లక్షల టన్నుల నుంచి 68 లక్షల టన్నులకి తగ్గుతుందని అంచనా. గడిచిన మూడు సీజన్లలోనూ వర్షాలు సహకరించాయి. సగటు వర్షపాతం కన్నా అత్యధిక ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైంది. దాంతో వరి సాగుకి ఆటంకం లేదు. దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. అయినా ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం తగ్గడానికి అనేక కారణాల్లో ఉద్యాన పంటలకు ఆదరణ పెరగడం ఒకటని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వరి కాకుండా ఇతర ఆహారపంటల సాగు బాగా తగ్గింది. ముఖ్యంగా చెరకు సహా ఇతర పంటల సాగు తగ్గుదలతో ఉద్యానపంటల విస్తీర్ణం పెరుగుతోంది.

 
పండ్ల ఉత్పత్తిలో నంబర్ వన్
ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి 2014- 15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో 91 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి నమోదైంది. 2020 -21 నాటికి అది  ఒక కోటి 95 లక్షల టన్నులకు పెరిగింది.  అంటే పండ్ల ఉత్పత్తిలో  7 ఏళ్ల కాలంలోనే రెట్టింపు ఫలితాన్ని ఏపీ సాధించింది. సాగు విస్తీర్ణం కూడా అదే కాలంలో  5.45 లక్షల హెక్టార్ల నుంచి 8.01 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2022లో  ఇది మరింత పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఉత్పత్తి 99 లక్షల టన్నుల నుంచి 41 లక్షల టన్నులకు పడిపోయింది.

 
అంటే చెరుకు సాగుదారులు దాని నుంచి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నట్టు ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి లెక్కలు గమనిస్తే 2014- 15 సంవత్సరంలో 1.04 కోట్ల టన్నుల దిగుబడిని సాధించారు. ఆ తర్వాత వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో నికర సాగుభూమి పెరిగింది. దాంతో పాటుగా సగటు ఎకరా దిగుబడి కూడా 20 శాతం వరకూ పెరిగింది. అయినప్పటికీ ఆహార ధాన్యాల దిగుబడి మాత్రం 2020 21 నాటికి 1.12కోట్ల టన్నులుగా ఉంది. ఉద్యాన పంటల ఉత్పత్తిలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలను అధిగమించి ఏపీ ముందుకొచ్చింది.

 
దేశవ్యాప్తంగా 10.72 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తే అందులో ఏపీ వాటా 17.72 శాతంగా ఉంది. రాష్ట్ర విభజన నాటికి పండ్ల ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం గడిచిన 8 ఏళ్లలో పెరిగిన దిగుబడుల కారణంగా  అగ్రస్థానం దక్కించుకున్నట్టు  నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ప్రధానంగా అరటి, బత్తాయి. మామిడి, బొప్పాయి వంటి పండ్లలో ఏపీది మొదటి స్థానం. ఈ నాలుగు రకాల ఫలసాయం ద్వారానే 1.60 కోట్ల టన్ను ఉత్పత్తి జరుగుతోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పరిధిలో అరటి సాగు బాగా పెరిగింది. ఫలితంగా కేవలం అరటి పండ్ల ఉత్పత్తే 2021-22లో 62 లక్షల టన్నులుంది. ఇక్కడి అరటిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మామిడి 50లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. బత్తాయి 32 లక్షల టన్నులు, బొప్పాయి 15లక్షల టన్నుల దిగుబడితో దేశంలో ఏపీని ముందంజలో నిలిపాయి. 19 రకాల పళ్లు, 23 రకాల కూరగాయలు, 9 రకాల సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, ఆయిల్ పామ్, జీడి వంటి 6 రకాల ప్లాంటేషన్ పంటలు, 7 రకాల పువ్వులు, 5 రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.

 
పూలసాగుతో పరిమళాలు
పూల మొక్కల సాగు కూడా ఇక్కడ చాలాకాలంగా ఉంది. కడియం వంటి ప్రాంతాలు దేశంలోనే పూల సాగుకు ప్రసిద్ధి చెందాయి. ఇటీవల పూల సాగు అనేక ప్రాంతాలకు విస్తరించింది. అనంతపురం, కడప జిల్లాల్లో బంతి, చామంతుల సాగు పెరుగుతోంది. 2021-22 లెక్కల ప్రకారం ఏపీలో సాగు చేసిన పువ్వులలో మల్లె అత్యధికంగా 3848 హెక్టార్లలో సాగు చేశారు. 1.46 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు. బంతి పువ్వులు కూడా 3848 హెక్టార్లు సాగు చేయగా 77421 టన్నుల పువ్వులు దిగుబడి అయ్యాయి. మొత్తంగా అన్ని రకాల పువ్వులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. పండ్ల తోటలతో పాటుగా పూల తోటల విస్తీర్ణం కూడా పెరుగుతోంది. పూల మొక్కల విషయంలో దేశీయ, అంతర్జాతీయ రకాల మొక్కలను పెంచుతూ కడియం నర్సరీలు కూడా విస్తరిస్తున్నాయి.

 
ఈ మార్పునకు మూలం ఏమిటీ  
ఆక్వా, హార్టీకల్చర్ రంగాలతో ఏపీ వ్యవసాయ రంగ ముఖచిత్రమే మారిపోతోంది. ఇప్పటికే యంత్రాల వినియోగం పెరిగింది. కొత్తగా డ్రోన్లు సహా టెక్నాలజీ కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయం స్థానంలో రైతులు ఉద్యానపంటల వైపు మొగ్గు చూపడానికి అనేక కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది స్థిరమైన ఆదాయం ఉండడమేనంటూ డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

 
"వరి సాగు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. దిగుబడి పెరిగినా దానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర ఉండడం లేదు. ఉద్యానపంటలు అందుకు భిన్నం. ఒకసారి సాగు చేసిన తర్వాత దీర్ఘకాలం ఆదాయం ఇస్తాయి. కాబట్టి ప్రారంభంలో కష్టపడితే ఆ తర్వాత స్థిరమైన ఆదాయానికి ఢోకా ఉండడం లేదు. పైగా వరిసాగులో కూలీల వినియోగం ఎక్కువ. ప్రస్తుతం కూలీ రేట్లు అందుబాటులో లేవు. రైతులకు అది భారం అవుతోంది. అందుకే మానవ శ్రమ పాత్ర తక్కువగా ఉండే ఉద్యానపంటలకు ఆదరణ పెరుగుతోంది. మార్కెట్‌కు ఢోకా లేదు. విదేశీ ఎగుమతుల వల్ల రాబడి పెరిగే అవకాశం ఉంది. అంతర్గత మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇలాంటి అనేక కారణాలతో ఉద్యానపంటల వైపు మళ్ళుతున్నారు" అంటూ ఆయన వివరించారు. రాబోయే కాలంలో ఉద్యానపంటల ఏపీ అంతటా మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 

 
డ్రిప్ ఇరిగేషన్‌ది పెద్ద పాత్ర
రాష్ట్రంలో ఉద్యానపంటల విస్తీర్ణంలో డ్రిప్ ఇరిగేషన్‌ది కీలక పాత్ర. పదేళ్ల క్రితం కరవు ప్రాంతంగా ఉన్న రాయలసీమలో మేఘమథనం వంటి ప్రయోగాలు ఆశించిన సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి వనరులతో ఎక్కువ సాగు చేయడానికి మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా రాయలసీమలోని అనంతపురం వంటి జిల్లాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ సాగు విస్తీర్ణం పెరిగింది. డ్రిప్ పద్ధతిలో ఉద్యానపంటలు విస్తరించాయి. ప్రభుత్వం కూడా డ్రిప్ వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లు సహా రాయితీపై అందించడంతో ఒక్కో ఏడాది సుమారుగా 2లక్షల ఎకరాల వరకూ డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి వచ్చిన అనుభవం ఉంది.

 
దాని కారణంగానే ఉద్యానపంటల సాగుదారులకు ఆసక్తి పెరిగిందని రైతు సంఘం ప్రతినిధి  పి నరసింహరావు అన్నారు. "డ్రిప్ సామగ్రిని సబ్సిడీ ద్వారా సామాన్య రైతులకు కూడా అందించడంతో ఎక్కువ మంది పళ్లు, పువ్వులు పండించేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు వేరుశనగ తప్ప మరో పంటవేయడానికి ముందుకు రాని పొలాల్లో ఇప్పుడు విభిన్నమైన పంటలు చూడవచ్చు. రాయలసీమ రూపురేఖలనే ఉద్యానపంటలు మార్చేశాయి. కరోనా సమయంలో కూడా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పండిన ఉద్యానపంటలను ప్రత్యేక రైలులో దిల్లీకి తరలించిన అనుభవం ఉంది"అంటూ ఆయన గుర్తు చేశారు. ఇటీవల డ్రిప్ ఇరిగేషన్ కోసం మైక్రో ఇరిగేషన్ శాఖ సబ్సిడీలు నిలిచిపోవడంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై దృష్టి పెడితే ఉద్యాన రైతులు మరింత ఉత్సాహంగా సాగు చేసి రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతారని నరసింహరావు  బీబీసీతో అన్నారు.

 
ప్రోసెసింగ్ యూనిట్ల ద్వారా మేలు
ఉద్యాన పంటల సాగుని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యాన పంటల ఉత్పత్తిదారులకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతులు పండిస్తున్న వాటికి అదనపు విలువను జోడించడం ద్వారా మార్కెటింగ్‌కి ఢోకా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

 
"ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటుంది. ఉద్యానవన శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటున్నారు. టెక్నికల్‌గా అవసరమైన సహాయం అందిస్తున్నారు. అదే సమయంలో రైతాంగం కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతూ ఉంది. కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్లి కూడా వాణిజ్య పంటలు సాగు చేస్తారు. వారంతా కొత్త పంటలకు ఆసక్తిగా ఉండడంతో వారికి సంప్రదాయ పంటల ఆదాయం కన్నా రెండు రెట్లు వరకూ ఆదాయం సంపాదిస్తున్నారు. మార్కెట్ లింకేజీ విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్‌షిప్‌తో మార్కెటింగ్, ఉత్పత్తి పెంపుదలకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అంటూ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. 

 
రాష్ట్రం నుంచి ఉద్యానపంటల ఎగుమతికి ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవడం, స్థానికంగానూ వినియోగం కోసం అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన బీబీసీతో అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా అందించిన సహకారం, రైతాంగం చొరవ కలిసి ఇప్పుడు ఏపీలో ఆహార పంటల వైపు నుంచి ఇతర పంటల సాగుకి ఆసక్తి పెరుగుతోంది. వచ్చే దశాబ్దంలో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలకు ఆధారమవుతోంది.

వెబ్దునియా పై చదవండి