ఒక ‘సెక్స్ స్కాండల్’ బ్రిటన్ ప్రధాని పదవికి ఎలా గండం తెచ్చింది?

గురువారం, 7 జులై 2022 (13:56 IST)
ఒక 'సెక్స్ కుంభకోణం' వల్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవి గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక మంది మంత్రులు ఆయన కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ కొందరు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. బోరిస్ జాన్సన్‌కు బాగా దగ్గరగా ఉండే మాజీ ఎంపీ క్రిస్ పించర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని డీల్ చేయడంలోనూ చర్యలు తీసుకోవడంలోనూ బోరిస్ విఫలమయ్యారంటూ మంత్రులు, ఎంపీలు ఆరోపించారు.

 
ఏంటీ లైంగిక వేధింపుల ఆరోపణలు?
ఈ ఏడాది జూన్ 30న బ్రిటిష్ న్యూస్ పేపర్ 'ది సన్' ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. దాని ప్రకారం నాటి కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ క్రిస్ పించర్, లండన్‌లోని ఒక ప్రైవేటు క్లబ్‌లో ఇద్దరు మగవాళ్లను లైంగికంగా వేధించారు. కొన్నేళ్లుగా పించర్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారంటూ ఇతర బ్రిటిష్ వార్తా పత్రికలు కూడా వరుసగా కథనాలు రాశాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తరువాత కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ పదవికి క్రిస్ పించర్ రాజీనామా చేశారు. పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపిన పించర్, 'ప్రొఫెషనల్ మెడికల్ సపోర్ట్' తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

 
బోరిస్ జాన్సన్ చేసిన తప్పు ఏంటి?
ఈ ఏడాది ఫ్రిబవరిలో క్రిస్ పించర్‌ను బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించారు బోరిస్ జాన్సన్. పించర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి తెలిసి కూడా ఆయనను బోరిస్ పదవిలో నియమించారనేది ప్రధాన ఆరోపణ. బోరిస్ జాన్సన్‌కు లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ముందు తెలియదని, పించర్‌ను పదవిలో నియమించిన తరువాతే తెలిసిందని... జులై 1న విడుదల చేసిన ప్రకటనలో ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ తరువాత బోరిస్ జాన్సన్ కేబినెట్‌లోని చాలా మంది మంత్రులు కూడా అదే చెబుతూ వచ్చారు.

 
కానీ పించర్ మీద ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి బోరిస్‌కు ముందే తెలుసంటూ జులై 4న బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి వెల్లడించారు. 'లైంగిక వేధింపుల మీద అధికారికంగా ఫిర్యాదు ఏమీ రాలేదు. వాటి మీద విచారణ జరగలేదు. సరైన ఆధారాలు లేని ఆరోపణల కారణంగా పించర్‌ను నియమించుకుండా ఉండటం సరైనది కాదు.' అని ప్రతినిధి వివరించారు. కానీ పించర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అధికారికంగా ఫిర్యాదు వచ్చిన సంగతి బోరిస్‌కు తెలుసు అనే విషయం, అదే రోజు మధ్యాహ్నం బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చింది. అధికారికంగా వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా పించ్ వేధింపులకు పాల్పడినట్లు తేలింది.

 
ఆ తరువాత బీబీసీతో మాట్లాడిన బోరిస్ జాన్సన్, తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. 'నాడు నా దృష్టికి ఫిర్యాదు వచ్చింది. అదీ చాలా కాలం కిందట. లిఖిత పూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా ఫిర్యాదు చేశారు. కానీ నేను దాని మీద స్పందించి చర్యలు తీసుకోని ఉండాల్సింది.' అని ఆయన అన్నారు. పించర్‌ను నియమించి తప్పు చేశానంటూ బాధితులకు బోరిస్ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనలతో బోరిస్ జాన్సన్ మీద చాలా మంది మంత్రులు, ఎంపీలు నమ్మకాన్ని కోల్పోయారు. వరసగా రాజీనామాలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు