తెలంగాణలో ఓ పెద్ద పులిని బంధించేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదని ఈనాడు ఓ కథనం ప్రచురించింది. రెండు నెలలుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న ఏ2(మగ) పులి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యానికి జారుకున్నట్లుగా పాదముద్రల ఆధారంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆపరేషన్ ఏ2 కు తాత్కాలిక విరామం ఇచ్చారు. బెబ్బులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన అటవీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
ప్రశాంతంగా ఉండే అడవిలో మంచెలు కనిపించడం, సిబ్బంది సంచారంతో ఏర్పడిన శబ్దాలతో ప్రమాదం పసిగట్టిన పులి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి పులి కదలికల ఆచూకీ లభించలేదు. కందిభీమన్న అటవీ ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల దూరంలో, నందిగాం పక్కనే ప్రాణహిత నదిని దాటి తాడోబా అభయారణ్యానికి పులి వెళ్లినట్లుగా సిబ్బంది గుర్తించారు. బెజ్జూరు మండలంలో రెండు ఆడపులులు తిరుగుతున్నందున వాటికోసం అది మళ్లీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.