పవన్ కల్యాణ్: ‘పవర్’పై వరుస ట్వీట్లు.. ‘విద్యుత్ కోతలే ప్రజలకు దసరా కానుకలా?’
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించారు. విద్యుత్ బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన చిత్రంతో తొలి ట్వీట్ చేసిన పవన్ అక్కడి నుంచి వరుసగా మరిన్ని ట్వీట్లు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ సన్నద్ధత లోపమే ప్రజలను చీకట్లో మగ్గేలా చేసిందని ఆయన ఆరోపించారు.
ఇటీవలి వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినప్పటికీ ప్రజలకు మాత్రం కోతలు తప్పడం లేదంటూ ఆయన గణాంకాలనూ ఉదహరించారు. ఈ ఏడాది వర్షాలు తగినంత కురవడంతో సహజంగానే విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని, సెప్టెంబర్‌లో సగటున రోజుకు 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు ముందుగానే అంచనా వేసినా ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 55 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతోందని.. అందువల్లే కోతలు తప్పడం లేదని ఆయన తేల్చారు. ''పల్లెల నుంచి నగరాల వరకు అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?'' అంటూ పవన్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
''2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగినట్లుగా సరఫరా చేయగలిగిన ఇంధన శాఖ ఈసారి ఎందుకు విఫలమైంది?'' అంటూ గత ఏడాది కంటే ఇప్పుడు డిమాండ్ తగ్గినా ప్రభుత్వం విఫలమైందన్న భావన వ్యక్తం చేశారు. ''2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమే. సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యార''న్నారాయన.
ఏపీ జెన్‌కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతున్నారే కానీ విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారని కూడా పవన్ అన్నారు.
ఇలాంటి ఆలోచనలుంటే కరెంటు కొరతపై దృష్టి ఏముంటుంది?
''ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో ప్రారంభిస్తారు. కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడులకు ఒప్పందాలు వంటివి చేస్తారు. కానీ, వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చేయడం, ఆశా వర్కర్లను రోడ్ల మీదకు తీసుకురావటం, కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం... మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?'' అంటూ ఆయన ట్వీట్లు చేశారు.
పవన్ ట్వీట్లపై ఆయన మద్దతుదారులు అనుకూలంగా కామెంట్లు పెడుతుండగా ప్రభుత్వ అనుకూల నెటిజన్లు పవన్‌పై విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ''రావాలి జగన్ రావాలి జగన్ అన్నారు.. ఇప్పుడు రావాలి కరెంట్ కావాలి కరెంట్ అంటున్నారు'' అంటూ ఎన్నికల ముందునాటి వైసీపీ నినాదాన్ని గుర్తు చేస్తూ వ్యంగ్యం కురిపించారు సైరా నివాస్ రెడ్డి అనే ట్విటర్ యూజర్.
''పీపీఏల గురించి ఎందుకు మాట్లాడరు.. అప్పుడే మీ మిత్రుడిని నిలదీస్తే ఇప్పటి మీ ట్వీట్లకు అర్థం ఉండేది'' అంటూ అమృతరావు అనే ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్లు చేసిన గంట వ్యవధిలోనే వేలాదిగా రీట్వీట్లు, కామెంట్లు వస్తుండడంతో ఆయన ట్వీట్లు వైరల్‌గా మారాయి.
5 జిల్లాల్లో కోతలు తప్పవు: ఈపీడీసీఎల్
రాష్ట్రంలో విద్యుత్ కొరతపై పవన్ ట్వీట్ల కంటే ముందు ఆదివారం 'ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి, లభ్యతకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడడంతో ఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా తగినంత లేకపోవడం.. బొగ్గు గనుల కార్మికుల సమ్మె, అధిక వర్షాల కారణంగా ఒడిశా నుంచి బొగ్గు సరఫరా తగ్గడం.. పవన విద్యుదుత్పత్తి తగ్గడం వంటివి ఈ పరిస్థితికి కారణాలయ్యాయని అందులో పేర్కొంది. రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అందులో వెల్లడించింది.