వేణుమాధవ్ మృతి.. పవన్ కల్యాణ్, చంద్రబాబు దిగ్భ్రాంతి..

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (16:44 IST)
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ బుధవారం కన్నుమూశారు. వేణు మాధవ్ మృతిపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. 
 
గోకులంలో సీత సినిమా నుంచి నాతో కలసి నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో మంచి నైపుణ్యం ఉండడంతో సెట్లో ఆనందంగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి, నా తరఫున, జనసేన తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా'' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
మరోవైపు వేణు మాధవ్ మృతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. ఆయన కుటుంబ సభ్యలకు అభిమానులకు సానుభూతి తెలిపారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ మృతి టీడీపీకి, తెలుగు సినీరంగానికి తీరనిలోటన్నారు. టీడీపీని, ఎన్టీఆర్‌ను వేణుమాధవ్ ఎంతో అభిమానించేవారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు