రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’

శుక్రవారం, 6 మే 2022 (21:38 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వాళ్లు మాత్రం మోసం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాహుల్ కోరారు. తమకు అవకాశం ఇస్తే తెలంగాణ కలను నెరవేరుస్తామని, పేద ప్రజలు, రైతులకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 
‘కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగవు?’
తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నా ఆయనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ చేత కానీ, ఈడీ చేత కానీ దాడులు ఎందుకు చేయించట్లేదు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య అవగాహన ఉందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనమని రాహుల్ అన్నారు.

 
‘బీజేపీకి తెలంగాణలో రిమోట్ కంట్రోల్ టీఆర్ఎస్’
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీకి రిమోట్ కంట్రోల్ లాగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి బీజేపీకి లేదని, ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసునన్నారు. అందుకే తాము చెప్పినట్లు నడుచుకునే రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం తెలంగాణలో ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు.

 
‘టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు.. ఆ పార్టీతో పోరాడుతాం, ఓడిస్తాం’
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తూ పెట్టుకోదని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో తాము పోరాడతామని, ఆ పార్టీని ఓడిస్తామని అన్నారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు పెట్టుకుంటే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.

 
‘తెలంగాణ కోసం ప్రజలు రక్తం చిందించారు.. ఈ 8 ఏళ్లలో తెలంగాణ కల ఏమైంది?’
రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వరంగల్‌లో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
"తెలంగాణ అంత సులభంగా రాలేదు. ఎందరో త్యాగాలతో తెలంగాణ వచ్చింది. గత 8 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిందా" అని ప్రశ్నించారు. "మీ కలలు నెరవేర్చుకునేందుకు మీ కన్నీళ్లను, రక్తాన్ని త్యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారు.

 
రాష్ట్ర ఏర్పాటు మాకెంతో నష్టాన్ని చేకూర్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల వైపు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది". తెలంగాణ కల కోసం ప్రజలు రక్తాన్ని చిందించారు. మరి ఈ 8 ఏళ్లలో తెలంగాణ కల నెరవేరిందా?

 
ప్రజల ప్రభుత్వం, రైతుల, కార్మికుల, పేద, బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని మీరనుకున్నారు. కానీ, నేటి తెలంగాణాలో ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక రాజు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి ప్రజల గొంతును వింటారు. రాజు తనకు నచ్చిందే చేస్తారు. ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజుకు ప్రజల అభిప్రాయాలతో పని లేదు.

 
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ముందు మేం ఆ రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంటకు కనీస మద్దతు ధర రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చాం. మేమిచ్చిన హామీలను అమలు చేశాం. తెలంగాణ రైతులు కూడా మిర్చి, వరి కోసం సరైన గిట్టుబాటు ధరను అడుగుతున్నారు. రుణ మాఫీ చేయమని అడుగుతున్నారు.

 
వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తున్న హామీ. ప్రతీ రైతు ఈ డిక్లరేషన్ చదవాలి. రైతు సంక్షేమం జరిగినప్పుడే తెలంగాణ కల సాకారమవుతుంది. తెలంగాణను మోసం చేసిన, నష్టం కలిగించిన పార్టీతో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీతో నేరుగా పోటీ పడతాం. "ప్రజల కోసం పోరాడే నేతలకు మాత్రమే ఎన్నికల్లో టికెట్లను ఇస్తాం". "నేను తెలంగాణకు అన్ని విధాలా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇది తెలంగాణ రైతుల, యువత పోరాటం కాదు. ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీతో పాటు నాది కూడా" అని అన్నారు. ఆదివాసీలకు 10శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. "కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి" అని కోరారు.

వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు సమస్యల పై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. "తెలంగాణ అంటే నినాదం కాదు, ఎన్నికల ముడిసరుకు కాదు, పేగు బంధం, ఆత్మ గౌరవం" అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "రైతును రాజును చేయడమే మా లక్ష్యం" అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

 
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ముఖ్యాంశాలు ఇవీ..
రైతులకు 2 లక్షల రూ, రుణ మాఫీ.
ఇందిరమ్మ రైతు పథకం ద్వారా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం.
భూమి లేని కూలీలకు రూ.12,000 ఆర్ధిక సహాయం.
రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పత్తికి రూ. 6500 గిట్టుబాటు ధర.
మూత పడిన చెరకు కర్మాగారాలను తెరుస్తాం.
మెరుగైన పంటల కోసం రైతులకు భీమా పథకం ప్రవేశం. రైతు కూలీలు, భూమి లేని వారికి కూడా రైతు భీమా పథకం వర్తింపు.
ధరణి పోర్టల్ రద్దు.
అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా వ్యవస్థను సరళీకృతం చేస్తాం.
వరంగల్, ఖమ్మం నకిలీ విత్తనాల బెడద రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తోంది. వీటి నియంత్రణకు కఠినమైన చట్టాలు తెస్తాం.
నిర్దిష్ట సమయ ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి. చివరి ఎకరా వరకు నీరు.
రైతుల హక్కుల పరిరక్షణ కోసం రైతు కమీషన్ ఏర్పాటు.
భూముల స్వభావం, వాతావరణ పరిస్థితుల కనుగుణంగా నూతన వ్యవసాయ విధానం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు