సెకండ్ వైఫ్ డాట్ కామ్: రెండో పెళ్లి చేసుకునే వారికోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌పై పాకిస్తాన్‌లో విమర్శలు ఎందుకు?
మంగళవారం, 4 మే 2021 (11:47 IST)
పాకిస్తాన్‌లో సెకండ్ వైఫ్ డాట్ కామ్ లాంటి వెబ్‌సైట్లు, యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటి ద్వారా స్త్రీ పురుషులు మాట్లాడుకోవచ్చు, కలుసుకోవచ్చు. వీటినే డేటింగ్ సైట్లు, డేటింగ్ యాప్‌లు అని పిలుస్తుంటారు. వాటిని వాడేవారిలో చాలామంది ఆ పరిచయాల ద్వారా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. బ్రిటన్‌లో నివసించే పాకిస్తాన్ సంతతికి చెందిన ఆజాద్ చాయ్‌వాలా నాలుగేళ్ల క్రితం ఇలాంటి వెబ్‌సైట్‌ను ప్రారంభించి దానికి 'సెకండ్ వైఫ్ డాట్ కామ్' అని పేరు పెట్టారు.
వెబ్‌సైట్‌కు పెట్టిన పేరు కారణంగా ఆజాద్ చాయ్‌వాలా బ్రిటన్‌లో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాక్ సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. వెబ్‌సైట్‌తో పాటు ఇటీవల మొబైల్ యాప్‌ను కూడా తయారు చేశారు చాయ్‌వాలా. ''బ్రిటన్, పశ్చిమ దేశాలలో నివసిస్తున్న ముస్లిం పురుషుల కోసం ఈ వెబ్‌సైట్‌ను సృష్టించాను. తద్వారా వారు తమ చట్టబద్ధమైన కోరికలను నెరవేర్చుకోగలరు'' అని ఆజాద్ చాయ్‌వాలా బీబీసీతో అన్నారు.
''ఇస్లాంలో పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇది సంప్రదాయం. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది'' అని ఆజాద్ చాయ్‌వాలా అభిప్రాయపడ్డారు. తాను పాశ్చాత్య దేశాలలో నివసించానని చెప్పిన ఆజాద్, ''అక్కడ స్త్రీ, పురుషుల మధ్య డేటింగ్, శారీరక సంబంధాలకు స్వేచ్ఛ ఉంది. కానీ ముస్లిం పురుషులు అలా చేయలేరు" అని అన్నారు.
''ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకునే అవకాశం ఇస్లాం చట్టబద్ధంగా కల్పిస్తోంది. అలా చేయకపోతే పాపం. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి సెకండ్ వైఫ్ డాట్ కామ్ అవకాశం కల్పిస్తోంది'' అన్నారాయన. ''విడాకులు తీసుకున్న, వితంతువులైన ముస్లిం మహిళలు చాలా మంది ఉన్నారు. సామాజిక పరిస్థితుల కారణంగా వారు తిరిగి పెళ్లి చేసుకోలేక పోతున్నారు. వారు తగిన భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారింది. వారికి మా వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది'' అన్నారు ఆజాద్ చాయ్‌వాలా.
ఇప్పటి వరకు నాలుగు లక్షలమందికి పైగా స్త్రీ పురుషులు తన వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో ఎక్కువమంది బ్రిటన్, అమెరికా, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వారేనని ఆయన తెలిపారు. చాయ్‌వాలా సృష్టించిన వెబ్‌సైట్‌కు పాకిస్తాన్ నుంచి 2300 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ''దీని గురించి వారికి సరైన అవగాహన లేకపోవడమే కారణం'' అని చాయ్‌వాలా అభిప్రాయపడ్డారు. అయితే, సోషల్ మీడియాలో, ముఖ్యంగా మహిళల నుంచి ఈ వెబ్‌సైట్ మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
'ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు పురుషుల అధికారం కాదు'
''మొదటి భార్య కనీస అవసరాలను కూడా తీర్చలేని వారు రెండో పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటారు'' అని అజ్రా పఠాన్ అనే సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యానించారు. ''చాలా సందర్భాలలో మొదటి భార్య కుటుంబ ఆర్ధిక భారాన్ని మోస్తుంది. వారిని ఎలా చూడాలి? సెక్స్‌కు చట్టబద్ధత కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని పఠాన్ విమర్శించారు.
''దేవుడు చెప్పినట్లు... ఈ వెబ్‌సైట్‌కు వచ్చే వాళ్లు, వితంతువులు, వయసు మళ్లినా పెళ్లి కాని వారిని, తమ అభిరుచులకు అనుగుణంగా లేకపోవడంతో విడాకులు తీసుకున్న మహిళలను వివాహం చేసుకుని వారికి సహాయం చేయడానికి వస్తున్నారని నేను ఊహిస్తున్నాను'' అని అబ్రీన్ రబ్ అనే యూజర్ వ్యంగ్యంగా రాశారు. ''ఇస్లాంలో బహు భార్యత్వం హక్కు కాదు, ఆప్షన్ మాత్రమే. అది కూడా అవసరానికి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది మొదటి భార్యను వేధించడానికి, సరదాకి, కామం కోసం ఈ నియమాన్ని వాడుకుంటున్నారు'' అని నాసిర్ ముహమ్మద్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ వెబ్‌సైట్ ఎలా పని చేస్తుంది?
ఈ వెబ్‌సైట్‌లో పేరును ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అందులో యూజర్ ఫొటోను కూడా పెడతారు. ఈ ఫొటో నిజమో, కాదో వెబ్‌సైట్ బృందం ధృవీకరిస్తుంది. ఫొటో ధృవీకరణ తర్వాత యూజర్ తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఎవరైనా నచ్చితే వారిని సంప్రదించవచ్చు. అయితే, తమకు నచ్చిన వారిని సంప్రదించాలంటే ప్రీమియం ఎకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికి నెలకు 20 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఈ వెబ్‌సైట్‌కు కేవలం 33 మంది ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఈ యాప్ డేటింగ్ కోసమేనా ?
''స్త్రీలు, పురుషులు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని, తర్వాత వారు వివాహం చేసుకోవచ్చు'' అని ఆజాద్ చాయ్‌వాలా చెప్పారు. అయితే, ఇందులో కలుసుకున్న జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారని రుజువేంటి? అని ప్రశ్నిస్తే ఆ వివరాలు తనకు తెలిసే అవకాశం లేదని చాయ్‌వాలా అంగీకరించారు. ఒక వేళ ఇది డేటింగ్ యాప్ అనుకుంటే, మరి మిగతా వాటికి, దీనికి తేడా ఏంటి? ఆన్‌లైన్లో ఇలాంటి డేటింగ్ యాప్‌లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కదా?
దీనికి, ''మా వెబ్‌సైట్‌ను ఉపయోగించే వారు దాన్ని కేవలం పెళ్లి కోసం మాత్రమే వాడుకోవాలి. అది వారి బాధ్యత'' అన్నారు చాయ్‌వాలా. ''ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి చాలామందికి తమ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారని, ఎక్కువమంది యూజర్లు అందుకే వస్తున్నారని చాలామంది నన్ను విమర్శిస్తున్నారు'' అని చాయ్‌వాలా అన్నారు. అయితే కొందరు మాత్రం పెళ్లిళ్ల పేరుతో డబ్బులు దండుకునే వ్యవహారమని సోషల్ మీడియాలో విమర్శించారు.
డబ్బు కోసమే డేటింగ్ యాప్
''ఇది కేవలం డేటింగ్‌కు ప్లాట్‌ఫామ్'' అని ముదాసిర్ హుసేన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో కామెంట్ చేయగా, ''మరో బ్రాండ్ మార్కెట్‌లోకి వచ్చింది'' అని నాసిర్ అమీర్ వ్యాఖ్యానించారు. ''టిండర్ (ఓ డేటింగ్ యాప్) ఆగిపోయింది. కొత్తది మొదలు పెట్టినట్లున్నారు'' అని అసీమ్ సర్దార్ అనే యూజర్ కామెంట్ చేశారు. ''ఇదొక ట్రెండ్. ఇది పాకిస్తాన్‌లో సున్నితమైన వ్యవహారం, డబ్బు సంపాదించే మార్గం. బాగా డబ్బు సంపాదించాలనుకుంటే ఒక డేటింగ్ యాప్‌ను మొదలుపెట్టవచ్చు'' అని సాజిదా షా అనే వ్యక్తి అన్నారు.
''ఈ వెబ్‌సైట్ ద్వారా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం అసాధ్యం. ఇందులో చేరేవారు సరదా కోసం చేరతారు. నిజంగా రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవారు సొంతంగా వెతికి చేసుకుంటారు. ఇలా డిజిటల్ బానిసలుగా మారిపోరు'' అని సాజిదా షా వ్యాఖ్యానించారు. ''తమ భార్యలను మోసం చేసి రహస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్ కొంతమందికి అవకాశం కల్పిస్తుంది. ఇది చట్ట విరుద్ధం'' అని కొందరు అన్నారు.
అయితే, ''ఇస్లాంలో ఒక వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవడానికి తన మొదటి భార్య నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు'' అని ఆజాద్ చాయ్‌వాలా బీబీసీతో అన్నారు. ఇలా పెళ్లి చేసుకోవడం ప్రతి ముస్లిం హక్కు. దీని వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే వారు విడాకులు తీసుకోవచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చాయ్‌వాలా చెప్పిన అంశాలపై ఇస్లాంలోని వివిధ వర్గాలలో భిన్నాభిప్రాయాలున్న విషయాన్ని కూడా విస్మరించలేము.
'పోషించడం కష్టం'
సగటు పాకిస్తానీ, ఒక భార్య, నలుగురు పిల్లలను పోషించడమే కష్టం. ఒక ఇంటి అవసరాలు తీర్చడమే దుర్లభంగా మారింది, అలాంటి పరిస్థితుల్లో నలుగురిని చేసుకుని ఎలా పోషిస్తారు? అని కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ''తన భార్యలు, పిల్లలందరి కోరికలను సమానంగా తీర్చగలిగిన ఒక్క మనిషిని చూపించండి'' అని ఒక యూజర్ సవాలు చేశారు. ''సంపాదన ఉంటే మంచిదే. కానీ దేశంలో 80 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అలాంటి వారు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎలా పోషిస్తారు?'' అని కొందరు ప్రశ్నించారు.
అయితే, రెండో వివాహం చేసుకోవాల్సిందిగా తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆజాద్ చాయ్‌వాలా అన్నారు. అలా చేసుకోవాలని కోరుకునే వారు మాత్రమే తమ యాప్‌లో, వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. తాను ఈ పనిని స్వచ్ఛందంగా చేయడం లేదని, డబ్బు కూడా సంపాదిస్తున్నానని ఆయన చెబుతున్నారు. తమ వెబ్‌సైట్ నిబంధనలను పాటించిన వారికి మాత్రమే తాము అవకాశం ఇస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తన యాప్‌కు రిజిస్ట్రేషన్ కోసం ఆరు లక్షలకు పైగా అప్లికేషన్‌లు వచ్చాయని, తమ యాప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, ఇంకా కస్టమర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆజాద్ చాయ్‌వాలా వెల్లడించారు.