తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: 'దొంగ ఓటు వేసిన టీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా చేయాలి' - Newsreel

శుక్రవారం, 19 మార్చి 2021 (15:48 IST)
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకురాలు తాటికొండ స్వప్న పరిమళ్ దొంగ ఓటు వేశారు. బూత్ నంబర్ -283లో, ఓటరు క్రమ సంఖ్య 528గా తాటికొండ స్వప్న అనే పేరు నమోదై ఉంది. అయితే, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, ఈ స్వప్న ఒకరు కాదు. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పేరు పరిమళ్. 528 సీరియల్ నంబర్లో ఉన్న స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్. ఆమె మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నకు తోటి కోడలు.
 
తాండూరు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న తన బంధువు పేరు మీద నమోదు అయిన ఓటును తన ఓటుగా వేయడం కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ దృష్టికి వచ్చింది. పట్టభద్రురాలు కాని స్వప్న ఎలా ఓటు హక్కు వినియోగించుకున్నారంటూ ఆరా తీసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
 
ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో ఈ విషయంపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఆమె దొంగ ఓటు వేసినట్లు నిర్ధారించారు. దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు