అమెరికా వెళ్తానన్నందుకు భార్యను హత్య చేసిన భర్త, ఆపై ఆత్మహత్య
శుక్రవారం, 5 మార్చి 2021 (11:02 IST)
అమెరికాలో ఉన్న కూతురి దగ్గరకి వెళ్లే విషయంలో వృద్ధ దంపతుల మధ్య ఏర్పడిన వివాదం ఆ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర్‌లో జరిగిన ఈ ఘటనలో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెద్దపాలపర్రుకి చెందిన సంక్రాతి సుబ్రహ్మణ్యేశ్వర రావు, విజయలక్ష్మి దంపతులు 30 ఏళ్ల కిందట రంగం బంజర్‌కు వలస వచ్చారు.
వారికి ఇద్దరు కుమార్తెలు కాగా అందులో పెద్ద కుమార్తె సరిత గోదావరిఖని ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రెండో కుమార్తె సునీత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కొద్దికాలం కిందట అమెరికా నుంచి సొంతూరికి వచ్చిన సునీత తల్లిదండ్రులను అక్కడికి రావాలని ఆహ్వానించింది. కొద్ది రోజులు తమతో ఉండి వెళ్లాలని కోరింది. దానికి అనుగుణంగా అమెరికా వెళ్లేందుకు విజయలక్ష్మి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కానీ సుబ్రహ్మణ్యం మాత్రం అందుకు నిరాకరించారు. ప్రస్తుతం తమకు ఇక్కడ పనులు ఉండడంతో అమెరికా రాలేమని కుమార్తెకి చెప్పిన ఆయన, భార్య కూడా అక్కడికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే కుమార్తె సునీత టికెట్ కూడా బుక్ చేయడంతో వీసా రెన్యువల్ కోసం విజయలక్ష్మి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఆయనకు ఇష్టం లేదని చెబుతూనే ఉన్నారు..
హైదరాబాద్‌లో ఈనెల 5న వీసా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అది పూర్తయితే ఈ నెల 21 లోపు అమెరికా వెళ్లాలని విజయలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమెను అక్కడికి వెళ్లవద్దని సుబ్రహ్మణ్యేశ్వరరావు వారిస్తూనే ఉన్నారని సమీప బంధువు ఎం.వీరేంద్ర బీబీసీకి తెలిపారు. వారి ఇంటికి సమీపంలో నివసించే ఆయన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బీబీసీతో పంచుకున్నారు.
''చిన్న కుమార్తె దగ్గరకు వెళ్లాల్సిన విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అక్కడికి వద్దని ఆయన వారిస్తూనే ఉన్నారు. ఇక్కడ అనేక పనులుండగా అమెరికా వెళ్లి కొన్నాళ్లు ఉండడం సాధ్యం కాదని కుమార్తెకి కూడా చెప్పారు. అయినా తల్లి, కుమార్తె ఏకాభిప్రాయానికి రావడంతో ప్రయాణ ప్రయత్నాలు జరిగాయి. అదే వారి తగాదా తీవ్ర స్థాయికి చేరడానికి కారణమై ఉంటుంది. చివరకు భార్యను హత్య చేసి, ఆయనే ఆత్మహత్యకు పాల్పడడం మమ్మల్ని విషాదంలో నింపింది. సమాచారం కుమార్తెలు, కుటుంబీకులందరికీ తెలియజేశాం'' అని చెప్పారు.
క్షణికావేశంలో జరిగి ఉంటుంది..
65 ఏళ్ల సుబ్రహ్మణ్యేశ్వర రావుకు పొలం ఉంది. అయితే అది పూర్తిగా కౌలుకి ఇచ్చేసినట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఆర్థికంగా స్థిరపడిన ఆయన మానసికంగా తన మాటే చెల్లుబాటు కావాలనే పట్టుదలకు పోతూ ఉండేవారని విచారణాధికారి చెబుతున్నారు. ఇద్దరు పిల్లలు స్థిరపడి సంతోషంగా సాగుతున్న తరుణంలో క్షణికావేశంలో చిన్న అంశంలో పట్టుదలకు పోయి హత్య వరకూ వెళ్లి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
'భార్యను కత్తితో నరికేసి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్నే పాలు పోసేందుకు వెళ్లిన వారు గుర్తించారు. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర రావుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. స్థానికుల సహకారంతో 108 వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలోన ఆయన మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఎఫ్ఐఆర్ నెం. 38/2021గా నమోదైంది. విచారణ జరుగుతోంది. మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ పూర్తయ్యింది. రిపోర్ట్ రావాల్సి ఉంది'' అని తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి 'బీబీసీ'కి తెలిపారు.