ఫేస్‌ యాప్ ఉపయోగిస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త...

శనివారం, 20 జులై 2019 (17:21 IST)
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌ యాప్ హవా నడుస్తోంది. జనం తాము ముసలివాళ్లైపోతే ఎలా ఉంటారో, ఆ ఫొటోలను ఈ యాప్ ద్వారా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌ యాప్ ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ యాప్ ఏ వ్యక్తి ఫొటోనైనా కృత్రిమ పద్ధతిలో వృద్ధుల ముఖంలా మార్చేయగలదు. కానీ మీ ముసలి ఫొటో మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు, ఆ యాప్ ఉపయోగించడం వల్ల వచ్చే ముప్పు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తుంది.

 
ఫేస్‌యాప్ యూజర్లు ఫొటోను ఎంచుకుని అప్‌లోడ్ చేస్తారు. దానిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పులు తీసుకొస్తారు. దీనికోసం యాప్ ద్వారా మీరు మీ ఫొటో తీయాల్సి ఉంటుంది.

 
చాలా ఇచ్చేస్తున్నారు
నిజానికి, అలా చేస్తూ మీరు ఈ యాప్‌కు మీ ఫొటోను మాత్రమే ఇవ్వడం లేదు. దానితోపాటు చాలా ఇచ్చేస్తుంటారు. ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఈ ఫొటోను గోప్యంగా ఉపయోగిస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ దానిని బహిరంగంగా కూడా ఉపయోగించవచ్చని మీకు తర్వాత తెలుస్తుంది.

 
ఈ యాప్ మీ ఫోన్ నుంచి నోటిఫికేషన్లను పొందగలదు. తర్వాత ఇదే నోటిఫికేషన్లను అది ప్రకటనలకు ఉపయోగించవచ్చు. తన ప్రకటనలో ఉపయోగించడానికి ఈ యాప్ మీ అలవాట్లు, ఆసక్తులను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుండవచ్చు. అందుకే దీనిని మార్కెటింగ్ ఆయుధంలా కూడా చూస్తున్నారు.
 
ఈ యాప్ మీ ఫోన్లోని ఫొటోలన్నిటినీ యాక్సెస్ చేయగలదని తెలీడంతో చాలామంది ఆందోళనలో ఉన్నారు. దీన్ని ఓపెన్ చేయగానే ఇంటర్నెట్‌లో తమ ఫొటోలన్నీ అప్‌లోడ్ అయ్యాయని చాలామంది చెబుతున్నారు. అయితే, ఐఓఎస్, ఐఫోన్‌లో "మీరు ఏ ఫొటోలను హ్యాండోవర్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫొటోలు వద్దు" అనే ఆప్షన్ వస్తుంది.

 
ప్రమాదంలో పౌరుల డేటా
ఫేస్‌యాప్ గురించి అమెరికా సెనేట్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఫేస్‌యాప్‌పై దర్యాప్తు చేయాలని సెనేట్‌లో మైనారిటీ నేత చక్ షుమర్ డిమాండ్ చేశారు. "ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. అమెరికా పౌరుల వ్యక్తిగత డేటాను విదేశీ శక్తులు స్వాధీనం చేసుకుంటున్నాయి" అని ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఒక లేఖలో ఆయనన్నారు.

 
ఈ ఆరోపణలను ఫేస్‌యాప్ కొట్టిపారేసింది. ఈ యాప్‌ను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న వైర్‌లెస్ ల్యాబ్ రూపొందించింది. ప్రజల ఫొటోలను శాశ్వతంగా స్టోర్ చేయడం ఉండదని, పర్సనల్ డేటాను దొంగిలించడం లేదని ఆ కంపెనీ చెబుతోంది. యూజర్స్ ఏ ఫొటోలను ఎంచుకుంటారో వాటినే ఎడిటింగ్ చేస్తామని చెప్పింది. ఈ యాప్‌పై ఎఫ్‌బీఐ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ద్వారా దర్యాప్తు చేయాలని షుమర్ డిమాండ్ చేశారు.

 
ఆయన తన లేఖలో "నాకు అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దాని దోపిడీ గురించి ఆందోళనగా ఉంది. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటో చాలామందికి తెలీడం లేదు" అని అన్నారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ యాప్ ఉపయోగించొద్దని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తమ అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిందని చెబుతున్న సమయంలో షుమర్ దానిపై దర్యాప్తునకు డిమాండ్ చేశారు.

 
ప్రైవసీ ఎంత ప్రమాదంలో పడింది అనేదానిపై అంత స్పష్టత లేదు, కానీ దీనిని ఉపయోగించకపోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని భద్రతాధికారి బాబ్ లార్డ్ అన్నారు. ఫేస్‌యాప్ కంపెనీ మాత్రం ఇప్పుడు తమకు 8 కోట్ల మంది యూజర్స్ ఉన్నారని చెబుతోంది.

 
2017లో ఫేస్‌యాప్ చాలా వివాదాస్పదమైంది. దాని ఒక ఫీచర్లో యూజర్స్ జాతిని ఎడిట్ చేసే సదుపాయం ఉంది. దానిపై విమర్శలు రావడంతో ఆ కంపెనీ క్షమాపణ కోరింది. ఆ ఫీచర్‌ను వెనక్కు తీసుకుంది. ఫేస్‌యాప్ కొత్తదేం కాదు. 'ఎథ్నిసిటీ ఫిల్టర్స్' గురించి రెండేళ్ల ముందు వివాదాలు వచ్చాయి. అందులో ఒక జాతి వారిని వేరే జాతివారుగా మార్చే టూల్ ఉంది. అయితే ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీకి చెందిన ఒక పరిశోధకుడు "ఫేస్‌యాప్ కేవలం యూజర్స్ అందించే ఫొటోనే తీసుకుంటుంది" అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు