పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
శుక్రవారం, 19 జులై 2019 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి..
ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్టు సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారు. భిన్నమైన పద్ధతుల్లో టెండర్లు ఉంటాయి. ఓపెన్ టెండర్, బిడ్డింగ్ సహా పలు పద్ధతులు అవలంభిస్తారు. ఇటీవల ఆన్ లైన్ లో టెండర్లు నిర్వహిస్తున్నారు. ఒకసారి ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థకు అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఏకారణం చేతనైనా సంతృప్తి చెందకపోతే పాత టెండర్లు రద్దు చేసే అధికారం ఉంటుంది. మళ్లీ టెండర్లు పిలవడానికి ఏ విధానాన్నయినా అవలంభించే స్వేచ్ఛకూడా ఉంటుంది.
కానీ పాత పద్ధతిలోనే, అదే కాంట్రాక్టుని, అంత కన్నా తక్కువకు నిర్వహించాలని నిర్ణయించి మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటి సారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయనే నిర్ధరణకు రావడం లేదా ఆ పనిని మరింత చౌకగా నిర్వహించడానికి అవకాశాలున్నాయనే అభిప్రాయానికి రావడంతోనే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా...
దేశంలో ఇప్పటి వరకూ రివర్స్ టెండరింగ్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్వహించలేదు. కానీ జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పోరేషన్ వంటి సంస్థల్లో ఇది అమలవుతోంది. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పలు ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టుతో రివర్స్ టెండరింగ్‌కి శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ ప్రక్రియను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాచరణ రూపొందిస్తోంది.
పోలవరం టెండర్ల ప్రక్రియ కథేమిటి..
ప్రస్తుతం సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో శ్రీకారం చుట్టారు. నాటి నుంచి టెండర్ల వ్యవహారంలో పలు వివాదాలు తెరమీదకు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలకు కూడా చేరాయి. టెండర్లు ఖరారు కావడంలో జరిగిన జాప్యంతో పనులు ముందుకు సాగని పరిస్థితి కూడా కనిపించింది. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2013 ఫిబ్రవరి 6న పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పగించారు.
ఆ తర్వాత 2016 అక్టోబర్ 7న చంద్రబాబు హయంలో ట్రాన్స్ ట్రాయ్‌తో మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు రద్దు చేసుకోకుండానే స్పిల్ వే పనుల్లో కొంత భాగం (1,244.366 కోట్లు) నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌కి కట్టబెడుతూ 2019 మే 17న ఒప్పందం జరిగింది. దానితోపాటుగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్లో కూడా ఓ భాగం(751.55 కోట్లు) కూడా నవయుగకు అప్పగిస్తూ అదే సంవత్సరం మే 22న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఈ రెండు పనులకు ఎల్ ఎస్ ఓపెన్ విధానంలో ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా గేట్లు ఏర్పాటు చేసే పనులను రూ. 387.56 కోట్ల మేరకు బీకెమ్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తూ 2018 నవంబర్ 11న ఒప్పందం జరిగింది. హైడల్ పవర్ స్టేషన్ పనులకు కూడా 2017 డిసెంబర్ 20 నాడు నవయుగ సంస్థకు అప్పగిస్తూ ఒప్పందం జరిగింది.
పలువురు కాంట్రాక్టర్లతో సమన్వయం సమస్య..
కాంట్రాక్టు సంస్థలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వానికి సమన్వయం సమస్యగా మారుతోందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్ఈ వి వేణుగోపాల్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘పోలవరం పనులను పలు సంస్థలు నిర్వహిస్తున్నాయి. భాగాలు చేసి పనులు అప్పగించడం మూలంగా పెద్దగా చొరవ కనిపించడం లేదు. పనుల తీరే దానికి నిదర్శనంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా అసంతృప్తిగా ఉంది. ప్రస్తుతం వరదల సమయం కావడంతో పనులు ఆగిపోయాయి.
కాఫర్ డ్యామ్ వంటి నిర్మాణాలు ముందుచూపు లేకుండా సాగాయి. అన్ని పనులను కలిపి ఒకే ప్యాకేజీ కింద చేపడితే ఉపయోగం ఉంటుంది. హెడ్ వర్క్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రం పనులు కూడా ఒకే సంస్థ చేపడితే ఏకకాలంలో పనులను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ అని అభిప్రాయ పడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ అవినీతి ఆరోపణలు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ పలు ఆరోపణలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఏడాది ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగసభలో అదే రీతిలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు. తాజాగా వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. పోలవరం పనులు, కేటాయించిన నిధులు, వినియోగం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరింది. ఆ కమిటీ నివేదిక కూడా ఈనెల 13న ప్రభుత్వానికి చేరింది. దాని ప్రకారం గత ప్రభుత్వ హయంలో రూ. 2346.85 కోట్ల అదనపు చెల్లింపులు సాగినట్టు తేలింది.
కేంద్రం అనుమతినిస్తుందా...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగొళ్ల ఒప్పందాలు(పీపీఏ)ల పునఃస్సమీక్షపై కేంద్రం జగన్ ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది. పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంటుందని, పునఃసమీక్షపై పునరాలోచన చేయాలని కేంద్ర ఇంధనవనరుల శాఖ మంత్రి నేరుగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో పీపీఏల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.
దానికితోడుగా ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునిర్విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. కానీ గత ప్రభుత్వం కోరిన మేరకు నిర్మాణ పనులను రాష్ట్రానికి అప్పగించినట్టు ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ కోసం కాంట్రాక్టు ఒప్పందాలు రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్ టెండర్ నోటిఫికేషన్ పిలవాలన్నా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ సంస్థకు అప్పగించిన పనుల అప్పగింతపై వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల నవయుగ, బీకెమ్ వంటి సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కి పిలవాలనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.3,529 కోట్ల మేర రివర్స్ టెండరింగ్ కోసం అనుమతించాలంటూ ఏపీ ప్రభుత్వం పీపీఏతో పాటుగా , కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపించబోతోంది. వాటికి అనుమతి లభిస్తుందా లేదా అన్నదే ఆసక్తిదాయకం.
రెండేళ్లలో పూర్తి చేస్తాం - అనిల్ కుమార్ యాదవ్
అవినీతిపై తప్ప పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకుండా పోయిందని, వైఎస్ హయంలో ప్రారంభించిన పనులను జగన్ హయంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని ఏపీ సాగునీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రివర్స్ టెండరింగ్ కి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్ ని అవినీతిమయం చేశారు. పెంచిన అంచనాల విషయంలో కూడా స్పష్టత లేదు. చివరకు ఏపీ ప్రభుత్వం 58,718 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే, దానిని 55వేల కోట్లకు ఖరారు చేసింది.
కుడి, ఎడమ కాలువ పనుల్లో కూడా 478 కోట్ల రూపాయల మేరకు స్పష్టత లేదు. వాటన్నింటినీ గమనంలో తీసుకుని ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేయాలని నిర్ణయించింది. 138 అవాసాలను కూడా నిర్లక్ష్యం జరిగింది. నిర్వాసితుల సమస్య మీద కూడా దృష్టి పెడుతున్నాం. రెండేళ్లలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించాము. వరదలు తగ్గిన వెంటనే నవంబర్ నుంచి పనులు వేగవంతం చేస్తాం. అందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
ప్రాజెక్ట్ నిర్మాణం మరింత జాప్యమే - దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కనిపించడం లేదని సాగునీటి శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ‘‘టీడీపీ హయంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు ఎంతో శ్రమించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేయడానికి శతవిధాలా ప్రయత్నించాము. ఈలోగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించాము. కానీ అవినీతి జరిగిందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదు. రూ. 60వేల కోట్లు మొత్తం ప్రాజెక్ట్ కేటాయింపులే లేనప్పుడు అంత అవినీతి ఎలా జరుగుతుంది. పోలవరంపై మా పార్టీ వైఖరిని అసెంబ్లీలో తెలియజేస్తాం’’ అని ఆయన అన్నారు.