ఉత్తర్‌ప్రదేశ్: తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
సోమవారం, 8 ఆగస్టు 2022 (21:13 IST)
28 ఏళ్ల కిందట ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఆరు నెలల పాటు అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. తర్వాత ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత ఆమె జీవితంలో చాలా కష్టాలు మొదలయ్యాయి. సమాజం కూడా ఆమెకు, ఆమె కొడుకుకు అండగా నిలవలేదు. అయితే, ఆమె కొడుకు తన తండ్రి ఎవరు అని ఆమెను అడగడం ప్రారంభించారు. తల్లికి జరిగిన అన్యాయం తెలుసుకున్న తర్వాత పట్టుదలతో నిందితులపై కేసుపెట్టి, అరెస్టుల వరకు తీసుకొచ్చాడు. ఆ తల్లీ కొడుకులు సమాజంతో, చట్టంతో చేసిన పోరాట గాథ ఇది.
మైనర్ బాలికపై అత్యాచారం
28 ఏళ్ల కిందట జరిగిన ఈ దారుణం గురించి తెలుసుకోవడానికి అత్యాచార బాధితురాలికి ఇంటికి బీబీసీ వెళ్లింది. ఆమె తన ఇద్దరు కుమారులు, కోడలితో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. 1994లో ఆమెకు 12 ఏళ్లు వయసు ఉన్నప్పుడు ఆమెపై ఇద్దరు నిందితులు (నాకీ, రాజీ అనే ఇద్దరు వ్యక్తులు) అవకాశం దొరికినప్పుడల్లా అత్యాచారం చేశారు. అప్పటికి అదంతా ఏమిటో ఆమెకు తెలియదు. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం బాగా లేకపోవంతో సోదరి ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు ఆమె గర్భవతి అని తేలింది.
''ఎవరు దీనికి కారణం అని డాక్టర్ నన్ను అడిగారు. వారి పేరు తెలియదని, కానీ ఇద్దరు వ్యక్తులు నాపై లైంగికంగా దాడి చేశారని చెప్పాను. అబార్షన్ చేయాలని మా సోదరి డాక్టర్‌ను కోరింది. కానీ, చిన్నవయసు కావడం వల్ల అది సాధ్యం కాదని డాక్టర్ చెప్పారు'' అని బాధితురాలు బీబీసీకి వివరించారు. అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం తమపై జరిగిన ఈ దారుణంపై గొంతు విప్పాలని అనుకున్నారు. కానీ, ఆమె 27 సంవత్సరాలుగా భయపడుతూనే బతికారు.
చిన్న వయసులోనే దారుణం...
''వారు నా గుండెల్లో భయం నింపారు. నన్ను కొట్టారు, భయపెట్టారు. చాలా సంవత్సరాల వరకు నేను మళ్లీ షాజహాన్ పూర్ వెళ్లాలని అనుకోలేదు. వాళ్లు నా కోడలిని, కొడుకులను చంపేస్తామని బెదిరించారు. నా ఇంటిని తగలబెడతామన్నారు'' అని బాధితురాలు చెప్పారు. చిన్నతనంలో తాను పోలీసు కావాలనుకునేదానినని బాధితురాలు అన్నారు. "నేను చిన్నప్పుడు సన్నగా ఉండేదాన్ని. ఏడో తరగతి చదివాను. మా సోదరితో కలిసి షాజహాన్‌పూర్‌కు వెళ్లినప్పుడు, నేను చాలా కలలు కన్నాను. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నా. కానీ, ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మా కలలన్నీ కల్లలయ్యాయి. నేను స్కూల్‌కు వెళ్లలేకపోయాను'' అన్నారామె.
భయాందోళన వాతావరణం
ఈ భయాందోళనల వాతావరణం నుంచి బయటపడటానికి, ఆమె తన సోదరి, బావతో కలిసి రాంపూర్‌లో స్థిరపడినట్లు చెప్పారు. రాంపూర్‌లో, 13 సంవత్సరాల వయస్సులో, ఆమె కొడుకుకు జన్మనిచ్చారు. ''నేను అత్యాచారానికి గురయ్యాను. కడుపులో బిడ్డ కోసం ఎన్నో బాధలు పడ్డాను. కానీ, ఎవరి కోసం అన్ని బాధలు పడ్డానో వాడిని నాకు చూపించలేదు. నాకు తెలివివచ్చి పిల్లవాడు ఎక్కడ అని అడిగినప్పుడు , వాడిని నువ్వు జీవితంలో ఇక చూడలేవు. దత్తత ఇచ్చాను అని అమ్మ చెప్పింది'' అని బాధితురాలు వెల్లడించారు.
2000 సంవత్సరంలో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. పెళ్లి చేసుకుని, మరో కొడుకుకు జన్మనిచ్చారామె. "పెళ్లయ్యాక అత్తమామల ఇంటికి వెళ్లాను. నా జీవితం అంతా సవ్యంగానే సాగుతోంది. ఆ సంఘటనను పూర్తిగా మర్చిపోవాలని అనుకున్నాను. జరిగినది పునరావృతం కాకూడదనుకున్నాను" అని చెప్పారామె. అయితే, పెళ్లయిన ఆరేళ్ల తర్వాత జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్ని మరోసారి సమస్యల్లోకి నెట్టింది. "నాకు ఇలా జరిగిందని నా భర్తకు ఎలా తెలిసిందో తెలియదు. ఆయన నన్ను వేధించడం మొదలుపెట్టారు. నేను ఎలాగో ఓర్చుకున్నాను. కానీ, ఒకరోజు నన్ను ఇంటి నుంచి గెంటివేశారు. నేను నా రెండో బిడ్డతో మళ్లీ నా సోదరి దగ్గరికి తిరిగి వచ్చాను" అని ఆమె వెల్లడించారు.
13 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీ కొడుకులు
దత్తతకు వెళ్లిన బాధితురాలి కొడుకు పెంపుడు తల్లిదండ్రులను కాదని బయటకు వచ్చారు. 13 ఏళ్ల కిందట విడిపోయిన తల్లీకొడుకులు మళ్లీ ఓ ఆస్పత్రిలో కలిశారు. పిల్లవాడిని దత్తత తీసుకున్న కుటుంబం అతన్ని తిరిగి తల్లికి ఇచ్చేసింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ "నా బిడ్డ నా వద్దకు తిరిగి వచ్చినప్పుడే నేను మొదటిసారి వాడిని చూశాను. వాడు అప్పటి నుంచి నాతోనే ఉంటున్నాడు''అని చెప్పారు బాధితురాలు. ''అమ్మా నాన్న అని పిలుస్తున్నావ్... నువ్వు వాళ్ల కొడుకువు కాదు, ఒక ముస్లిం వ్యక్తి కొడుకువి అని గ్రామంలోని వాళ్లు నా కొడుకును ఏడిపించారు, వాడు చాలా కుంగిపోయాడు'' అని బాధితురాలు వెల్లడించారు. తనను కలిసిన తర్వాత కూడా కొడుకు కుంగుబాటులోనే ఉన్నాడని ఆమె వెల్లడించారు. "వాడు చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. స్కూల్‌లో పిల్లలు అతన్ని ఆటపట్టించేవారు. దీంతో స్కూలుకు వెళ్లడం మానేశాడు. దత్తత తీసుకున్న వారు తండ్రి ఇంటి పేరు పెట్టడానికి సిద్ధంగా లేరు. మా ఇంటి పేరు ఎందుకు పెట్టాలి అని వారు ప్రశ్నించారు. మేం ఇద్దరం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో చెప్పలేం'' అని బాధితురాలు అన్నారు.
తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్న కొడుకు
''నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాను, నాకు తండ్రి ఎందుకు లేడు, నాకు గుర్తింపు ఎందుకు లేదు? అని నిత్యం బాధపడేవాడు'' అని తన కొడుకు గురించి బాధితురాలు చెప్పారు. తన తండ్రెవరో చెప్పమని తనను తరచూ నిలదీస్తుండే వాడని ఆమె వెల్లడించారు. కొడుకు బాధను చూడలేకపోయామని, వాడికి సమాధానం చెప్పలేకపోయామని బాధితురాలు వెల్లడించారు. "చిన్నతనంలో వాడు అలా అడిగినప్పుడు నేను తిట్టేదానిని. కానీ క్రమంగా వాడు పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి వెళ్లడం ప్రారంభించాడు. ఈ పేరులేని ఈ జీవితాని నేను జీవించలేను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేదంటే నా తండ్రి ఎవరో నాకు చెప్పండి'' అని అడిగేవాడని ఆమె చెప్పారు.
''ఒకసారి ఆత్మహత్య చేసుకోబోతే మేమంతా రక్షించాం. చివరికి జరిగిన విషయం వాడికి చెప్పాం'' అని బాధితురాలు వెల్లడించారు. అప్పుడు ఆమె కొడుకు ''ఇందులో నీ తప్పు లేదు. తప్పుచేయకుండానే శిక్షను అనుభవించావు. ఇన్ని సంవత్సరాలుగా ఈ కళంకంతో బతుకుతున్నావు. నా జీవితం కూడా నాశనమైంది. ఈ పాపం చేసిన ఎవరైనా శిక్షను అనుభవించాలి. మనం ఈ ప్రపంచానికి ఎందుకు దూరంగా ఉండాలి'' అని తన కొడుకు ప్రశ్నించాడని ఆమె తెలిపారు.
కొడుకు నుండి ప్రోత్సాహం
"ఏది ఏమైనా ఈ యుద్ధంలో పోరాడాలి. నువ్వు నేను వారికి గుణపాఠం చెప్పాలి. వాళ్లు అదే విధంగా మరొకరికి కూడా చేసి ఉండొచ్చు. మనం కేసు పెడితే నీలాంటి బాధితులు ఎవరైనా ఉంటే వారు కూడా ముందుకు వస్తారు. మనకు బలం పెరుగుతుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. నేరం చేసినవారు ఎవరూ దాని నుంచి తప్పించుకోలేరని సమాజానికి సందేశం వెళుతుంది అనేవాడు'' అని తెలిపారామె.
కొడుకు ప్రోత్సాహంతో 2020 సంవత్సరం నుంచి తిరిగి షాజహాన్ పూర్ వెళ్లడం ప్రారంభించారామె. కానీ, అది అంత సులభం కాలేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత తాను షాజాహాన్ పూర్‌కు వెళ్లినట్లు చెప్పారామె. ''కేసు నమోదు చేయించడానికి చాలా ప్రయత్నించాను. డైరెక్ట్‌గా పోలీస్‌స్టేషన్‌లో కేసు వేయడం కుదర లేదు. కోర్టుకు వెళ్లేందుకు లాయర్‌ని కలిసినప్పుడు, ఇంత పాత కేసులో ఆధారాలు ఎలా దొరుకుతాయని ఆయన ప్రశ్నించారు. నిందితులు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఏ విధంగా గుర్తిస్తావని అన్నారు. నేను ఉన్న ఇంటిని కూడా గుర్తు పట్టలేకపోయాను'' అని వెల్లడించారు బాధితురాలు.
కేసు నమోదు అంత సులభం కాలేదు
''నిందితుల జాడ తెలియలేదు. ఊరంతా మారిపోయింది.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు మళ్లీ మళ్లీ వెళుతుంటే మేడమ్, ఈ కేసులో బలం లేదు మీరు వెళ్లిపోండి అని లాయర్ అన్నారు. కానీ నాకు న్యాయం జరగాలని అన్నాను'' అని వివరించారామె. "మేం మా దగ్గరున్న ఆధారాలు తీసుకువస్తాం. మీరు మా కేసు తీసుకోండి" అని లాయర్‌తో చెప్పినట్లు తెలిపారామె. అనంతరం కోర్టులో కేసుకు దరఖాస్తు చేశారు. షాజహాన్‌పూర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, మార్చి 2021లో, సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు హసన్, అతని సోదరుడు గుడ్డును నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. అయితే, 28 ఏళ్ల నాటి ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించడం కూడా అంత సులభం కాదు. "నిందితుల్ని గుర్తించాలని పోలీసులు నన్ను అడిగారు. నేను అతన్ని గుర్తించాను. అతనితో ఫోన్‌లో కూడా మాట్లాడాను. అతను కూడా నన్ను గుర్తించాడు. అన్నదమ్ములిద్దరితో మాట్లాడాను. మీరిద్దరూ ఇంకా బతికే ఉన్నారా అని నన్ను వాళ్లు అడిగారు'' అని ఆమె చెప్పారు.
డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిందితుల గుర్తింపు
పోలీసులు, బాధితురాలు నిందితులను గుర్తించారు. కానీ, వాళ్లను చట్ట పరిధిలో శిక్షించడానికి డీఎన్ఏ పరీక్ష అవసరమైంది. ఇద్దరూ తనను రేప్ చేశారు కాబట్టి ఇద్దరినీ డీఎన్ఏ పరీక్షకు పిలిచారని ఆమె తెలిపారు. ఇద్దరిలో హసన్ అనే వ్యక్తికి నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో పాజిటివ్ అని వచ్చినట్లు ఆమె తెలిపారు. ఏడాది కాలంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర కుమార్ గుప్తా బీబీసీతో కేసు విషయాలు చెప్పారు. మొదట నిందితులకు నోటీసులిచ్చి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి..వారి నుంచి డీఎన్‌ఏ శాంపిల్ తీసుకున్నాం. ఎందుకంటే, ఇది చాలా పాత కేసు. కాబట్టి నేరుగా జైలుకు పంపడం కుదరదు. బాధితురాలు కూడా పాతికేళ్ల తర్వాత మెడికల్ టెస్టుల్లో ఏం తేలుతుందని ముందు డీఎన్ఏ టెస్టుకు నిరాకరించారు'' అని వెల్లడించారు.
'వారు నా జీవితాన్ని నాశనం చేశారు'
చివరకు, 31 జూలై 2021న, పోలీసులు నిందితుడు హసన్ రాజీని అరెస్టు చేశారు. ''అతన్ని అరెస్టు చేసినప్పుడు, ఇంత పాత కేసులో అరెస్టా అంటూ అతను కూడా మాలాగే ఆశ్చర్య పోయాడు'' అని పోలీస్ అధికారి ఆనంద్ అన్నారు. మొదటి అరెస్టు తర్వాత, కొడుకు తల్లితో, "నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆ రెండవవాడు కూడా అరెస్టయ్యాక నా సంతోషం రెట్టింపయింది అని చెప్పాడు'' అని బాధితురాలు వివరించారు. మరికొద్ది కాలంలో వీళ్లంతా కోర్టులో ముఖాముఖి ఎదురు కాబోతున్నారు. ''కోర్టులో వాళ్లిద్దరు ఎదురైతే, చెంప దెబ్బలతో వారిని చంపేయాలని ఉంది. వాళ్లు నా జీవితాన్ని నాశనం చేశారు. నేనే వాళ్లను శిక్షిస్తాను'' అని బాధితురాలు ఆవేశంతో అన్నారు.
"ఈ కేసు పెట్టాల్సిందిగా నా పెద్ద కొడుకే నన్ను ఒప్పించాడు. చిన్న కొడుకు కూడా అమ్మా నువ్వు పోరాడు, మేం మీతో ఉంటాం అని చెప్పాడు'' అని బాధితురాలు వివరించారు. అయితే ఈ సంఘటన, దాని ఫలితంగా అనేక సంవత్సరాల మానసిక హింసను ఎదుర్కొన్న ఆ కుటుంబం ఎప్పటికి కోలుకుంటుంది? "ఇది చాలా పాత విషయం. వాళ్లు, మాకు చేసిన గాయాలు ఇంకా మానలేదు. ఈ రోజు కూడా మా జీవితం స్తంభించిపోయింది. మేము ఆ క్షణాన్ని పదేపదే గుర్తుంచుకుంటాము. మన చుట్టూ తోడేళ్లు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలనే నేను మళ్లీ ఈ ఊరు వచ్చాను" అన్నారు బాధితురాలు.