టీకా ఉత్సవ్‌: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే 580 మందికి మాత్రమే ఇచ్చారు, టీకాల కొరతకు కారణమేంటి?

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:26 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్న సంజయ్ కుమార్... రెండు రోజులుగా తనకు, తన తల్లికి కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఎక్కడా వ్యాక్సీన్ దొరకడం లేదు. ‘‘మా ప్రాంతంలోని మూడు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించా. అందరూ తమ దగ్గర కోవిడ్ వ్యాక్సీన్ డోసులు అయిపోయాయని చెప్పారు’’ అని సంజయ్ కుమార్ అంటున్నారు.

 
సంజయ్ కుమార్ సామాజిక శాస్త్రవేత్త. దిల్లీ సరిహద్దుల్లోని ఘాజియాబాద్‌లో ఆయన ఉంటున్నారు. ‘‘వ్యాక్సీన్ స్టాకు లేదు. మేం ముందస్తు బుకింగ్స్ కూడా తీసుకోవడం లేదు. అలాగైతే జనం పోట్లాడుకుంటారు’’ అని సంజయ్ సంప్రదించిన ఓ ఆసుపత్రి సిబ్బంది సమాధానం ఇచ్చారు. అటు టీకా ఉత్సవ్‌లో భాగంగా విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే వారిలో 580 మందికి మాత్రమే టీకాలు ఇచ్చారని విశాఖ D.M.H.O సూర్యనారయణ చెప్పారు.

 
ప్రస్తుతం భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి సగటున రోజుకు 90 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా ముందుకు సాగడం లేదు. తమ దగ్గర వ్యాక్సీన్ డోసులకు కొరత ఏర్పడిందని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తగినంత స్టాకు ఉందని అంటోంది.

 
రోజూ నమోదవుతున్న కొత్త కోవిడ్ కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. తమ వద్ద ఇంకా 15 లక్షల వ్యాక్సీన్ డోసులు మాత్రమే ఉన్నాయని... అవి మరో మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

 
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో... కొల్హాపూర్, సంగ్లి, సతారా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. ‘‘మూడు రోజుల్లో వ్యాక్సీన్ డోసులు రాకపోతే, మేం వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపేయాల్సి వస్తుంది’’ అని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె అన్నారు. వ్యాక్సీన్ల కొరత ఉందని వస్తున్న ‘ఆరోపణలు’ పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అంటున్నారు.

 
‘‘వ్యాక్సినేషన్ నిర్వహణలో తమ అసమర్థతపై నుంచి దృష్టి మరల్చేందుకే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొరత ఉందని ఫిర్యాదు చేస్తున్న రాష్ట్రాలు తమ ఫ్రంట్‌లైన్ సిబ్బందికైనా ఇంకా పూర్తిగా వ్యాక్సినేషన్ చేయలేకపోయాయి’’ అని ఆయన అన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సీన్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన ఓమ్మెన్ సీ కురియన్ అంటున్నారు.

 
‘‘భారత వ్యాక్సీన్ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యం గురించి వేసిన అంచనాలు... గత నాలుగు నెలల్లో వాస్తవంగా ఉత్పత్తి అయిన డోసుల మధ్య తేడా ఉండటం వల్ల ఈ కొరత ఏర్పడి ఉండొచ్చు’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లోనే జరుగుతోంది. జనవరి 16న ఇది మొదలైంది. జులై చివరినాటికి 25 కోట్ల మందికి వ్యాక్సీన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 
మొదట్లో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సీన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లపైవారికి, అనంతరం 45 ఏళ్లకుపైగా ఉండి అనారోగ్యంతో ఉన్నవారికి, ఆ తర్వాత 45 ఏళ్లపైవారికి... ఇలా అర్హతల పరిధిని విస్తరిస్తూ వచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవ్యాక్సీన్‌ను... ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కలిసి రూపొందించిన కోవిషీల్డ్‌ను జనానికి ఇస్తున్నారు.

 
సగటున రోజుకు 30 లక్షల డోసులు వేస్తున్నారు. ఇక 85 దేశాలకు భారత్ 6.4 కోట్ల వ్యాక్సీన్ డోసులను పంపించింది. వీటిలో కొన్నింటిని ‘సాయం’గా భారత్ కొన్ని దేశాలకు ఇచ్చింది. మరికొన్ని వ్యాక్సీన్ తయారీ సంస్థలకు, స్వీకరిస్తున్న దేశాలకు మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం వెళ్లాయి. ఇంకొన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వహిస్తున్న కోవ్యాక్స్ కార్యక్రమం కింద ఎగుమతయ్యాయి.

 
ప్రపంచంలోని వ్యాక్సీన్లలో 60 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లోనే ఉంది. ఇతర పెద్ద సంస్థలు కూడా దేశంలో ఉన్నాయి. కానీ, ఇంత భారీ స్థాయి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేక సవాళ్లు విసురుతోంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు తగినంత వ్యాక్సీన్ల స్టాక్, సామర్థ్యం ప్రభుత్వానికి ఉన్నాయా అన్నదానిపై స్పష్టత లేదు.

 
యువతకు కూడా వ్యాక్సినేషన్ మొదలుపెట్టేంత స్టాక్ భారత్ వద్ద ఉందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ‘వ్యాక్సీన్ దౌత్యం’ కింద లక్షల డోసులను భారత్ ఇతర దేశాలకు ఇవ్వడం కూడా సరైన చర్యేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ ఉత్పత్తి వ్యవస్థ తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తోందని, భారతీయులందరికీ వ్యాక్సీన్‌ను సరఫరా చేయగలిగే స్థాయికి ఇంకా చేరుకోలేదని కోవీషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదారా పూనావాలా అన్నారు.

 
భారత్‌కు ప్రతి నెలా 6.5 కోట్ల నుంచి 7 కోట్ల డోసుల దాకా తాము అందిస్తున్నట్లు సీరం సంస్థ చెబుతోంది. ఇంతే మొత్తంలో వేరే దేశాలకు ఈ ఏడాది ఆరంభం నుంచి ఆ సంస్థ ఎగుమతి చేసింది. నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు సీరం సంస్థ గత జనవరిలో బీబీసీతో చెప్పింది. అయితే, జూన్ చివరినాటికి కూడా తాము ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని ఆ సంస్థ ఇప్పుడు అంటోంది. జనవరిలో పుణెలోని సీరం సంస్థ కొత్త ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనికి మరమ్మతులు చేసేందుకు సమయం పట్టడమే ఈ జాప్యానికి కారణమని ఆ సంస్థ తెలిపింది.

 
ఇక ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు నిధుల కొరత కూడా తమకు అడ్డంకిగా ఉందని సీరం సీఈఓ పూనావాలా అన్నారు. సామర్థ్యాల పెంపు కోసం వెచ్చించేందుకు సుమారు రూ.3 వేల కోట్లు ప్రభుత్వ సాయంగా గానీ, బ్యాంకు రుణంగా గానీ తమకు అవసరం అని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వానికి తాము వ్యాక్సీన్ ఒక్కో డోసును సుమారు రూ.150లకు విక్రయిస్తున్నామని, ఈ ధరతో తమకు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అవసరమైన నిధులు సమకూరవని పూనావాలా అన్నారు.

 
‘‘ఇది మొదటగా అనుకున్నది కాదు. మేం (మరింతగా) ఎగుమతులు చేస్తే, వాటిని తీసుకున్న దేశాల నుంచి మాకు నిధులు అందుతాయి. ఇప్పుడు అలా జరగడం లేదు కాబట్టి మేం మా సామర్థ్యాలను పెంచుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. దేశంలో కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేం ఈ పని చేయడం అవసరం’’ అని పూనావాలా అన్నారు. భారత్‌లో వ్యాక్సీన్ ‘కొరత’ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.

 
గత నెలలో ఆస్టాజెనెకా-ఆక్స్‌ఫర్ట్ వ్యాక్సీన్‌ను విదేశాలకు ఎగుమతి చేయడంపై భారత్ తాత్కాలిక నిషేధం విధించింది. జనవరి, ఫిబ్రవరిల్లో తాము 3 కోట్ల కోవ్యాక్స్ డోసులను ఎగుమతి చేశామని... మరో 3-4 కోట్ల డోసుల ఎగుమతి నిలిచిపోయిందని సీరం సంస్థ చెప్పింది. ‘‘భారత్‌లో వ్యాక్సీన్ డోసుల అవసరం తీవ్రంగా ఉండటంతో... ఎగుమతుల కన్నా ఇక్కడి అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వారికి తెలియజేశాం. ఆస్టాజెనెకా మాకు ఈ జాప్యంపై చట్టపరంగా నోటీసు కూడా ఇచ్చింది. భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు’’ అని పూనావాలా సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

 
సరఫరాపరమైన సమస్యలు కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సీన్ల కొరతకు కారణమవుతుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సీన్ తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అప్పుడు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మనకు మెరుగైన ప్రణాళికలు అవసరం’’ అని ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి అన్నారు. ఇప్పుడు భారత్ ముందు ఇతర మార్గాలు పెద్దగా కనిపించడం లేదు. రష్యా వ్యాక్సీన్ స్పూత్నిక్ వీ జూన్ కల్లా ఆమోదం పొందొచ్చు.

 
అమెరికా వ్యాక్సీన్ తయారీ సంస్థ నోవావ్యాక్స్‌తో కలిసి సీరం అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్ సెప్టెంబర్ కన్నా ముందు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ‘‘భారత్‌లో వయసు మీదపడిన 12 కోట్ల మందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేయాలి. రాబోయే కొన్ని వారాల్లోనే ఇది పూర్తవ్వాలి. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలు, పౌర సమాజం, మత నాయకులు, ప్రచార కార్యక్రమాలు... ఇలా అన్నింటి సహకారం తీసుకోవాలి. మరణాలను అడ్డుకునేందుకు ఇది తప్ప మనకు మరో మార్గం లేదు’’ అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన ఓమ్మెన్ సీ కురియన్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు