భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటే అమ్మాయిలనే సర్దుకుపొమ్మంటారు, అబ్బాయిలను ‘ఏం జరిగింది’ అని అడిగే సాహసం కూడా చేయరు, ఎందుకు?

బుధవారం, 10 ఆగస్టు 2022 (20:41 IST)
"ఒక అమ్మాయికి ఏమి కావాలి? సంతోషాన్ని పంచుకునేందుకు ఒక తోడు, దుఃఖంలో తల వాల్చేందుకు ఒక భుజం ఆసరా. ఒక చల్లని స్పర్శ. నా జీవితంలో లేనిది ఇదే" అని హైదరాబాద్‌కు చెందిన శివానీ (పేరు మార్చాం)అన్నారు. చాలా మంది అమ్మాయిలు వైవాహిక బంధాల్లో గృహ హింస భరిస్తూనో లేదో ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తూనో ఉంటూ ఉంటారు. చాలా మందికి ఆ బంధాల నుంచి బయటకు వచ్చే ధైర్యం ఉండదు. కొందరికి ఆర్ధిక స్వాతంత్య్రం లేకపోవడం, పిల్లల బాధ్యతలు కారణమైతే, మరి కొందరికి తల్లితండ్రులు, సమాజం నుంచి నైతిక మద్దతు అందకపోవడం వల్ల జీవితాంతం ఆ బంధాల్లో ఉండిపోతారు. శివానీది కూడా ఇలాంటి కథే.

 
శివానీకి పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత భర్తతో విబేధాలు రావడం మొదలయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఆమె ఉమ్మడి కుటుంబంలో అత్తమామలతో కలిసి ఉంటారు. అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న చిన్న చిన్న కలహాలను మనసులో పెట్టుకుని ఆమె భర్త అకస్మాత్తుగా మాట్లాడటం మానేశారని శివానీ బీబీసీకి చెప్పారు. ఈ దూరం ఏర్పడటానికి చెప్పేంత కారణాలేవీ లేవని ఆమె అన్నారు. ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే ఆమె పెళ్లి తర్వాత ఉద్యోగం కూడా మానేశారు. "మొదట్లో నాలుగు నాళ్ల అలక అని అనుకున్నాను, కానీ, రోజు రోజుకీ మొండితనం పెరిగి నా నుంచి మరింత దూరమయ్యారు తప్ప ఎటువంటి మార్పు లేదు".

 
"నాతో మాట్లాడరు, ఇద్దరి మధ్యా ఎటువంటి శారీరక సంబంధమూ లేదు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మరో కష్టం వచ్చినా పలకరింపు ఉండదు. నేనా ఇంట్లో ఒక అపరిచితురాలిని". "ప్రేమరాహిత్యాన్ని భరించలేక ఒక రోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్లి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక బస్ షెల్టర్‌లో ఉండిపోయాను. కొంత సేపటికి అమ్మా నాన్నలకు కాల్ చేసి విషయం చెప్పాను. నన్ను ఆ క్షణంలో వాళ్లింటికి తీసుకుని వెళ్లారు కానీ, ‘నువ్వే సర్దుకు పోవాలి’ అని సలహా ఇచ్చారు". "అత్తగారింటికి వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి తప్ప, నా పై ఎటువంటి ఆదరణ లేదు". "నేనిక్కడ ఏంటి? ఒక భార్యనా, తల్లినా, కోడలినా, ఇంటి పని మనిషినా? ఇవన్నీ నాకు నేనే వేసుకునే ప్రశ్నలు. వేటికీ సమాధానం దొరకదు".

 
"నాతో మునుపటిలానే ఉండమని బతిమాలాను, ప్రాధేయపడ్డాను. నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నించాను. చెప్పేందుకు వారి దగ్గర కూడా సమాధానం లేదు". "నీతో విసిగిపోయాం. చాలా డబ్బు ఖర్చుపెడతావు" లాంటి ఫిర్యాదులే కానీ, నాకు దూరం జరిగేంత తప్పులేవీ జరగలేదు. "ఏళ్లు గడుస్తున్నా కూడా నా పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ నా భర్తను ప్రశ్నించే సాహసం చేయలేదు". "నా తల్లితండ్రులు నేను బాధపడితే బాధపడేవారు కానీ, ఏమి చేయాలో అర్ధం కాని నిస్సహాయ స్థితిలో ఉండిపోయేవారు. ప్రశ్నిస్తే అత్తింటి వారి ఆత్మాభిమానం దెబ్బ తిని విడాకుల వరకు వస్తుందేమో, మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి అనే అభిప్రాయంతో ఉండేవారు".

 
" సర్దుకుపో, బయటకు వస్తే పిల్లలకు నీకు భవిష్యత్ లేదు" అని బంధువులు సలహా ఇచ్చేవారు. "అప్పటికి నేను ఉద్యోగం మానేసి 8 సంవత్సరాలు పైనే అవుతోంది. ఆర్ధిక స్వాతంత్రం లేదు. అమ్మ నాన్న ఖర్చులకు డబ్బు కావాలంటే ఇచ్చేవారు కానీ, ఇల్లు దాటి బయటకు వస్తే స్వీకరించే గుండె ధైర్యం లేదు". "ఓపిక పడితే పరిస్థితులు సర్దుకుంటాయి. సహనమే ఔషధం" అని మాత్రం చెప్పేవారు. "ఇంతలో అమ్మ ఒక రోడ్డు ప్రమాదంలో, నాన్న గుండె పోటుతో మరణించారు. మరింత ఒంటరితనంలో కూరుకుపోయాను". "2021లో లోన్ తీసుకుని ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. కానీ, ఇదంతా ఆర్ధిక స్వాతంత్రం కోసమే. ఈ ప్రేమ రాహిత్యం నుంచి బయటకు వచ్చి బ్రతికే ధైర్యం కూడా లేదు" అని చెప్పారు.

 
గృహ హింస భరిస్తున్న వారిని, ప్రేమ రాహిత్యం అనుభవిస్తున్న వారిని వివాహ బంధంలోంచి బయటకు వచ్చేందుకు తగిన నైతిక మద్దతు లభించదు. ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింత ఎక్కువగా ఎందుకు కనిపిస్తూ ఉంటాయి? కొన్ని తరాలుగా వేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ, సంస్కృతి, ఆచారాలు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఇలాంటి ధోరణికి కారణమని ఆంధ్ర యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ అంటారు. వేధింపులతో కూడిన బంధాల్లో కొనసాగడానికి వెనుక దాగిన సామాజిక కోణాన్ని విశ్లేషించారు. "చావో, బతుకో అత్తింటిలోనే అనే ఆలోచనా ధోరణి భారతీయ ఆలోచన విధానంలోంచి పుట్టింది. మెటీరియల్ సంస్కృతిలో సాధించిన పురోగతితో సమాంతరంగా సాంస్కృతిక పురోగతి సాధించలేదు".

 
"హిందూ వివాహంలో పెళ్లి అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. పెళ్లిలో ఆడపెళ్ళివారు ఇచ్చే లాంఛనాలు, కట్నం, పెళ్లి ఖర్చులు తల్లితండ్రులకు చాలా భారంగా మారతాయి. పెళ్లి అనేది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే తంతులా భావిస్తారు. దీంతో, సాధ్యమైనంత వరకు అమ్మాయిని వివాహ బంధంలో ఉండమనే సలహా ఇస్తారు కానీ, బంధాన్ని తెంపుకుని రమ్మని తొందరగా చెప్పరు" అని అన్నారు. "మధ్య తరగతి పరువు ప్రతిష్ట గురించి చాలా ఆలోచిస్తారు. పెళ్ళైన అమ్మాయి వెనక్కి తిరిగి రావడాన్ని పరువు తక్కువ విషయంగా, సున్నితంగా చూస్తారు. ఏమైపోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు అని చెబుతూ ఉంటారు. సర్దుకుపోవడమే విలువలకు కట్టుబడి ఉండటం అని భావిస్తారు" అని అన్నారు.

 
ఇలాంటి పరిస్థితులే చాలా మంది అమ్మాయిలు సరైన సమయంలో సహాయం అందక ప్రాణాలు తీసుకునేదాకా దారి తీస్తుందని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఒక గర్భిణి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త ఒక మానసిక రోగి అని తన శవాన్ని కూడా తాకానివ్వొద్దని ఆమె డైరీలో రాసుకున్నారు. "ఈమె తన పుట్టింటి వారికి బాధలు చెప్పుకుని కాపాడమని అడిగారు. అయితే, ఆమె తల్లితండ్రులు భార్యా భర్తల మధ్య గొడవలు సహజం అని అన్నారు. తర్వాత మాట్లాడదాం" అని ఆమెకు సర్ది చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఏమి చేయాలో అర్ధం కాని ఫిర్దోస్ అన్సారీ ఆత్మహత్య చేసుకున్నారని వార్తలొచ్చాయి.

 
శివానీ విషయంలో కూడా ఆమె తల్లితండ్రులు ప్రేమ రాహిత్యమే కదా, గృహ హింస లేదు కదా, కాస్త సర్దుకుపో అని మాత్రమే సలహా ఇచ్చారు. ఆమె భర్తను వారెప్పుడూ ప్రశ్నించలేదు. అయితే, ఆర్ధిక బలం, సామాజిక స్థాయి ఉన్న వారు ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిణమించరని శ్రీమన్నారాయణ అంటారు. "సామాజిక స్థాయి, వర్గం కూడా ఇలాంటి విషయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాల్లో ఇలాంటివి పెద్ద సమస్యలు కావు. కింది తరగతి, మధ్య తరగతి వర్గాల్లో చిన్న చిన్న సమస్యలకు సర్దుకుపోమని చెబుతారు" అని అన్నారు. "కానీ, ఈ పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా విద్యావంతుల్లో, నగరాల్లో పరిస్థితి మారుతోంది. అలా అని పూర్తిగా పరిస్థితులు పూర్తిగా మారాయి అని చెప్పలేం" అని అన్నారు.

 
భర్త నుంచి వచ్చే స్టేటస్‌ని చాలా మంది వదులుకోవడానికి కూడా ఒప్పుకోరు. సమాజంలో వైవాహిక బంధంలో ఉండటాన్ని ఒక హోదాగా చూస్తారు. మధ్య తరగతి వర్గాల్లో చాలా వరకు మీ భర్త ఏమి చేస్తున్నారు? అనే ప్రశ్నతో సంభాషణలు మొదలవుతూ ఉంటాయి. ఈ ప్రశ్నను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండలేరు. శివానీ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటానని, దానినెలా ఎదుర్కోవాలో అర్ధం కాక అత్తగారింటి నుంచి బయటకు రాలేకపోతున్నానని అన్నారు. సమాజంలో పరువు కోసం భర్తతో కలిసి ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌నే వాట్సాప్ డీపీగా పెట్టుకుంటానని చెప్పారు. "నిజానికి మా మధ్య ఎటువంటి బంధమూ లేదు. ఒకే ఇంట్లో ఉన్నా వేర్వేరుగానే ఉంటాం. కానీ, సమాజంలో మాత్రం నేను ఆయన భార్యగా చెలామణి అవ్వకపోతే నాకు గౌరవం లేదని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనను, ఆ ఇంటిని దాటి బయటకు రాలేకపోతున్నాను" అని నాతో చెబుతూ శివానీ వెక్కి వెక్కి ఏడ్చారు.

 
ఆర్ధిక స్వాతంత్య్రం కూడా నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తాయని శ్రీమన్నారాయణ అన్నారు. "ఆర్ధిక స్వాతంత్య్రం లేనప్పుడు తల్లి తండ్రులు కూడా వెనక్కి రమ్మని చెప్పేందుకు సంశయిస్తారు. వ్యవస్థ ద్వారా లభించే పరిష్కారాలు కూడా చాలా తక్కువగా ఉండటం కూడా మరో కారణం" అని అన్నారు. "చట్టాల్లో ఉన్న లోపాలు, న్యాయ ప్రక్రియలో చోటు చేసుకునే జాప్యం కూడా కొంత పాత్ర పోషిస్తాయి. పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు చాలా ఆలోచిస్తారు. న్యాయ సేవలు తీసుకునేందుకు అయ్యే ఖర్చు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఆటంకంగా నిలుస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమరాహిత్యం, సెక్స్ లేని బంధాలు, గృహ హింస ఉన్న బంధాల నుంచి బయటకు వచ్చేందుకు ముఖ్యంగా సమాజం, పరువు ప్రతిష్ట లాంటి ఆలోచనలు డామినేట్ చేస్తాయని అంటారు హైదరాబాద్‌కు చెందిన మానసిక వైద్య నిపుణులు పూర్ణిమ నాగరాజ.

 
కుటుంబ పరువు, ప్రతిష్టల పేరుతో హింసాత్మక, ప్రేమ రాహిత్య బంధాల నుంచి బయటపడే నిర్ణయం తీసుకోలేరని అంటారు పూర్ణిమ. సాధారణంగా పెళ్లిలో ఇచ్చే లాంఛనాలు, పెళ్లి సమయంలో పరిగణించే ఆర్ధిక స్థాయి, ఉద్యోగం, అందం లాంటి చాలా అంశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి ఆటంకాలుగా పరిణమిస్తాయని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడానికి వెనుక ఉన్న మానసిక కారణాలను ఆమె విశ్లేషించారు. "అమ్మాయి ప్రేమ రాహిత్యం అనుభవిస్తున్నాననో, వేధింపులకు గురవుతున్నాననో చెప్పినప్పుడు, "ఆ అబ్బాయి నీ పై చేయి చేసుకుంటున్నాడా? వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయా? డ్రగ్స్ తీసుకుంటున్నాడా? మద్యం సేవించే అలవాట్లు ఉన్నాయా"? లాంటి ప్రశ్నలు అడుగుతారు. దీంతో, ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోతుంది".

 
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా మంది, "సర్దుకుపోవడం నేర్చుకో, అబ్బాయిలు అలానే ఉంటారు" అని పదే పదే చెబుతారు. అమ్మాయిలు సమస్యను బయటకు చెప్పుకునే పరిస్థితులు కూడా చాలా కుటుంబాల్లో ఉండవు". "అబ్బాయికి లైంగిక సామర్ధ్యం లేకపోయినా అమ్మాయిని సర్దుకుపోయి ఉండమని చెబుతారు కానీ, అమ్మాయి సెక్స్‌కి ఆసక్తి చూపించకపోతే అదే కారణం చూపించి విడాకులు తీసుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు". "ఒక అమ్మాయి సెక్స్‌లో చురుకుగా లేదని చెప్పే సాహసం అబ్బాయి చేస్తాడు కానీ, లైంగిక జీవితం సంతృప్తికరంగా లేదని అమ్మాయి చెప్పినప్పుడు మాత్రం, 'నువ్వు వేశ్యవా, సెక్స్ కోసం పెళ్లి చూసుకున్నావా'? అని అడుగుతారు. ఇలాంటి చాలా ద్వంద్వ ప్రమాణాలు సమాజంలో ఉన్నాయి".

 
"ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం బంధంలో కొనసాగమని చెబుతారు కానీ, ఆ పిల్లలు ఒక హింసాత్మక వాతావరణంలో పెరుగుతున్నారని మాత్రం అనుకోరు. ఇలాంటి పరిస్థితులన్నీ ఆత్మహత్యలు చేసుకునేందుకు దారి తీస్తాయి" అని అన్నారు. "పెళ్లి అనే వ్యవస్థను నిలబెట్టేందుకు అభ్యంతరకర ప్రవర్తనను, పనులను, హింసను సమర్ధిస్తూ ఉంటాం. దీనికి చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది" అని పూర్ణిమ అభిప్రాయపడ్డారు. "పిల్లలు వారి వైవాహిక సమస్యలను తల్లితండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛను ఇవ్వగలగాలి. వారి జీవితాల గురించి నిర్ణయాలను తీసుకోగలిగే నైతిక సహకారాన్ని అందించగలగాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది" అని అన్నారు. శివానీ మాత్రం బయటకు వచ్చి బ్రతికే సాహసం చేయలేనని, ఈ బంధంలో కొనసాగడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు