భారత ప్రధాని మోదీని పాకిస్తానీయులు ఎందుకు పొగుడుతున్నారు? ఆయన పాత వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?

మంగళవారం, 3 మే 2022 (21:18 IST)
పాకిస్తాన్‌లోని సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత వీడియో క్లిప్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, తనకు లభించిన బహుమతులను మంచి పనులకు ఎలా వినియోగించారో చెప్పారు మోదీ.

 
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు సలహాలిచ్చేందుకు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. ఇమ్రాన్ ఖాన్, తన భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరా ఖాన్‌ 'అమాయకురాలు' అని సమర్థిస్తూ చేసిన ప్రకటనతో ఈ వ్యవహారం ప్రారంభమైంది. బుష్రా బీబీకి సన్నిహితంగా ఉన్నవారు నిర్దోషులని, "రాజకీయ ప్రతీకారాల" కారణంగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి, దర్యాప్తు చేస్తున్నారని ఆదివారం ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

 
ఫరా ఖాన్‌పై అక్రమ ఆస్తులు సంపాదన, మనీలాండరింగ్, వ్యాపారం పేరుతో బహుళ ఖాతాలను కలిగి ఉండడం వంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతో, పాకిస్తాన్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) వీటిపై దర్యాప్తు ప్రారంభించింది. ఆ మరుసటి రోజే, ఇమ్రన్ ఖాన్‌ పై వ్యాఖ్యలు చేశారు. గత మూడు సంవత్సరాలలో, ఫరా ఖాన్ ఖాతాలలో 84.7 కోట్ల డాలర్ల టర్నోవర్‌ కనిపించిందని ఎన్ఏబీ తెలిపింది.

 
ఇంతకీ ఆ వీడియో ఏంటి?
2018లో లండన్‌లో 'భారత్ కీ బాత్' అనే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఇది లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్ హాల్‌లో జరిగింది. గీత రచయిత ప్రసూన్ జోషితో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం అది. ఇందులో మోదీ మాట్లాడుతూ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక బహిరంగ కార్యక్రమాలలో తనకు విలువైన బహుమతులు అందేవని చెప్పారు. అవన్నీ ప్రభుత్వ ఖజానాలో వేసేవారని, తరువాత వేలం వేసి అందులో వచ్చిన డబ్బును ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చేవారని మోదీ చెప్పారు. అలా చేయడం ద్వారా ఆడపిల్లల చదువు కోసం దాదాపు 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వగలిగానని చెప్పారు.

 
పాకిస్తాన్ యూజర్లు ఏమంటున్నారు?
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పాకిస్తానీ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "ఇమ్రాన్ ఖాన్ లాగా మోదీ 'మేరా తోఫా మేరీ మర్జీ' (నా బహుమతులు నా ఇష్టం) అని ఎందుకు అనడం లేదు? తనకొచ్చే బహుమతులను ప్రభుత్వ ఖజానాలో భద్రపరచి, తరువాత వేలం వేసిన సంగతి, అలా వచ్చిన డబ్బును ఆడపిల్లల చదువుకు వినియోగించిన సంగతి మోదీ చెప్పారు" అని ట్విట్టర్‌లో అన్నారు.

 
పాకిస్తాన్ జర్నలిస్ట్ నస్రుల్లా మాలిక్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. "ఇమ్రాన్ ఖాన్.. మోదీ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మోదీ మాటలు మిమ్మల్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తాయి" అని ఆయన ఉర్దూలో రాశారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "ఇమ్రాన్ ఖాన్ ఈ వీడియోను తప్పకుండా చూడాలి. తనకొచ్చే బహుమతులను తన వద్దే ఉంచుకోలేదని, వాటిని వేలం వేసి ఆ డబ్బులను ఆడపిల్లల చదువుకు వినియోగించానని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు" అన్నారు.

 
పెషావర్ హైకోర్టులో న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త తారిఖ్ ఆఫ్ఘన్ ట్వీట్ చేస్తూ, "నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖజానాతో ఏం చేస్తారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన పనిని ప్రశంసిస్తారనే ఆశిస్తున్నా" అన్నారు. "మోదీ తనకొచ్చినవన్నీ ప్రభుత్వ ఖజానాకు ఇచ్చేశారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ అన్నీ తనే తీసుకున్నారు" అంటూ పాకిస్తానీ కాలమిస్ట్ కమర్ చీమా ట్వీట్ చేశారు.

 
బుష్రా బీబీ స్నేహితురాలు ఫరా ఖాన్ ఎందుకు చర్చల్లోకి వచ్చారు?
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలో ఆయన భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరా ఖాన్ సంపద అనేక రెట్లు పెరిగిందని గత నెలలో పాకిస్తాన్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఫరా ఖాన్‌ను ఫరాగుర్జార్, ఫర్హత్ షాజాది అని కూడా పిలుస్తారు. ఇమ్రాన్‌ఖాన్‌తో సన్నిహితంగా మెలిగిన అలీమ్‌ఖాన్, ఫరాపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఆమె ప్రభుత్వ బదిలీల్లో జోక్యం చేసుకుంటారన్నారని, పంజాబ్ ప్రాంతంలో ప్రతి నియామకం, బదిలీకి ఫరా ఖాన్‌కు లక్షల్లో సొమ్ము ముడుతుందని ఆయన ఆరోపించారు.

 
ఆలాగే, ఆమె అనేక నగరాల్లో చాలా ఆస్తులు కూడగట్టుకున్నారని, అనేక వ్యాపారాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఫరా ఖాన్ దుబాయ్ వెళ్లిపోయినట్లు కూడా పాకిస్తాన్ మీడియాలో ప్రచారం జరిగింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకురాలు రోమినా ఖుర్షీద్ ఫరా ఖాన్ ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో ఫరా ఖాన్ పక్కన ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగు విలువ సుమారు రూ.68 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

 
ఫరా ఖాన్ గురించి ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు?
ఏప్రిల్ 1న ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, "ప్రతిపక్షం నాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేక, నా భార్య, ఆమె స్నేహితుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఫరా ఖాన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు" అని అన్నారు. 

 
డాన్ న్యూస్ కథనం ప్రకారం, ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, "ఫరా ఖాన్‌పై దర్యాప్తు కేసును బహిరంగపరచమని ఎన్ఏబీని కోరుతున్నాను. ఇది కేసు పెట్టాల్సిన విషయమేనా? ఫరా ఖాన్‌కు అనామక పేర్లతో డబ్బులు వచ్చాయని ఎన్ఏబీ మొదట చెప్పింది. ఇలాంటి కేసులు ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద మాత్రమే పెడతారు. ఆమె ఎప్పుడైనా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారా? లేక ఏదైనా ప్రభుత్వ పదవిలో ఉన్నారా? గత 20 సంవత్సరాలుగా ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదించారో దర్యాప్తు చేయండి. ఆ రంగంలో పనిచేస్తున్నవారిని అడగండి" అని అన్నారు. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ తన మొదటి భార్య గురించి కూడా ప్రస్తావించారు.

 
"టైల్స్ స్మగ్లింగ్ చేసారని జెమీమాపై బుక్ చేసిన కేసు లాంటిదే ఇది కూడా. జెమీమా నా భార్య కావడమే ఆమె చేసిన తప్పు. ఫరా ఖచ్చితంగా నిర్దోషి. తన వైపు వాదన చెప్పడానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. దర్యాప్తు నిబంధనల ప్రకారం జరగాలి" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి వస్తువులను అమ్మడంపై ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించగా, అవి తనకు అందిన బహుమతులని, వాటిని ఏం చేయాలో నిర్ణయించే హక్కు తనకు ఉందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు