నాగబాబుకు మంత్రి పదవిపై జనసేన మౌనం ఎందుకు?

బిబిసి

మంగళవారం, 10 డిశెంబరు 2024 (17:34 IST)
జనసేన నేత కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబును ఏపీ మంతివర్గంలోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం(09.12.2024) విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌‌కి అన్నయ్య అయిన కొణిదెల నాగేంద్రబాబు అలియాస్‌ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు. అన్నయ్యని ఎవరైనా ఓ మాట అంటే వెనకాముందూ ఆలోచించకుండా విరుచుకుపడే నాగబాబు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కి కూడా రాజకీయాల్లో అదేరీతిన నిలబడ్డారన్న వాదనలున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిజానికి పవన్‌ కళ్యాణ్‌ కంటే చురుగ్గా పనిచేసిన నాగేంద్రబాబు.. ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌‌లోకి వెళ్లడంతో కాస్త సైలెంట్‌ అయ్యారు. మళ్లీ పవన్‌ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత ఆయన తమ్ముడు వెంట నిలిచారు.
 
2019లో నరసాపురం నుంచి ఎన్నికల బరిలోకి..
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎక్కడా పోటీ చేయని నాగబాబు, 2019లో మాత్రం జనసేన నుంచి నరసాపురం లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌ సభకు పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు. పవన్‌ కూడా బీజేపీ కోసం ఓ ఎంపీ సీటును జనసేన వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పారు.. పవన్ అనకాపల్లి సీటు గురించే చెప్పారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరిగింది.
 
ఇక ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించిన నేపథ్యంలో నాగబాబును జనసేన నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. ఇటీవల పవన్‌ కల్యాణ్ దిల్లీకి వెళ్లిన సమయంలో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరిట సోమవారం రాత్రి వెలువడిన ఓ ప్రకటనలో నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రకటనలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు చంద్రబాబు. సీఎం ప్రకటనతో నాగబాబు చట్టసభల్లోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే రాజ్యసభ అభ్యర్థుల పేర్ల ప్రకటనలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పడం.. ఆయన్ను రాజ్యసభకు పంపించడం లేదు కాబట్టి రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాన్నిచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు.
 
మంత్రివర్గంలో అన్నదమ్ములు..
ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ మంత్రివర్గంలో కొనసాగడం ఇది రెండోసారి అయినప్పటికీ అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా కొనసాగిన చరిత్ర గతంలో లేదు. అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినట్టు చెబుతూ వచ్చిన పవన్‌ కల్యాణ్.. ఇప్పుడు తన అన్న కూడా మంత్రివర్గంలో చేరిన తర్వాత జనసేన రాజకీయాలను ఎలా నడిపిస్తారు? అనే చర్చలు కూడా నడుస్తున్నాయి.
 
ముందు మంత్రిని చేస్తారా? ఎమ్మెల్సీ అయిన తరువాతా?
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వనందున నాగబాబును ముందుగా మంత్రివర్గంలోకి తీసుకొని ఆరు నెలల వ్యవధిలోగా ఎన్నికకు పోటీ చేయిస్తారా? లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, గత వైసీపీ హయంలో 25 మంది మంత్రులు కొనసాగగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులే కొనసాగుతున్నారు. ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో జనసేనకు ఆ ఛాన్స్‌ దక్కింది.
 
ఆ నలుగురిలో ముగ్గురు కాపులే..
నాగబాబు మంత్రివర్గంలోకి చేరితే జనసేన నుంచి మంత్రులైన నలుగురిలో ముగ్గురు కాపు కులానికి చెందిన వారే ఉంటారు. ఇప్పటికే ఉన్న ముగ్గురిలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, నాదెండ్ల మనోహర్‌ కమ్మ కులానికి చెందినవారు. ఇక జనసేనకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో.. 10 మంది కాపులు కాగా, ఇద్దరు ఎంపీలూ కాపు వర్గానికి చెందిన వారే.
 
బాబు ప్రకటన పవన్‌ కల్యాణ్‌కి ఇష్టం లేదా?
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్‌ హెడ్‌‌పై జనసేన నాయకుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చేసిన ప్రకటన ఒకింత చర్చనీయమైంది. ఆ ప్రకటనపై ఇప్పటివరకు అటు నాగబాబు గానీ, ఇటు టీడీపీ వర్గాలు గానీ ఎవరూ స్పందించలేదు. జనసేన అధికారిక మీడియా గ్రూపులలో మాత్రం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ‘సీఎం ప్రెస్ రిలీజ్’ అంటూ ఆ ప్రకటనను షేర్ చేశారు. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు బీబీసీతో మాట్లాడుతూ, ''పవన్‌ కల్యాణ్‌ నాగబాబుని ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని యత్నించగా చంద్రబాబు ఆ యత్నాలకు గండికొట్టారు'' అని అభిప్రాయపడ్డారు.
 
''బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యను ముందుగానే తన అభ్యర్థి అని బీజేపీ ముందుగానే స్పష్టం చేయగా, చంద్రబాబునాయుడు తనకున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి తమకు కేటాయిస్తారని జనసేన పార్టీ నేతలు భావించారు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావుతో పాటు సాన సతీష్‌కి అభ్యర్థిగా లైన్‌ క్లియర్‌ చేశారు'' అని కృష్ణాంజనేయులు అన్నారు.
 
టీడీపీ వర్గాల్లోనూ..
ఇక సాన సతీష్‌‌కి ఇవ్వడం టీడీపీ వర్గాలకు కూడా ఇష్టం లేదని, టీడీపీలో ఎంతోమంది సీనియర్లు రాజ్యసభ సీటును ఆశించగా లాబీయిస్టుగా పేరుపడ్డ సతీష్‌కు ఇవ్వడంపై ఆ పార్టీలోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని కృష్ణాంజనేయులు పేర్కొన్నారు. అందుకే ఇప్పటి వరకు అటు నాగబాబు నుంచి, జనసేన నుంచి గానీ.. ఇటు టీడీపీ నుంచి గానీ ఆ ప్రకటనపై ఎక్కడా హర్షం వ్యక్తం కాలేదని ఆయన అన్నారు. కాగా, బాబు ప్రకటన వచ్చి ఇరవై గంటలవుతున్నా ఇంతవరకూ నాగబాబు నుంచి స్పందన రాకపోవడం వ్యూహాత్మక మౌనమా? అనే చర్చ నడుస్తోంది. ఇక నాగబాబుతో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్‌లో యత్నించగా ఆయన నేరుగా అందుబాటులోకి రాలేదు, తరువాత మాట్లాడతానని చెప్పినట్టు ఆయన సన్నిహితుడు ‘బీబీసీ’తో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు