మీరు రిలయన్స్ జియో వినియోగదారులైతే అక్టోబర్ 10 నుంచి ఎయిర్ టెల్, వోడాఫోన్ లేదా ఏ ఇతర సంస్థకు చెందిన మొబైల్ వినియోగదారులకు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసలు చెల్లించాలి. అయితే, జియో ఫోన్ నుంచి మరో జియో ఫోన్ వినియోగదారుకు ఫోన్ చేస్తే మాత్రం ఏమీ చెల్లించాల్సిన పని లేదు. జియో టూ జియో కాల్స్ ఇకపై కూడా ఉచితమే.
ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చేయడానికి జియో 10 నుంచి 100 రూపాయల వరకు విలువైన రీచార్జ్ వోచర్లను అందిస్తోంది. ఈ వోచర్లను వాడినప్పుడు జియో వినియోగదారుడికి కొన్ని ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి ) నిమిషాలు లభిస్తాయి.
ఐయుసి (IUC) ఛార్జ్ అంటే ఏమిటి?
ఐయూసీ అంటే రెండు వేర్వేరు టెలికామ్ కంపెనీలు తమ వినియోగదారులు పరస్పరం మాట్లాడుకున్నందుకు వసూలు చేసే మొత్తం. సింపుల్‌గా చెప్పాలంటే... మీరు జియో సిమ్ నుంచి మీ స్నేహితుడు లేదా బంధువుల ఎయిర్ టెల్ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, జియోకు ఎయిర్ టెల్ నుంచి నిమిషానికి ఆరు పైసల ఐయూసీ చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ తన జియో సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఇతర టెలికాం కంపెనీలకు ఐయూసీ రూపంలో రూ .13,500 కోట్లు చెల్లించింది.
జియో నెట్‌వర్క్‌కు రోజూ 25- 30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తున్నాయని రిలయన్స్ తెలిపింది. దానివల్ల జియో వినియోగదారులు ఆ నెంబర్లకు కాల్ బ్యాక్ చేస్తారు. అలా జియో నెంబర్ల నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కు రోజూ 6.5 - 7 కోట్ల నిమిషాల కాల్స్ వెళ్తున్నాయి. ఆ మొత్తం సమయానికి జియో నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి వచ్చింది.
జియో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఐయూసీ చార్జీల విషయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విధానాల్లో మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని జియో తెలిపింది. ఐయూసీ రూపంలో రిలయన్స్ చాలా కాలంగా ఇతర సంస్థలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తోంది. 2019 తరువాత ఐయూసీ చార్జీలు రద్దవుతాయని భావించింది. కానీ, TRAI ఇప్పుడు ఈ విషయంపై అన్ని వాటాదారుల అభిప్రాయాలను అడిగింది. నిజానికి, ఐయూసీ చార్జీల రద్దు గురించిన చర్చ 2011 నుంచీ నడుస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తులు కూడా కొంత మేర జరిగాయి.
ఈ చార్జీలను 2020 జనవరి 1 నుంచి పూర్తిగా రద్దు చేస్తామని ట్రాయ్ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ సమస్యను పునః పరిశీలించే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఏది ఏమైనా, 2016లో టెలికాం సేవలు ప్రారంభించిన జియో సంస్థ వినియోగదారులకు కాల్స్‌కు సంబంధించి ఎలాంటి చార్జీలు ఉండవనే మాట ఇచ్చింది కదా అనే ప్రశ్న తలెత్తుంది. వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుని, భారతదేశంలోనే అగ్రశ్రేణి సంస్థగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
టెలికాం రంగ నిపుణుడు ప్రశాంతో బెనర్జీ దీనిపై స్పందిస్తూ, "రిలయన్స్ ఇక నష్టాల్ని కొనసాగించే స్థితి నుంచి బయటకు వచ్చింది" అని అన్నారు. "అంటే, రిలయన్స్ పెట్టుబడులు పెట్టే దశ నుంచి బయటకు వచ్చి, లాభాలు ఆర్జించాల్సిన దశలోకి అడుగు పెట్టింది. అందుకే, ఇకపై ఐయూసీ పేరుతో భారీ మొత్తాలను ఖర్చు చేయడాన్ని అది కొనసాగించే స్థితిలో లేదు. ట్రాయ్ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం తన మీద పడకూడదని ఆ సంస్థ భావిస్తోంది" అని బెనర్జీ వివరించారు.
రిలయన్స్‌కు దీనివల్ల ప్రయోజనం ఉంటుందా?
ప్రాథమికంగా, ఈ నిర్ణయం వల్ల రిలయన్స్‌కు ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే జియో తన వినియోగదారుల నుండి తీసుకునే డబ్బును ఐయూసీ చార్జీల కింద ఇతర ఆపరేటర్లకు ఇస్తుంది. దీనికితోడు, అది ఐయూసీ వోచర్ల మీద అదనంగా ఉచిత డేటాను కూడా ఇస్తోంది. అయితే, ఐయూసీ లెక్కలను లోతుగా అర్థం చేసుకుంటే, దానివల్ల అత్యధిక వినియోగదారులున్న సంస్థకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలుస్తుంది. రిలయన్స్ జియో సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఆ సంస్థకు 35 కోట్ల మంది వినియోగదారులున్నారు.