"అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్.. అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలా పదేపదే అంబేద్కర్ పేరు స్మరించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేది". పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని ఈ చిన్న భాగంపై గందరగోళం ఏర్పడింది. పార్లమెంటు కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ ప్రకటన అంబేడ్కర్‌ను అవమానించేలా ఉందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై స్పందించేందుకు అమిత్ షా బుధవారం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించి, ఆయన సిద్ధాంతాలను పక్కనబెట్టి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వకుండా, రిజర్వేషన్ సూత్రాలను తుంగలో తొక్కినవారే నేడు ఆయన పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. మరోవైపు, అంబేడ్కర్ గౌరవార్థం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అయితే, వివాదం ఇంతటితో ముగియలేదు. అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాబా సాహెబ్‌ను, రాజ్యాంగాన్ని అవమానించారని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకూడదని వారి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం తెలియజేస్తోందని ఖర్గే ఆరోపించారు. అదే సమయంలో అంబేడ్కర్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.
బీజేపీ ఎందుకు స్పష్టత ఇచ్చింది?
అమిత్ షా ప్రకటన అంబేడ్కర్‌ను అవమానించినట్లుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఇది బీజేపీ దళిత రాజకీయాలను ప్రభావితం చేయనుందా? దీనిపై దళిత పరిశోధకుడు, పంజాబ్‌లోని దేశ్‌భగత్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హవల్దార్ భారతి స్పందిస్తూ.. ''దోపిడీ నుంచి విముక్తి కల్పించే వ్యక్తి దేవుడైతే.. కుల ఆధారిత భారతీయ సమాజంలోని కోట్లాది మంది ప్రజల దేవుడు అంబేడ్కర్. ఆయన శతాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా వివక్షకు గురైన షెడ్యూల్డ్, వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా సమానత్వ హక్కును కల్పించారు. అందుకే అమిత్ షా ప్రకటన అంబేడ్కర్‌ను అవమానించేలా ఉందని బాబాసాహెబ్ భావజాలం, దళిత రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులు భావిస్తున్నారు'' అని చెప్పారు.
అయితే ప్రస్తుతం అంబేడ్కర్ విషయంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉందని భారతి అంటున్నారు. అంబేడ్కర్ ఆలోచనలను అమలు చేయకుండా, రాజకీయ పార్టీలు ఆయన గుర్తింపును ఉపయోగించుకుని దళిత ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
బ్రాహ్మణులు, బనియాల పార్టీగా గుర్తింపు
అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన ప్రకటనతో బీజేపీ డిఫెన్స్‌లో పడింది. దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి గత కొన్నేళ్లుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణులు, బనియాల పార్టీ అని చెప్పేవారు. కానీ, దశాబ్ద కాలంగా బీజేపీ ఈ గుర్తింపును దాటి హిందూ సమాజంలోని ఇతర కులాలకు కూడా వెళ్లడంలో విజయం సాధించింది. కుల రాజకీయాల ఆధిపత్యం లేకుండా, హిందూ గుర్తింపు రాజకీయాలు బలపడాలని బీజేపీ ప్రయత్నించింది.
"ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానంగా మహారాష్ట్రలోని అగ్రవర్ణాల సంస్థ, ముఖ్యంగా బ్రాహ్మణులది. అందుకే మొదట్లో షెడ్యూల్డ్ కులాలు దీనికి ఆకర్షితులు కాలేదు" అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ అభయ్ కుమార్ దూబే అన్నారు. 'ఆర్‌ఎస్‌ఎస్‌లో బ్రాహ్మణవాదంపై విమర్శలకు ఆస్కారం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం సమానత్వం కాదు, సామరస్యం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనుకుంటే హిందూ ఓటర్లలో ఐక్యతను సృష్టించాలి. అయితే దళిత, ఓబీసీ వర్గాల ఓట్లను పొందకుండా అది సాధ్యం కాదు" అని దూబే అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఆర్‌ఎస్‌ఎస్ దీని కోసం ప్రయత్నాలు చేసింది. 1974లో బాలాసాహెబ్ దేవరస్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆ సంస్థ తన వైఖరిని మార్చుకుంది. అంబేడ్కర్, పెరియార్, మహాత్మా ఫూలే పేర్లను ఉదయం ప్రార్థనల్లో చేర్చింది. అంతేకాకుండా దళితులు, గిరిజనులను తనవైపు ఆకర్షించే కార్యక్రమాలను ప్రారంభించింది. బీజేపీని స్థాపించకముందే అంబేడ్కర్‌ను ఆర్‌ఎస్‌ఎస్ దగ్గరికి తీసుకుందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పర్వేష్ చౌదరి అన్నారు.
చిన్న కులాల వైపు..
"సమానత్వం, సామరస్యం రెండు వేర్వేరు విషయాలు. బీజేపీ సామరస్యం గురించి మాట్లాడుతుంది కాని, సమానత్వం గురించి కాదు. సమానత్వం అనేది అంబేడ్కర్ ప్రాథమిక ఆలోచన. అయితే, ఓటు రాజకీయాలకు అనేక మార్గాలున్నాయి" అని దూబే అన్నారు.
"అమిత్ షా వ్యాఖ్యలతో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయనకు అనిపించినదే చెప్పారు. భీమా కోరేగావ్ సంఘటన తర్వాత మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంబేడ్కరిస్టులను అణచివేసింది. బీజేపీ అంబేడ్కర్ ఇమేజ్‌ను మాత్రమే ప్రచారం చేసింది, ఆయన భావజాలాన్ని కాదు" అని అన్నారు దూబే.
అతిపెద్ద దళిత కులమైన జాతవ్ వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి దూరంగా ఉన్నప్పటికీ.. జాతవేతర దళిత కులాలను బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్, అంబేడ్కర్ జీవితంపై పరిశోధనలు చేసిన వివేక్ కుమార్ తెలిపారు. జాతవ్‌లకు బహుజన్ సమాజ్ పార్టీ దగ్గరగా ఉందని దూబే అన్నారు. దళితుల మధ్య కులాల విభజనను బీజేపీ సద్వినియోగం చేసుకుందని, చిన్న దళిత కులాలను తనవైపు ఆకర్షించుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంబేడ్కర్ భావజాలం తమదిగా చెప్పుకునేందుకు దేశ రాజకీయాల్లో పోటీ కనిపిస్తోంది. రాజ్యాంగం, కుల గణన, రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ నిరంతరం మాట్లాడుతోంది.
వివేక్ కుమార్ మాట్లాడుతూ "కుల గుర్తింపు చర్చలు బీజేపీకి ఇష్టం లేదు. అయితే, కాంగ్రెస్ నిరంతరం కుల గుర్తింపును ప్రోత్సహిస్తోంది. దీంతో దానికి స్పందించాలని బీజేపీ భావించింది. అంబేడ్కర్ చుట్టూ చర్చను సృష్టించడం ద్వారా బీజేపీ అదే ప్రయత్నం చేస్తోంది" అని అన్నారు. అంబేడ్కర్ పంచతీర్థను బీజేపీ ఏర్పాటుచేసింది. లండన్‌లో అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.
దేశంలో దళిత పార్టీలు చిన్నాభిన్నమయ్యాయి. పార్లమెంటుకు సొంతంగా ఎంపీలను పంపలేక పోతున్న బహుజన సమాజ్ పార్టీయే ఇందుకు ఉదాహరణ. దీంతో దళిత రాజకీయాలలో గ్రౌండ్ ఖాళీ అయిందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ దళిత రాజకీయాల ఎజెండాను నడుపుతోందని వివేక్ కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీ కూడా దూకుడు పెంచి దళితులను తన వైపునకు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతదేశంలో దళితుల జనాభా దాదాపు 16.6 శాతం, అయితే దళితుల వాస్తవ జనాభా 20 శాతానికి పైగా ఉండవచ్చని దళిత సంఘాలు భావిస్తున్నాయి. లోక్‌సభలో 84 స్థానాలను దళితులకు రిజర్వ్ చేశారు.
అయితే, కాంగ్రెస్‌తో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్లు, కుల జనాభా లెక్కలు, సమాన వాటా వంటి అనేక సమస్యలపై దళితులలో ఇప్పుడు అవగాహన పెరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించింది.
అమిత్ షా ప్రకటన బీజేపీకి నష్టమా?
అమిత్ షా ప్రకటన రాజకీయంగా బీజేపీకి పెద్దగా నష్టం కలిగించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆచరణాత్మకంగా పరిశీలిస్తే అంబేడ్కరిజంను అనుసరించే దళితుల సంఖ్య చాలా తక్కువని దూబే అభిప్రాయపడ్డారు.
''అలాంటి వారు దళిత జనాభాలో చాలా తక్కువున్నారు. అందుకే అధిక సంఖ్యలో ఉన్న మిగతా దళిత జనాభాపై అమిత్ షా ప్రకటన ప్రభావం చూపదు. దళితులందరికీ అంబేడ్కర్ పట్ల గౌరవం ఉంది. కానీ, ఆయన పేరు ఓట్లను ఎంత ప్రభావితం చేస్తుందనేది చూడాల్సి ఉంది. అంబేడ్కర్ రాజకీయంగానూ విజయం సాధించలేదు" అని దూబే అన్నారు.
ఈ అంశంపై బీజేపీని ఇబ్బంది పెట్టాలంటే మరింతగా గ్రౌండ్ లెవల్ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.