ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మృతులను జేసీబీలతో ఎందుకు ఖననం చేస్తున్నారు?

సోమవారం, 13 జులై 2020 (18:25 IST)
కరోనావైరస్ విస్తృతమవుతున్న దశలో కోవిడ్-19 బారిన పడి మృతి చెందుతున్న వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. మృతదేహాల తరలింపులో వివిధ చోట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు యంత్రాంగం కూడా స్పందిస్తోంది. ఇలాంటి ఘటనలపై దర్యాప్తులు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల సిబ్బందిపై చర్యలు కూడా తీసుకుంది.
 
శ్రీకాకుళం జిల్లా పలాస, తిరుపతి, నెల్లూరులో ఘటనలు 
కరోనా లక్షణాలతో మృతి చెందిన వారిని జేసీబీ సహాకారంతో ఖననం చేసిన ఘటన తొలుత శ్రీకాకుళం జిల్లా పలాసలో నమోదయ్యింది. పలాస ఉదయపురంలో జూన్ 26న కొందరు మునిసిపల్ అధికారుల నేతృత్వంలో ఓ వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించిన తీరు వివాదాస్పదం అయ్యింది. పీపీఈ కిట్లు ధరించి ఉన్న మునిసిపల్ సిబ్బంది ఈ మృతదేహాన్ని జేసీబీతో ఎత్తి, గోతిలో వేసి ఖననం చేసిన విజువల్స్ వైరల్ అయ్యాయి.
 
ఆ తర్వాత దాదాపుగా అదే తరహా ఘటన తిరుపతిలో నమోదయ్యింది. జూలై 5 నాడు తిరుపతి పట్టణ పరిధిలో ఓ మృతదేహాన్ని జేసీబీ సహాయంతో తరలిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల కోసం జేసీబీ వినియోగించినట్టు అధికారులు కూడా అంగీకరించారు.
 
తాజాగా జూలై 9న నెల్లూరు పెన్నా నది తీరంలో జరిగిన ఘటన కూడా చాలామందిని విస్మయానికి గురిచేసింది. అర్థరాత్రి పూట వాహనంలో తీసుకొచ్చిన కొన్ని మృతదేహాలను పెన్నా నదీ తీరంలో ఖననం చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అర్ధరాత్రి అంబులెన్స్ లలో కరోనావైరస్ సోకి మృతి చెందినవారి మృతదేహాలను తీసుకు రావడమే కాకుండా, జేసీబీ సాయంతో వాటిని పూడ్చివేసిన తీరు మీద విమర్శలు వెల్లువెత్తాయి.
 
ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి 
ఇలాంటి అమానవీయ ఘటనకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతదేహాలను ఎర్త్ మూవర్స్ తో తరలించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా వివిధ పార్టీల నేతలు కూడా వరుస ఘటనల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానవీయ ఘటనలు పదే పదే నమోదవుతున్న తీరు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ప్రభుత్వ స్పందన 
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనపై యంత్రాంగం స్పందించింది. “కరోనా మృతుల తరలింపులో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు. మృతదేహాన్ని తరలించినప్పుడు పాటించాల్సిన నిబంధనలు నిర్ధిష్టంగా చెప్పాము. గత నెలలో జరిగిన ఘటనలో వాటిని పాటించలేదని నిర్ధరించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం” అని జిల్లా కలెక్టర్ జే నివాస్ బీబీసీకి చెప్పారు.
 
జేసీబీ సాయంతో వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసిన ఘటనలో తొలుత పలాస మునిసిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ పై చర్య తీసుకున్నారు. సోంపేట మేజర్ పంచాయితీ ఈవో జ్యోతీశ్వర్ రెడ్డి, పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ ట్రెంకా అనిల్, కంటింజెంట్ కార్మికుడు ఏ నల్లయ్య , బెహరా రవిపై కూడా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
 
నెల్లూరు ఘటనపై కూడా అధికారులు స్పందించారు. కరోనా కారణంగా మృతి చెందిన వారిని జేసీబీతో పెన్నానదీ తీరంలో దహనం చేశారన్న కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దానికి విచారణ అధికారిగా నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ని నియమించారు.
 
ఘటనపై సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నెల్లూరు కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు ఆదేశాలు ఇచ్చారు. విచారణ పూర్తయ్యిందని ఆర్డీవో బీబీసీకి తెలిపారు. నివేదిక సిద్దం చేసి కలెక్టర్ కి సమర్పించబోతున్నట్టు వెల్లడించారు.
 
సిబ్బంది తప్పులేదన్న తిరుపతి కమిషనర్ 
తిరుపతిలో ఓ కరోనా బాధితుడి మృతదేహానికి నిర్వహించిన అంత్యక్రియల విషయంలో నిబంధనలు పాటించినట్టు అధికారులు స్పష్టం చేశారు. మృతదేహాన్ని తరలించడంలో జేసీబీ వినియోగం తప్పు అయినప్పటికీ తప్పలేదని చెప్పారు. ఈ ఘటనపై తిరుపతి మునిసిపల్ కమిషనర్ జి గిరీష్ షా బీబీసీతో మాట్లాడారు. కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో త‌మ‌ సిబ్బంది విధిలేని పరిస్థితుల్లోనే జేసీబీ వినియోగించారని చెప్పారు. 
 
“ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించి, విచారణ చేశాము. మృతుడి శరీరం అధిక బరువు ఉండడంతో, దానిని తరలించడానికి జేసీబీ వాడాల్సి వచ్చింది. మృతదేహాన్ని తరలించేందుకు తొలుత ప్రయత్నించారు. కానీ అంత బరువు ఉన్న మృతదేహం తరలించడం సాధ్యం కాలేదు. అంతేగాకుండా సహకరించే వాళ్లు కనిపించలేదు. చివరకు కుటుంబ సభ్యుల అనుమతితోనే యంత్రాలను ఉపయోగించాము. 
 
తిరుపతిలో అప్పటి వరకూ మరణించిన వారందరికీ గోవింద ధామంలోనే ఎలక్ట్రిక్ పద్ధతిలో అంత్యక్రియలు చేశాము. అందులో స్థానికేతరులు కూడా ఉన్నారు. కానీ ఈ కేసులో బరువు ఎక్కువగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. చివరకు 14 అడుగుల లోతులో గొయ్యి తవ్వి ఖననం చేశాం” అని ఆమె వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అదనపు సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించామని ఆమె తెలిపారు.
 
మృతదేహాలను నిరాకరిస్తున్న కొందరు బంధువులు 
కరోనావైరస్ తో మరణించిన వారికి అంత్యక్రియలు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో మృతదేహాల ద్వారా కూడా వైరస్ వ్యాపించిన అనుభవాలున్నాయి. మరణించిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారి విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఇలాంటి కేసుల్లో మృతదేహాల వద్ద వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కడచూపు కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది.
 
కొన్ని కేసులలో కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులెవరూ చివరకు దగ్గరకు రావడానికి కూడా సిద్దం కావడం లేదని ఆంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు. నెల్లూరుకి చెందిన శానిటరీ ఉద్యోగుల నాయకుడు ఎం రమణారెడ్డి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.
 
“కరోనా మృతుల విషయంలో అందరూ ఒకేలా స్పందించడం లేదు. కొందరు కడచూపు కోసం ఎంతో ఆతృత పడుతూ ఆందోళన చెందుతుంటే కొందరు మాత్రం భయంతో దూరంగా ఉంటున్నారు. సమాచారం ఇచ్చినా చూడడానికి కూడా రానివాళ్లు కనిపిస్తున్నారు. అలాంటి వారికి అంత్రక్రియల నిర్వహణలో సిబ్బంది చాలా సాహసమే చేస్తున్నారు. పూర్తి స్థాయి పీపీఈ కిట్లు ధరించి, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కొందరికీ పాజిటివ్ వస్తోంది. అయినప్పటికీ తెగించి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సొంత మనుషులు దూరంగా ఉంటున్నా శానిటేషన్ సిబ్బంది అంత్యక్రియలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూపించే ధోరణి మానుకోవాలి. మాలాంటి వారి ప్రాణాలు, మా కుటుంబాల భవిష్యత్ ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి” అని ఆయన అన్నారు.
 
అమానవీయ ఘటనకు మళ్ళీ సమర్ధనా? 
కరోనా మృతుల అంత్యక్రియల సందర్భంగా అమానవీయంగా వ్యవహరించడమే కాకుండా, వాటిని సమర్ధించుకోవడం విచారకరమని తిరుపతికి చెందిన ప్రజా సంఘాల నాయకుడు కందారపు మురళి వ్యాఖ్యానించారు. జేసీబీ సాయంతో వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల అలాంటి పరిస్థితి చూశాం. 
 
పైగా తిరుపతి అధికారులు దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అంటూ చెప్పడం సిగ్గుచేటు. బాధ్యతారహిత్య ప్రకటన అది. బరువు ఎక్కువ ఉంటే జేసిబీ తో ఖననం చేయాలనే నిబంధన లేదు కదా.. అయినా తగినంత మంది సిబ్బందిని కేటాయించడంలో నిర్లక్ష్యం ఎవరిది.. వారిపై చర్యలు ఉండవా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. పునరావృతం కాకుండా చూడాలి. అమానుషంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు