ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగలదా?

శుక్రవారం, 17 నవంబరు 2023 (14:34 IST)
ఇరవై ఏళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత ఈ రెండు జట్లూ ప్రపంచ కప్ ఫైనల్లో తలపడడం ఇదే తొలిసారి. 2023 టోర్నీ లీగ్ దశలో తమను 134 పరుగుల భారీ తేడాతో ఓడించిన సౌతాఫ్రికాను గురువారం కోల్‌కతాలో జరిగిన రెండో సెమీఫైనల్లో చిత్తు చేసి, ఫైనల్లో కాలు మోపింది ఆస్ట్రేలియా.
 
నవంబరు 19 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగనుంది. ఇందులో నెగ్గి మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలని భారత్ కదన కుతూహలంతో ఉంది. 1983లో భారత్ తొలిసారి కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచి ఇండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2023 ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఆది నుంచి టీమిండియా ముందంజలో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సహా తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ కలిపి పదికి పది మ్యాచులూ గెలిచిన రోహిత్ శర్మ బృందంలో విజయోత్సాహం ఉరకలెత్తుతోంది.
 
బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌‌‌లో ఉండటం, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన బౌలింగ్ దళం ఎన్నడూ లేనంత బలంగా ఉండటం, సమష్టితత్వం భారత్‌ను ఇప్పటివరకు ఎదురులేని జట్టుగా నిలిపాయి. ఇండియాకు ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, నవంబరు 19న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులభం కాదు.
 
ఎనిమిది సార్లు ఫైనల్‌కు.. ఐదుసార్లు కప్
ఇప్పటివరకూ ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది సార్లు ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరగా, ఐదుసార్లు కప్‌ను సొంతం చేసుకుంది. భారత్ ప్రస్తుతం నాలుగోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడబోతోంది. గతంలో రెండుసార్లు ప్రపంచ కప్ సొంతం చేసుకోగా, 2003లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2003 ఫైనల్లో 125 పరుగుల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. గురువారం ఆసీస్ ఫైనల్లో అడుగు పెట్టిన తర్వాత 2003 వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(ట్విటర్)లో ట్రెండ్ అయ్యింది. ఆస్ట్రేలియాను ఓడించి 2003 లెక్కలు సరిచేస్తామని చాలా మంది భారత నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
 
భారత్‌లో రికార్డు ఎలా ఉంది?
వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్ రికార్డు అంత ఆశాజనకంగా ఏమీ లేదు. రెండు జట్లు ఇప్పటివరకు 150 వన్డేల్లో తలపడ్డాయి. భారత్ 57 మ్యాచ్‌లలో గెలిచింది. 83 మ్యాచ్‌లలో ఆసీస్ నెగ్గింది. పది మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్ టోర్నీల్లో 13 సార్లు తలపడితే, అందులోనూ 8-5తో ఆస్ట్రేలియానే మెరుగ్గా ఉంది. అయితే, భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో మాత్రం రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటోంది. భారత్‌లో ఇప్పటివరకూ రెండు జట్లూ 33 విజయాలతో సమానంగా ఉన్నాయి. అలాగే, ఈ ఏడాది జరిగిన ఏడు మ్యాచ్‌లను పరిశీలిస్తే, 4 విజయాలతో ఇండియానే కొద్దిగా ముందంజలో ఉంది.
 
ఎవరి ఫామ్ ఎలా ఉంది?
ఈసారి ప్రపంచ కప్ జట్టులో టీమిండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌ సహా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఈ టోర్నీలో 711 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 550, శ్రేయస్ అయ్యర్ 526 పరుగులతో ఫామ్‌లో ఉన్నారు. అవతలి వైపు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ 528 పరుగులు చేశాడు. అలాగే, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్షల్ తలో రెండు సెంచరీలు చేశారు.
 
భారత బౌలింగ్ విషయానికొస్తే మొహమ్మద్ షమీ కేవలం ఆరు మ్యాచ్‌లలోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడం జంపా కూడా షమీకి కొద్ది దూరంలోనే ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా 18 వికెట్లు, రవీంద్ర జడేజా 16, కుల్దీప్ యాదవ్ 15, మొహమ్మద్ సిరాజ్ 13 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో జోస్ హాజిల్‌వుడ్ 14 వికెట్లు, మిచెల్ స్టార్క్ 13 వికెట్లు పడగొట్టారు.
 
ఈ గణాంకాలను, ప్రస్తుత ప్రపంచ కప్‌లో రెండు జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరిత పోరు తప్పదనే చెప్పాలి. అయితే 2003 ప్రపంచ కప్‌తో పోలిస్తే భారత జట్టు మెరుగైన స్థితిలో ఉండటం, టోర్నీ సొంత గడ్డపై జరుగుతుండటం లాంటివి భారత్‌కు మరింతగా అనుకూలించే అంశాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు