అరుదైన 'హార్న్‌బిల్' సమ్మోహనా రాగాల "దాండెలి"

FILE
చెంగు చెంగున ఎగిరే లేడిపిల్లలు, బుస్‌మంటూ గుండెల్లో గుబులు పుట్టించే పాముల బుసబుసలు, కుహుకుహూ రాగాలు, కొండవాగుల కొంటె కబుర్లు, పర్వత శిఖరాగ్రాల చిరునవ్వులు, సెలయేటి గలగలలు... ఇలా ఒకటేమిటి ఎన్నో అందాలు, మరెన్నో అనుభూతులు.. వీటన్నింటినీ కలిపితే దాండెలి వైల్డ్‌లైఫ్ సాంక్చురీ. పర్యాటకుల స్వర్గధామమైన ఈ ప్రాంతంలోని అరుదైన హార్న్‌బిల్ సమ్మోహనా రాగం వినాలంటే.. రాఫ్టింగ్, ట్రెక్కింగ్‌లోని మజాను ఆస్వాదించాలంటే దాండెలి వెళ్లాల్సిందే మరి..!

వైల్డ్‌లైఫ్ సాంక్చురీకి ప్రసిద్ధిగాంచిన దాండెలి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దాండెలి అడవి వివిధ రకాల వృక్షజాతులకు, జంతు సముదాయానికి పెట్టింది పేరు. ఈ అడవి అంతా తిరుగుతూ జంతువులను చూసేందుకు ఇక్కడ ప్రత్యేకమైన సఫారీ జీపులు ఉంటాయి. ఆ జీప్ నడిపే గైడ్‌తో కాస్త ఫ్రెండ్లీ ఉంటే.. ఇక వాళ్లే ఏకధాటిగా.. అక్కడ ఎన్ని జంతువులు ఉంటున్నాయి, సంవత్సరానికి ఎంతమంది టూరిస్టులు వస్తారు.. లాంటి విషయాలతోపాటు అక్కడుండే చెట్లు, పుట్టల చరిత్రలను కూడా పూసగుచ్చినట్లు చెప్పేస్తారు.

అలా అడవిలో వెళ్తూ ఉంటే.. "హార్న్‌బిల్" అనే పక్షి గానం మన చెవుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అడవి అంతా వీటి పాటల సందడితో కోలాహలంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. హాయిగా బిల్ గానాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తే.. తాచుపాములు, చిరుతపులులు, బెట్లుడతలు (మామూలు ఉడతలకంటే పదిరెట్లు పెద్దవిగా, రంగు రంగులతో ఉంటాయి), పులులు, ఏనుగులు, కోతులు మొదలైన జంతువులెన్నో మనల్ని చాలా దగ్గర్నించి పలుకరిస్తూ వెళ్తాయి.
వెదురువనాల సౌందర్యం..!
ప్రకృతి ప్రేమికులయితే తప్పనిసరిగా చూడాల్సిన మరో ప్రాంతం "మోలాంగ్". ఇది దట్టమైన వెదురుచెట్ల వనంలో ఉంటుంది. జింకలు, మలబారు ఉడుతలను ఇక్కడ చూడవచ్చు. క్యాంపింగ్ ఇష్టపడేవారు కాళీ నదికి సమీపంలో టెంట్లు వేసుకుని ఉండవచ్చు. పర్యాటకులు చలిమంట వేసుకుని ఇక్కడ...


దాండెలి సఫారీ తరువాత చూడదగ్గ మరో పర్యాటక ప్రాంతం "షిరోలీ పీక్". ఇది ఉత్తర కర్ణాటక ప్రాంతంలోకెల్లా ఎత్తైన శిఖరాగ్రంగా పేరుగాంచింది. ఇక్కడ నిలబడి సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ పర్వత శిఖరంపై నిలుచుని పగలంతా అవిశ్రాంతంగా వెలుగులు విరజిమ్మి మెల్లి మెల్లిగా విశ్రాంతి తీసుకునే సూర్య భగవానుడిని దర్శించటం మనసుకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది.

అలాగే వాటర్ స్పోర్ట్స్ అంటే ఇష్టపడేవారు "కాళీ రివర్"ను సందర్శించవచ్చు. కాళీ నది రాఫ్టింగ్‌కు, వైట్ వాటర్ రాఫ్టింగ్‌కు చాలా పేరుగాంచింది. ఈతరానివారు సైతం లైఫ్ జాకెట్లను వేసుకుని రాఫ్టింగ్ చేయవచ్చు. రివర్ రాఫ్టింగ్ అనేదే ఒక సాహసం అనుకుంటే.. ఈతరానివారు సైతం రాఫ్టింగ్‌కు వెళ్ళటం మరో సాహసమనే చెప్పాలి.

రాఫ్టింగ్ చేసేటప్పుడు ఎంత వేగంగా ముందుకు వెళుతుంటే నీళ్లు కూడా అంతే వేగంగా ముఖాన్ని స్పృశిస్తూ వెళ్తుంటాయి. ఓవైపు భయం, మరోవైపు అడ్వెంచర్ చేయాలనే ఉత్సాహం ఉన్నవారు ఈ నది చుట్టూ చక్కర్లు కొట్టకుండా మాత్రం వెనుదిరగరు. పైగా కేరింతలు, అరుపులతో ఉత్సాహంగా చుట్టూ ఉన్న వారిని సైతం ఎంటర్‌టైన్ చేయకమానరు.

FILE
దాండెలిలో మరో చూడదగిన ప్రదేశం "కవాలా కేవ్స్". ఈ గుహలను చేరుకోవాలంటే దట్టమైన అడవిలోనుండి వెయ్యి అడుగులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గుహల్లో పరమశివుడు కొలువుండేవాడని స్థానికుల కథనం. కష్టపడి వెయ్యి అడుగులు పైకి ఎక్కి చూస్తే కనిపించే దృశ్యం ఎవరినైనా ఆశ్చర్యచకితులను చేయకమానదు. ఎందుకంటే ఆ గుహల్లో అతిపెద్ద శివలింగం పవిత్రమైన భావాన్ని కలిగింపజేస్తుంది. ఆ శివలింగాన్ని దర్శించిన అనుభూతి మాత్రం మాటల్లో వర్ణించలేనిది.

ఈ ప్రాంతానికి దగ్గర్లోని "సింథెరి రాక్" కూడా చూడదగ్గ మరో ప్రదేశం. ఇది మూడు వందల అడుగుల ఎత్తు ఉండే గ్రానైట్ కొడ. దాని ప్రక్కనుంచి ప్రవహించే నదిని చూస్తే... ఎవరో చిత్రకారుడు కుంచె పట్టి గీసిన అందమైన చిత్రం కాదుకదా అనిపిస్తుంది. సింథెరి రాక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సహజ శిల్పం. ఈ కొండమీద ఉన్న ప్రతి బొరియలోనూ పావురాల గూళ్లు కనిపిస్తుంటాయి.

ఇక ప్రకృతి ప్రేమికులయితే తప్పనిసరిగా చూడాల్సిన మరో ప్రాంతం "మోలాంగ్". ఇది దట్టమైన వెదురుచెట్ల వనంలో ఉంటుంది. జింకలు, మలబారు ఉడుతలను ఇక్కడ చూడవచ్చు. క్యాంపింగ్ ఇష్టపడేవారు కాళీ నదికి సమీపంలో టెంట్లు వేసుకుని ఉండవచ్చు. పర్యాటకులు చలిమంట వేసుకుని ఇక్కడ బార్బిక్యు పార్టీలు చేసుకుంటుంటారు కూడా..!

"సైక్స్ పాయింట్" చూడదగ్గ మరో పర్యాటక ప్రాంతం. ఇక్కడి నుంచి కాళీ నదీ ప్రవాహం చాలా అందంగా కనిపిస్తుంది. ఎటుచూసినా పచ్చదనంతో పలుకరించే చెట్లు, ఎప్పుడూ కిలకిలలాడే పక్షులు.. పర్యాటకుల సందడి, నీటి ప్రవాహంలో మెరిసిపోయే చేపపిల్లలు.. వీటన్నింటినీ చూడాలంటే.. తప్పకుండా సైక్స్ పాయింట్‌కు వెళ్ళాల్సిందే...!

దాండెలి వెళ్ళాలనుకునేవారు ముఖ్యంగా బైనాక్యులర్స్‌ను తీసుకెళ్లటం మరువవద్దు. ఎందుకంటే వీటిద్వారా జంతువులను, పక్షులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా ఇక్కడికి వెళ్తే.. ఒక జాకెట్, క్యాప్, టార్చ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ట్రెక్కింగ్ చేసేవారు మర్చిపోకుండా స్పోర్ట్స్ షూస్‌ను తీసుకెళ్లటం ఉత్తమం.

సైట్ సీయింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్‌లకు అనుకూలమైన కాలం డిసెంబర్ నెల. ఇక పక్షులను తిలకించేందుకు మాత్రం అక్టోబర్ మాసంలో వెళితే సరిపోతుంది. వేసవికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీలదాకా ఉంటుంది. అదే వర్షాకాలంలో అయితే ఇక్కడ ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తుంటాయి. చలికాలంలో మాత్రం ఉష్ణోగ్రత ఇంచుమించుగా 26 డిగ్రీల వరకు ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి