గుజరాత్ వనసీమల అందాల్లో పేర్కొనదగినది "గిర్ అభయారణ్యం" లేదా "గిర్ జాతీయవనం". ఇది ఆసియా ప్రాంతపు సింహాలకు నిలయం. ముళ్లపొదలతో నిండిన ఈ అరణ్యంలో అక్కడక్కడా పొదల్లో మృగరాజులు పొంచి ఉంటాయి. కాగా... ఈ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం 1965వ సంవత్సరంలో సుమారు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థాపించబడింది.
జునాగఢ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఆసియా ఖండానికి మాత్రం పరిమితమైన సింహాలకు ప్రసిద్ధి చెందింది. జునాగఢ్ పట్టణం గుజరాత్ రాష్ట్రంలోని ఓ చారిత్రక నగరం. జునాగఢ్ అనేది భారతదేశంలో ఒక సంస్థానంగా ఉండేది. జునాగఢ్ అంటే గుజరాతీ భాషలో "పాత కోట" అని అర్థం. ఇది గిర్నార్ పర్వత సానువుల్లో కలదు.
భారతదేశం స్వాతంత్రానికి ముందే జునాగఢ్ సంస్థానానికి చెందిన నవాబు ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాడు. అప్పటి నుండి ప్రభుత్వ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల పర్యావరణ పరిరక్షణ చర్యల మూలంగా కేవలం 15 మాత్రమే ఉండే ఈ ఆసియా సింహాలు 2005 సంవత్సరపు గణాంకాల ప్రకారం 359కి చేరాయి.
గిర్ అభయారణ్యంలోని వృక్ష జాతుల విషయానికి వస్తే... 1955వ సంవత్సరంలో జరిపిన సర్వేలో 400 పైగా ఉన్నట్లు గుర్తించారు. బరోడా విశ్వవిద్యాలయం వారి సర్వేలో ఈ సంఖ్య 507గా నిర్ధారించారు. ఈ అరణ్యం "డై డెసిడుయస్ మరియు టేకు అరణ్యం"గా వర్గీకరించారు. నిజానికి ఇది పశ్చిమ భారతదేశంలోని అతి పెద్ద డై డెసిడుయస్ అరణ్యం. ఇక్కడి తూర్పు ప్రాంతంలో సగానికి పైగా భాగంలో టేకు వృక్షాలున్నాయి.
గిర్ అభయారణ్యం గుండా... హిరన్, శత్రుంజీ, దటర్డి, శింగోడా, మఛుంద్రి, ఘొడావరి మరియు రావల్ అనే ఏడు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో హిరన్, మఛుంద్రి, రావల్ మరియు శింగోడా నదులపై ఆనకట్టలు నిర్మించి ఏర్పరచిన నాలుగు జలాశయాలు వన్యప్రాణులకు జీవనాధారంగా నిలిచాయి. వీటి ద్వారా మండు వేసవిలో కూడా 300 పాయింట్ల వరకూ నీరు లభిస్తుంది.
ఇక్కడి అడవుల అందాలను, సజీవంగా ప్రవహించే సెలయేళ్ళను, కనువిందు చేసే వన్య ప్రాణులను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఈ అభయారణ్యంలో సింహాలను దగ్గర్నించీ చూసేందుకు వీలుగా సఫారీలను ఏర్పాటు చేశారు. ఈ సఫారీలు సింహాలు ప్రకృతి సహజంగా మసలేందుకు వీలుగా గుహలను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి... స్వేచ్ఛగా విహరించే అరుదైన ఆసియా మృగరాజులను మనం చూసే అవకాశం ఉంటుంది.