హర్యానాలో ఏనుగుల పునరావాస కేంద్రం

శనివారం, 29 డిశెంబరు 2007 (16:27 IST)
FileFILE
దేశంలోనే తొలి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఛాఛ్‌రౌలీలోని బన్‌సంతూర్‌లో హర్యానా అటవీ మరియు పర్యావర ణ శాఖల మంత్రి కిరణ్ చౌదరి ప్రారంభించారు. థాయ్‌ల్యాండ్‌లోని పునరావాస కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల రూపాయల వ్యయంతో కేంద్రాన్ని నిర్మించారు. వచ్చే సంవత్సరం మార్చి మాసాంతానికి పునరావాస కేంద్రం పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను మొదలుపెడుతుంది.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన, అనారోగ్యం పాలైన ఏనుగులకు పునరావాస కేంద్రంలో తగు వైద్య చికిత్సలు చేపడతామని అన్నారు. దట్టమైన వెదురుపొదలకు అలవాలమైన బన్‌సంతూర్ ప్రాంతం ఏనుగులు సహజ సిద్ధంగా తిరుగాడే ప్రాంతం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటులో భాగంగా 50 ఎకరాల అటవీ భూములను కేటాయించారు.

కేంద్రానికి తరలించబడే ఏనుగుల సంఖ్యను అనుసరించి కేంద్రం విస్తీర్ణాన్నిపెంచే అవకాశం ఉంది. తొలిదశలో ఐదు షెడ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క షెడ్‌లో రెండు ఏనుగులకు పునరావాసం కల్పిస్తారు. పునరావాస చర్యలను చేపట్టడంలో అనుభవం గడించి ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 'వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్' ప్రభుత్వేతర సంస్ధకు ఏనుగుల పునరావాస కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఆమె వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి