ప్రకృతి చెక్కిన శిల్పం "బ్రైస్ కన్‌యోన్ నేషనల్ పార్క్"

FILE
ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, బ్రౌన్ రంగుల్లో లెక్కకుమించీ కనిపించే గుళ్ళు, గోపురాలు, గుహలు, అంతఃపురాలను పోలిన ప్రకృతి చెక్కిన శిల్పాలు "బ్రైస్ కన్‌యోన్ నేషనల్ పార్కు"లో చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. రక రకాల ఆకృతుల్లో, వినూత్నమైన శిల్పాలు నిండి ఉండే ఈ సన్నటి లోయలో చిత్ర విచిత్రమైన రంగులతో రాళ్లన్నీ గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంటుంది.

ప్రకృతి తన అందాన్నంతా ఓ చోట గుమ్మరించి, దానికి రకరకాల రంగులద్ది, చిత్ర విచిత్రమైన శిల్పాలను తయారుచేసి ముచ్చటగా పరచినట్లుగా అద్వితీయమైన అందంతో పులకరింపజేస్తుంటుంది బ్రైస్ కన్‌యోన్ పార్కు. ఇక్కడ ప్రభాత సమయంలో సూర్యకాంతి ప్రసరిస్తుందో, లేదో తెలియదుగానీ.. అయితే మంచులో తడిసిన రాళ్ల పుష్పాల సౌందర్యం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.

అమెరికాలోని దక్షిణ ఉతాహ్‌లో ఉన్న ఈ బ్రైస్ కన్‌యోన్ పార్క్‌లో అతి సూక్ష్మమైన కంటికి కనిపించని ఎన్నో నిక్షేపాలు దాగి ఉన్న కారణంగా ఏ మాత్రం వెలుతురు సోకినా సరే అనేక రంగులు ప్రసరిస్తూ ఆ ప్రాంతమంతా వింత శోభను కలిగిస్తుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూక్షయం కారణంగా కొట్టుకొచ్చిన మాంగనీస్, ఐరన్ లాంటి నిక్షేపాలు రాతిపై ఒక పొరగా ఏర్పడటంవల్ల ఈ పార్క్ నెలకొన్న ప్రాంతమంతా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రకృతి వైపరీత్యాలవల్లనో లేక కాలానుగుణంగా సంభవించిన పెను మార్పులవల్ల బ్రైస్ కన్‌యోన్ పార్కు నేటి రూపం సంతరించుకుంది. మనుషులు నిలుచున్నప్పుడు ప్రతిబింబించే ఆకారాన్ని పోలిన ఎర్రటి రంగురాళ్లతో ఈ ప్రదేశం అంతా నిండి ఉంటుంది. బౌల్ ఆకృతిలో ఏర్పడిన ఈ లోయ ప్రపంచ చిత్రపఠంలో ఓ సుందర దృశ్య కావ్యమని చెప్పవచ్చు. బౌల్ ఆకృతిలో ఉన్నందువల్లనే ఈ పార్క్‌కు బ్రైస్ కన్‌యోన్‌ పార్క్ అనే పేరు వచ్చిందేమో..!!

ఈ బ్రైస్ లోయలో సూర్యకిరణాలు ప్రసరించటంతో అక్కడి శిలలన్నీ బంగారువర్ణంతో మిలమిలా మెరిసిపోతుంటాయి. గుత్తులు గుత్తులుగా వెలుతురు పువ్వులు, మైమరిపించే ఇంపైన రంగులు ఏ కాన్వాసుకు అందని అంతు చిక్కని అద్భుతాలు ఈ పార్క్ సొంతం. శీతాకాలంలో తెల్లటి వెండిలాంటి మంచు ఓ వైపు, ఎర్రటి శిలలు, నీలాకాశం, పిల్లగాలులు ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తాయి.

భూమి శైథిల్యంవల్ల ఏర్పడిన ప్రకృతికి ప్రతిబింబంగా కనిపించే ఈ సహజసిద్ధమైన లోయ అనేక ఆకర్షణలతో నిండిన ఓ నిజమైన ప్రకృతి చిత్రం. ఉదయిస్తున్న సూర్యుడు, వేల రంగులు మిళితమైన కొండలు, గుట్టలు.. అప్పుడే రంగులు మార్చుకుంటున్న రకరకాల శిలలు, కళ్లముందు ఓ క్షణం కనిపించిన రంగు మరో క్షణానికి కనిపించనంతగా లెక్కకుమించి రంగులను పులుముకునే శిలల రంగుల సౌందర్యం వర్ణనాతీతం. నిజంగా ఇక్కడ దేవకన్యలు ఎవరైనా నివసిస్తున్నారా అనిపించేంత అద్భుత సౌందర్యం ఈ బ్రైస్ లోయకు మాత్రమే సొంతం.

భూమి, గాలి, కాలం, వివిధ మూలకాల మధ్య ఉన్న అంతర్గత సంబంధం వల్ల ఏర్పడ్డ "బ్రైస్ కన్‌యోన్ పార్కు" నిజానికి ఓ నమ్మలేని నిజం. సౌందర్యారాధకులకు, కళాకారులకు ప్రాణం లేచివచ్చేలా ఉండే ఈ ప్రదేశం ఓ వింత ఈనుభూతిని కలిగిస్తుంది. యాంత్రిక జీవనంలో అలసిపోయినవారు అవకాశముంటే తప్పకుండా సందర్శించాల్సిన ఓ అద్భుతమైన ప్రదేశం ఇది. ఒకవేళ సందర్శన వీలుకాకపోయినా, కనీసం తప్పకుండా తెలుసుకోవాల్సిన అందమైన, విజ్ఞానదాయకమైన సజీవ ప్రకృతి కావ్యం "బ్రైస్ కన్‌యోన్ పార్కు".

వెబ్దునియా పై చదవండి