భారత పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు గ్రీన్ ఆస్కార్

శనివారం, 4 మే 2013 (17:02 IST)
File
FILE
పక్షి సమాజంలో అంతరించి పోతున్న పక్షి జాతుల సంరక్షణకు నడుం బిగించిన భారత్ యువ పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు సమానమైన గ్రీన్ ఆస్కార్ (వైట్లీ అవార్డు) అవార్డు వరించింది.

మనం నిత్యం చూసే పక్షి జాతుల్లో అనేక పక్షులు కంటికి కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి వాటిలో గ్రేట్ హార్న్‌బిల్ ఓ పక్షిజాతి. ఈ పక్షులు విలక్షణమైన ఈకలు, ముక్కు కలిగి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా భారత్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ అడవుల్లో కనిపిస్తాయి. అలాగే, ప్రపంచంలో సుమత్రా దీవులతో పాటు.. ఇండోనేషియా, నేపాల్‌ వంటి పలు దేశాల్లో కనిపిస్తాయి.

ఇలాంటి అరుదైన జాతి పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన భారత్‌కు చెందిన ప్రముఖ యువ పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తా వీటి సంరక్షణకు నడుం బిగించారు. ఇందుకోసం ఆమె ఒక గిరిజన కమ్యూనిటీ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పక్షి జాతి సంరక్షణకు దత్తా చేసిన కృషికి గుర్తింపుగా ఈ వైట్‌లీ అనే పేరుతో పిలిచే ప్రత్యేక అవార్డు వరించింది. ఈ అవార్డు గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డుగా పిలుస్తారు.

లండన్‌లోని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీలో జరిగిన కార్యక్రమంలో అపరాజితకు ఈ అవార్డును ప్రదానం చేశారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రాణి ఎలిజబెత్ ‌-2 కుమార్తె ప్రిన్సెస్ యాన్నే పాల్గొని అవార్డును అపరాజితా దత్తాకు అందజేశారు.

ఈ అవార్డు కింద 'వైట్‌లీ ఫండ్‌ ఫర్‌ నేచర్‌' అనే సంస్థ 2.95 లక్షల పౌండ్లు అంటే రూ.2.46 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. ఈ సొమ్మును అపరాజితా బృందంలోని ఏడుగురు సభ్యులు పంచుకోనున్నారు. కాగా, హార్న్‌బిల్ పక్షులు కేరళ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రా ప్రభుత్వ చిహ్నాలు కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి