ఈ కాలంలో చర్మంతోపాటు కేశ సంరక్షణ కూడా చాలా అవసరం. లేదంటే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై శిరోజాలు బలహీనమవుతాయి. జుట్టు జీవం కోల్పోయి పీచులా మారుతుంది. ఇలాంటి సమస్యలన్నింటికి తేనె, ఆలివ్ నూనెలతో చక్కని పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి ఆ మార్గాలేంటో.. ఓసారి తెలుసుకుందాం...
కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
తేనెలోని విటమిన్స్, ఖనిజ లవణాలు జుట్టుకు ఎంతో మేలుచేస్తాయి. తేనె జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు పట్టుకుచ్చులా పెరగాలంటే.. తలస్నానం చేసిన తరువాత మగ్గు నీటిలో అరకప్పు తేనె, నిమ్మరసం కలిపి జుట్టును రాసుకోవాలి. 2 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.