తేనెలో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేనెను పరగడుపున వేడినీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే తేనే చర్మ సౌందర్యాన్ని మరింత పెంపొందింపజేస్తుంది. చెంచా పెరుగులో చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి.. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. తర్వాత చెంచా ఆలివ్ నూనెను రాసుకుంటే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.
చెంచా తేనెకు రెండు చెంచాల పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా మర్దనా చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే, ముఖం మెరుస్తుంది. మృతకణాలు తొలగిపోతాయి. రెండు చెంచాల పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఏడు నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం ముఖచర్మకణాల్లో ఉండే అధిక నూనెను తొలగిస్తుంది.
చెంచా నిమ్మరసం, చెంచా పాలు, రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాల తరువాత చల్లనినీటితో కడిగేయాలి. మృతకణాలు పోయి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు.