చుండ్రు లేని నల్లని జుట్టు కావాలా...? ఐతే వీటినే వాడండి....

శనివారం, 23 జులై 2016 (14:30 IST)
పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరూ షాంపూలను వాడుతున్నారు.  కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. చాలామంది కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. కుంకుడు కాయలు వాడటం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. 
 
ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడకుండా ఉండటమే కాదు, మెత్తగా కూడా ఉంటుంది.
 
కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. 
 
కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్తో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. ఈరోజుల్లో అధిక ధరల్లో మార్కెట్లో లభిస్తున్న షాంపూలు..సబ్బుల ప్రభావంతో కుంకుడు కాయల వాడకం తగ్గింది. కానీ నిజానికి తలంటుకి కుంకుడు కాయలను వాడటమే మంచిది.

వెబ్దునియా పై చదవండి