అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

ఠాగూర్

గురువారం, 17 జులై 2025 (18:41 IST)
ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో పోషించిన చిత్రాన్ని విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆమె కీలక పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం 'పరదా'. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రూపొందింది. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ ఆఫ్ పరదా 'యత్ర నార్యస్తు పూజ్యంతే..' అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు నిర్మాత సురేశ్బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. “ఒక మంచి విడుదల తేదీ దొరకడానికి ఆరు నెలలు పట్టింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అదేరోజు పెద్ద సినిమా రిలీజ్ అయ్యేది. థియేటర్లు దొరకలేదు. అందుకే ఇంత సమయం పట్టింది. నిజం చెప్పాలంటే.. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు. అది ఎంత మంచి సినిమా అయినా అంతే. దాన్ని తప్పు అని నేను అనడం లేదు. అది వాస్తవం. 
 
'పరదా' కారణంగానే ఈ వాస్తవాన్ని తెలుసుకున్నాను. మా సినిమా సంవత్సరం క్రితమే రెడీ అయింది. ఏడాదిగా మా టీమ్ పడిన కష్టం దగ్గర నుంచి చూశాను. ఇది చిన్న సినిమా అని అందరూ చెబుతున్నారు.. కానీ ఇది చాలా మంచి సినిమా. ఎన్నో కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. 'పరదా'ను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ మీ సపోర్ట్కు ధన్యవాదాలు. ఇకపై కూడా ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అనుపమ అన్నారు. 
 
“చిరంజీవి పుట్టినరోజుకు మించి ఈ సినిమాను విడుదల చేయడానికి మంచి తేదీ ఉండదు. అందుకే ఆగస్టు 22న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. నా మొదటి చిత్రం 'సినిమా బండి'కి ఇఫీలో అవార్డు వచ్చినప్పుడు నేను చిరంజీవి దగ్గర నుంచి దీవెనలు తీసుకున్నాను. 10 ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోలోకి డైరెక్ట్ గా వెళ్లాను. సెక్యూరిటీ కూడా ఆపలేదు. సురేశ్ బాబు అప్పుడే నన్ను ప్రోత్సహించారు. 'పరదా' కథ విన్న తర్వాత సురేశ్బాబు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇది నాకెంతో ప్రత్యేకం. సినిమా అంతా పరదాలోనే ఉండాలంటే ఏ నటీ అంగీకరించదు. ఇలాంటి ఛాలెంజింగ్ రోలక్కు అనుపమ ఓకే చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు