అవార్డుల కోసం ఆయన వెంపర్లాడలేదు. ఆయన్నే అవి వెతుక్కుంటూ వచ్చాయి, వస్తున్నాయి కూడా.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మత ఛాందసవాదులచే లెక్కలేనన్నిసార్లు ఫత్వాకు గురై గత పాతికేళ్లుగా బ్రిటన్‌లో పటిష్ట భద్రత మధ్య అజ్ఞాత జీవితం గడుపుతూ వస్తున్న తనకు ఈసారి మరో అత్యున్నత అవార్డు లభించింది. ఆయన ఎవరో కాదు సాల్మన్ రష్దీ..
అంతర్జాతీయ గుర్తింపు సాధించిన వివాదాస్పద రచయిత, బుకర్ పురస్కార గ్రహీత సాల్మన్ రష్దీ గురువారం మరో ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డును సొంతం చేసుకొన్నారు. బుకర్ పురస్కారాన్ని ఇప్పటి వరకు పొందిన రచయితల్లో అత్యుత్తమ రచయితగా 'బెస్ట్ ఆఫ్ ద బుకర్' అవార్డుకు భారత్‌లో పుట్టిన రష్దీ ఎంపికయ్యాడు. బుకర్ పురస్కారం 40 ఏళ్ల వార్షికోత్సవాల్లో భాగంగా ఈ అవార్డును అందజేస్తున్నారు.
రష్దీ రచించిన 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' రచనకు గాను 1981లో బుకర్ పురస్కారాన్ని పొందారు. బుకర్ పురస్కారం పొందిన రచనల్లో రష్దీ రచించిన ఈ పుస్తకం అత్యుత్తమమైనదిగా ఆన్‌లైన్ పోల్ ద్వారా ఎంపిక చేసి గురవారం ఆయనకు ఈ 'బెస్ట్ ఆఫ్ ద బుకర్' అవార్డును ప్రకటించారు. మే 12 నుంచి జూన్ 8తేదీ వరకు నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో మొదటి రోజు నుంచి రష్దీ 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది.
ఈ అవార్డు కోసం నోబెల్ పురస్కార విజేత జె.ఎం.కోయిట్జీ (డిస్‌గ్రేస్), ప్యాట్ పార్కర్(ది గోస్ట్ రోడ్), పీటర్ కేరీ(ఆస్కార్ అండ్ లుసిండా), జేజీ ఫేరెల్ (ది సీజ్ ఆఫ్ క్రిష్ణాపూర్), నదిన్ గోర్డిమర్ (ది కన్సర్వేషనిస్ట్)ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
బుకర్ పురస్కారం 25వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని 1993లో ఇచ్చిన 'బుకర్ ఆఫ్ బుకర్' అవార్డును సైతం రష్దీయే సొంతం చేసుకోవడం గమనార్హం.