టైమ్స్ పత్రిక తాజా సంచిక అమ్మకాలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పెరగడంలో ఇతోధికంగా తోడ్పడిన అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్వంత పుస్తకాల ప్రచురణలో కూడా చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఒబామా రాసిన పుస్తకాలు మార్కెట్‌ను ముంచెత్తుతుండగా, మరిన్ని పుస్తకాలు ఒబామా కలం నుండి జాలువారనున్నాయి.
అమెరికాలో 70 శాతం పుస్తకాల అమ్మకాలను అంచనావేసే ప్రముఖ సంస్థ నీల్సన్ బుక్ స్కాన్ ప్రకారం ఒక్క నవంబర్ 3 నుంచి 9వ తారీఖు లోపలే ఒబామా రాసిన పుస్తకాలకు సంబంధించిన లక్ష కాపీలు అమ్ముడుపోయాయి.
వీటిలో తను రాసిన అడాసిటీ ఆఫ్ హోప్ -50,000-, డ్రీమ్స్ ఫ్రం మై ఫాదర్ -50,000-, ఛేంజ్ వియ్ కెన్ బిలీవ్ ఇన్ -19,000- కాపీలు అమ్ముడుపోయాయి. తను రాసిన విధాన పత్రాలు, చేసిన ప్రసంగాల తాలూకూ అమ్మకాలు కూడా చేరిస్తే నూతన అధ్యక్షుడిగా ఎంపికైన వారంలోపే ఒబామా స్వంత రచనలు లక్ష కాపీలు అమ్ముడు పోయాయి.
2006లో ఒబాబా రాసిన అడాసిటీ ఆఫ్ హోప్ పుస్తకం ఇప్పటికి 10 లక్షల కాపీలు అమ్ముడు పోయి పుస్తక విక్రయాల్లో సంచలనం రేపింది. కాగా, ఒబామా గురించి రాసే కొత్త పుస్తకాల ముద్రణకు ప్రచురణ కర్తలు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. నవంబర్ 4న నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇంతవరకు ఒబామా అంశంగా కనీసం 7 ప్రాజెక్టులపై ప్రచురణకర్తలు ఒప్పందాలపై సంతకాలు చేశారు
ఒబామా ముఖ చిత్రంతో వెల్లువెత్తిన టైమ్స్ అమ్మకాలు
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించిన బారక్ ఒబామా ఫోటోను టైమ్స్ తన తాజా సంచిక ముఖచిత్రంగా ప్రచురించబడింది. దీంతో టైమ్స్ పత్రిక అమ్మకాలు మామూలుకన్నా విపరీతంగా పెరిగినట్టు దాని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
డిసెంబర్ ఆరున మార్కెట్‌లోకి వచ్చిన ఈ పత్రిక అమ్మకాలు విపరీతంగా జరుగుతుండడంతో మూడుసార్లు పునర్ ముద్రించామని నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఒబామా చేసిన తొలి ప్రసంగం సందర్భంగా తీసిన ఓ క్లోజప్ ఫోటోను పత్రిక ముఖ చిత్రంగా ప్రచురించారు.
దీంతో టైమ్స్ పత్రిక కోసం అమెరికా వాసులు ఎగబడ్డారని పత్రిక నిర్వాహకులు తెలిపారు. గతంలో 2001 సెప్టెంబర్ 14న జరిగిన అమెరికా పేలుళ్లను ముఖచిత్రంగా ప్రచురించిన పత్రిక ఇదే తరహాలో అత్యధికంగా అమ్ముడైందని ఆ తర్వాత ఇప్పుడు తాజాగా పత్రిక అమ్మకాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయని టైమ్స్ యాజమాన్యం పేర్కొంది.