బడ్జెట్ అంటే ఏంటి?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2010 (18:33 IST)
FILE
బడ్జెట్ అంటే ప్రభుత్వ సాంవత్సరిక రాబడి, వ్యయముల అంచనా. అవసరమైన అంశాల ఖర్చు మొత్తానికి బడ్జెట్ కేటాయించడం. ఇదే ప్రతి కుటుంబంలోను ఆ కుటుంబపు పెద్ద బడ్జెట్‌ను రూపొందించుకుంటుంటారు. అది వారానికి ఒకసారి, నెలసరి, సంవత్సరానికి అవసరమైన వస్తువుల కొనుగోలు, ఖర్చులు, రాబడి తదితరాలు చూసుకోవడమే బడ్జెట్ అంటే.

ఇక కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమర్పించే బడ్జెట్ అంటే వార్షిక సాధారణ బడ్జెట్. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి సదరు ప్రభుత్వం శాసనసభ్యుల ముందు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి. ఇందులో ఆయా ప్రభుత్వాల ఆర్థిక శాఖామంత్రులు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టబడే వార్షిక బడ్జెట్లు చాలా కీలకమైనవిగా ఉంటాయి. అందునా దేశీయ సాధారణ బడ్జెట్‌ అయితే మరీనూ.

మన భారతదేశంలో ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల 1 నుంచి మార్చి నెల 31 వరకు ఉంటుంది. ఈ పన్నెండు నెలల కాలంలో ప్రభుత్వ ఆదాయం, రాబడి, ఖర్చులు, పెట్టుబడులు, తదితర అంశాలపై బడ్జెట్‌లో చర్చిస్తారు. అలాగే ప్రభుత్వోద్యోగులు, పరిశ్రమలు, ప్రజలకు అందజేయాల్సిన సేవలకుగాను ఖర్చులు తదితరాలపై బడ్జెట్‌లో రూపకల్పన చేస్తుంటారు సదరు ఆర్థిక శాఖామంత్రులు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం సమర్పించే బడ్జెట్‌లో దేశంలో ప్రభుత్వానికి చెందిన పలు కంపెనీలు, ప్రభుత్వ సేవల ద్వారా వచ్చే ఆదాయం, వివిధ పన్నులు, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కేంద్ర ఆర్థికమంత్రి పలువురు ఆర్థిక నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి బడ్జెట్‌ను రూపొందిస్తారు. బడ్జెట్ అనేది ప్రభుత్వ ఆర్థిక విధానాల స్థితిగతులను తెలుపుతుంది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టే సాధారణ వార్షిక బడ్జెట్‌‍లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగాలకు ఖర్చులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక శాఖామంత్రి సాధారణ వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పని రోజున లోక్‌సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను లోక్‌సభ ఆమోదించిన తర్వాత ఇది ఏప్రిల్ నెల 1 నుంచి అమలులోకి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి