త్వరలోనే రెండంకెల వృద్ధిరేటు సాకారం: ఆర్థిక మంత్రి

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (11:30 IST)
రెండు అంకెల దేశ ఆర్థికాభివృద్ధి రేటు త్వరలోనే సాకారం కానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 2010-11 సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను ఆయన శుక్రవారం లోక్‌‍సభలో ప్రవేశపెట్టారు. దేశంలో పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేస్తామని తెలిపారు. అప్పులను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తామన్నారు.

అతి త్వరలోనే రెండు అంకెల వృద్ధి రేటును సాధిస్తుందని, ఈ వృద్ధి రేటు రెండు అంకెలకే పరిమితం కాబోదన్నారు. అయితే, ప్రస్తుతం వృద్ధి రేటును తొమ్మిది శాతానికి చేర్చడమే మొదటి సవాల్ అని అన్నారు. ఇటీవల కాలంలో దేశ ఎగుమతుల్లో పెరుగుదల ఉన్నట్టు చెప్పారు.

కరవు, వాతావరణ మార్పుల కారణంగా దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను భవిష్యత్ అభివృద్ధి ప్రణాళిక సూచిగా ఆయన అభివర్ణించారు.

పబ్లిక్ రంగ సంస్థల నుంచి 22 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు ఉపసంహరించినట్టు ఆయన తెలిపారు. సులభతరమైన పన్నుల విధానం అమలుకు కృషి చేస్తామన్నారు. జీఎస్‌టీ అమలుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి