ప్రభుత్వ రుణాలపై త్వరలో శ్వేతపత్రం: ప్రణబ్ ముఖర్జీ

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (15:41 IST)
ప్రభుత్వ రుణాలపై వచ్చే ఆరు నెలల కాలంలో శ్వేతపత్రం విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఆయన శుక్రవారం పార్లమెంట్‌లో 2010-11 వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, భారత్‌ను మురికి వాడలు లేని దేశంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించారు.

గత డిసెంబరు నాటికి దేశ ఉత్పాదక రంగంలో 18.5 శాతం వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు. ఇది గతమెన్నడూ లేని వృద్ధిగా ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రైవేటు గిడ్డంగుల లీజు కాలపరిమితిని ఐదేళ్ల నుంచి ఏడేళ్ళకు పెంచారు.

ఆహార ధాన్యాల నిల్వలకు ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా గోదాములను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. దేశంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా రోజుకు సగటున 20 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం సాగుతున్నట్టు తెలిపారు. న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను ఆయన కేటాయించారు.

వృత్తి నిపుణులకు 15 లక్షల వరకు, వ్యాపారులకు రూ.60 లక్షల వరకు ఆడిటింగ్ మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రాసెస్సింగ్‌లకు రాయితీలు ప్రకటించిన ప్రణబ్ ముఖర్జీ.. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెస్సింగ్, పౌల్ట్రీ పరికాల దిగుమతికి రాయితీలు ప్రకటించారు. విత్తనాలకు సేవా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. సోలార్ కార్లు, వాహనాలకు ఎక్సైజ్ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి