బంగారం నిల్వల్లో పదో స్థానంలో భారత్: ప్రణబ్ ముఖర్జీ

గురువారం, 25 ఫిబ్రవరి 2010 (16:30 IST)
బంగారం నిల్వల్లో మన దేశం పదో స్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఆయన గురువారం ఆర్థిక సర్వే అంశాలను పార్లమెంట్ ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 0.2 శాతం తగ్గినట్టు 12వ ఆర్థిక సంఘం నిర్వహించిన సర్వే తేల్చిందన్నారు. వ్యవసాయ వృద్ధిరేటు జిడిపిలో 4శాతంగా ఉంటే తప్ప ఆహార భద్రత సాధ్యం కాదని ఆర్థిక సర్వే పేర్కొన్నది.

గత ఏడాది ఆర్థిక మాంద్యం, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా జీడీపీ వృద్ధిరేటు బాగా తగ్గిందన్నారు. ఈ ఏడాది 8.75 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇకపోతే.. బంగారం నిల్వల్లో మనదేశం ప్రపంచంలోనే పదో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఆహార సబ్సీడీలను నేరుగా ప్రజలకే అందించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రముఖంగా పేర్కొన్నది.

ఆర్థిక పురోభివృద్ధికి పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీని ఎత్తివేయాలని, వివిధ రంగాలలో విదేశీ పెట్టుబడులకు అనుమతించాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. దీన్నిబట్టి చూస్తే రేపటి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌లో మార్కెట్‌కు తగిన ప్రోత్సాహకాలేమీ ఉండకపోవచ్చని అవగతమైంది. అదేకోణంలో ఉద్దీపనలు దశల వారీ ఉపసంహరణ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి