బడ్జెట్‌పై కోటి ఆశలతో వేచి చూస్తున్న ప్రజలు

గురువారం, 25 ఫిబ్రవరి 2010 (17:01 IST)
FILE
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌కు రూపకల్పనలు చురుగ్గా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్థిక మంత్రిత్వశాఖ కొలువుదీరిన సౌత్ బ్లాక్‌లో ఆర్థిక శాఖలోని పలువురు కీలక అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. ఆర్థిక సంస్కరణల అమలుతో కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ గమనంలో అత్యంత కీలకమైనదిగానే ఉంటోంది.

కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తరువాత యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ప్రతిసారి కంటే రెండు రోజులు ముందుగానే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కోసం పారిశ్రామిక రంగం, వాణిజ్య రంగాలతోపాటు, కర్షకులు, వేతన జీవులు కోటి ఆశలతో సాధారణ బడ్జెట్‌పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం తగలకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన లక్షన్నర కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల విషయంపై ఈ బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయం కోసం పారిశ్రామిక వర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి.

మాంద్యం తగ్గుముఖంపట్టి దేశీయ ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపడుతున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పెరిగిపోతున్న ద్రవ్య లోటును ఆదుపులో ఉంచేందుకు ఉద్దీపన ప్యాకేజీల పేరిట తగ్గించిన వివిధ సుంకాలను కొంతమేరకైనా పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతోందని, ఆహార ఉత్పత్తుల ధరలు కిందికి దిగిరావాల్సిన అవసరం ఉందని, ఇటువంటి తరుణంలో ప్రజలపై భారం పడే నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తీసుకోకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

వెబ్దునియా పై చదవండి