రూ.2 వేల కోట్లతో రెండో హరిత విప్లవం: ప్రణబ్ ముఖర్జీ

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (11:43 IST)
భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొనేందుకు రెండు వేల కోట్ల రూపాయలతో రెండో హరిత విప్లవాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. దీన్ని తూర్పు ప్రాంతంలో చేపడుతామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు.

పర్యావరణ అనుకూల వ్యవసాయానికి 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. రైతులకు పరపతి లక్ష్యాన్ని రూ.3,75,000 కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. మెట్ట ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం రూ.2,400 కోట్లను కేటాయించారు. పోషక ఆధారిత ఎరువుల విధానాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఎరువులను క్రమబద్దీకరించడమే ఈ విధానం లక్ష్యమన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 25 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు ఉపసంహరించినట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత యేడాది 20.9 మిలియన్ డాలర్ల మేరకు వచ్చినట్టు ఆయన తెలిపారు. ఇకపోతే.. రహదారుల నిర్మాణానికి రూ.19894 కోట్లను కేటాయించగా, రైల్వేల అభివృద్ధికి రూ.16,752 కోట్లను కేటాయించారు. 2010-11 సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.16500 కోట్లను కేటాయిస్తామని తెలిపారు. అలాగే, మరిన్ని ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి