రైల్వే బడ్జెట్ 2010-11: మహిళలపై మమతానురాగాలు

బుధవారం, 24 ఫిబ్రవరి 2010 (15:42 IST)
రైల్వే శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సాటి మహిళల పట్ల మమతానురాగాలు చూపారు. రైళ్ళలో ప్రయాణించే మహిళలకు కట్టుదిట్టమైన భధ్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో లేడీస్ స్పెషల్ రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించారు.

బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన 2010-11 వార్షిక బడ్జెట్‌లో ఆమె తమ ప్రాధామ్యాలను వివరించారు. రైల్వే క్రాసింగ్ లెవల్ బాధ్యతలను మహిళలకు అప్పగించనున్నట్టు ప్రకటించారు. అలాగే, మహిళా వాహిని పేరుతో దేశ వ్యాప్తంగా 12 మహిళా రక్షణ దళాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఇకపోతే.. దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద 17 వేల మంది కొత్త సిబ్బందితో భద్రత కల్పించనున్నట్టు తెలిపారు. రైల్వే ఉద్యోగులందరికీ వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఐఐటిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే కార్మికులకు ఆరోగ్య బీమా అమలు చేస్తామన్నారు.

క్రీడాకారులకు రైల్వేలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చే వారికి రైల్వేలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. వచ్చే యేడాది ఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల కోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా రైళ్ళు నడుపుతామన్నారు.

రైళ్ళలో హైస్పీడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రైళ్ళలో గ్రీన్ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో పది రూపాయలకే జనతా ఆహార్‌‍ పేరుతో ఆహారం లభించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి