సురేశ్ ప్రభు 2020 లక్ష్యాలివే... స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్ రైళ్ళు

గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:47 IST)
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికి గాను రైల్వే వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో 2020 లక్ష్యాలను ప్రకటించారు. స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడపాలని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే, ఆన్‌ డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించడం, అత్యున్నత సాంకేతికతతో భద్రతను మెరుగుపర్చడం, రవాణా రైల్వే టైంటేబుల్‌ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా చేయడం, దేశంలో ఏ ప్రాంతంలో కూడా కాపలాలేని రైల్వే గేట్లు ఉండకుండా చేయడం, రైళ్ళ రాకపోకల సమయపాలనను ఖచ్చితంగా అమలయ్యేలా చూడటంతో పాటు.. రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లవి 80 కిలోమీటర్లకు పెంచడం, మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం వంటివి ఉన్నాయి. 
 
అంతేకాకుండా, రైల్వేలను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తన ప్రసంగ పాఠంలో నొక్కివక్కాణించారు. గత సంవత్సరం మధ్యకాలిక ప్రణాళికతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాను.. ఈ సారి పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి