ఏప్రిల్ నుంచి ఇలా చేస్తే జైలుకెళ్లాల్సిందే.. నల్లధన నిర్మూలనకు మోడీ కఠిన చట్టం

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (09:01 IST)
నల్లధనం, అవినీతి నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కఠిన చట్టాన్ని తీసుకుని రానున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టవ్యతిరేకంగా పాల్పడే వారిని కఠినంగా శిక్షించనున్నారు. భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. అలాగే, రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి చట్ట విరుద్ధం కానున్నాయి. 
 
నగదు లావాదేవీలను నిరుత్సాహ పరచడమే లక్ష్యంగా ఆదాయ పన్ను చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. ఈ సవరణ ప్రధాన ఉద్ధేశాన్ని పరిశీలిస్తే...  ముఖ్యంగా వస్తువును అమ్మేవాళ్లే పట్టుబట్టి నగదు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లనే లక్ష్యంగా చేసుకొని చట్టం మారుస్తోంది. ఒకే లావాదేవీలో రూ.3 లక్షలకు మించి నగదు చేయి మారితే అది పుచ్చుకున్న వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆదాయ పన్ను శాఖకు దొరికితే పుచ్చుకున్న మొత్తానికి రెట్టింపు ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
 
ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.10 లక్షలకు బంగారం కొనుగోలు చేస్తే... అందులో రూ.4 లక్షలు నగదు రూపేణా చెల్లించాడు అనుకుందాం. ఈ లావాదేవీ ఐటీ శాఖకు ఎక్కడ దొరికినా బంగారం దుకాణం యజమాని నాలుగు లక్షల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కారును నగదు చెల్లించిన కొనుగోలు చేసినా... ఆ కార్ల వ్యాపారి నుంచి మొత్తం నగదును ఫైన్ రూపేణా వసూలు చేస్తారు. 
 
అదేవిధంగా ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా 269ఎస్‌టీ అనే నిబంధన చేరుస్తున్నారు. దాని ప్రకారం ఎవరూ మూడు లక్షలకు మించిన మొత్తం నగదుగా తీసుకోరాదు. ఒక వ్యక్తి నుంచి పలు విడతలుగా ఒక రోజులో 3 లక్షలకు మించి నగదు తీసుకున్నా... ఏక మొత్తంగా ఒకేసారి 3 లక్షలకు మించి నగదు తీసుకున్నా.. ఒక సంఘటన లేదా సందర్భానికి సంబంధించి ఎన్ని విడతలుగా నైనా 3 లక్షలకు మించి నగదు తీసుకున్నా... ఈ మూడు సందర్భాల్లో ఆదాయ పన్ను చట్టం 269ఎస్‌టీ నిబంధననను ఉల్లంఘించినట్లు అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి