ఆసియాలో అత్యంత ధనికుడు ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్

శనివారం, 27 మార్చి 2010 (18:53 IST)
FILE
భారత సంతతికి చెందిన ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్(59) ఆసియాలోనే ఈ ఏటి (2010) అత్యంత ధనికునిగా గుర్తింపు పొందాడు.

ఏషియన్ రిచ్ లిస్ట్ 2010 నివేదికననుసరించి ప్రపంచ స్టీల్ కంపెనీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ అధిపతి లక్ష్మీ మిట్టల్ ఆసియాలోనే అత్యంత ధనికునిగా, జీబీపీ 17 బిలియన్ల్‌కు అధిపతిగా గుర్తింపు పొందినట్లు ఆ నివేదిక తెలిపింది. అతని తర్వాతి స్థానంలో హిందూజా సోదరులైన శ్రీచంద్, గోపీచంద్‌లు జీబీపీ 8 బిలయన్లు పొంది రెండవ స్థానంలో నిలిచారు. వేదాంతా రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ జీబీపీ 4 బిలియన్లు, బెస్ట్‌వేస్‌కు చెందిన సర్ అన్వర్ పర్వేజ్ జీబీపీ 715 మిలియన్లు, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త స్వరాజ్ పాల్ జీబీపీ 510 మిలియన్లు పొందినట్లు ఆ నివేదిక తెలిపింది.

లండన్‌లోని సోఫీటెల్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి రిచ్ లిస్ట్‌ నివేదికను ఏషియన్ మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హిందూజా సోదరులు ఎస్‌పి హిందూజా, జీపీ హిందూజాలు హాజరయ్యారు. ఇందులో భాగంగా హిందూజా సోదరులు తలపెట్టిన వివిధ కార్యక్రమాలకుగాను ఆ సంస్థ వీరిరువురికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందజేసింది.

ఈ సందర్భంగా మిట్టల్ గురించి సంస్థ వివరిస్తూ...ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి మిట్టల్, అతని కుమారుడు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్యా కంపెనీని లాభాల బాటలో తీసుక వెళుతున్నారని కొనియాడారు. మిట్టల్ తన కూతురు వనీష్ వివాహాన్ని గత 2004లో ఫ్రాన్స్‌లో అంగరంగ వైభవంగా జీబీపీ 10-20 మిలయన్లు ఖర్చుపెట్టి జరిపించడాన్ని బట్టి చూస్తే ఆయన ఖ్యాతి ఎంతటిదో అర్థమవుతుందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

2008లో ఆర్సెల్లార్ మిట్టల్ వ్యాపారం 124.9 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తిపరంగా చూస్తే ముడి చమురు ఉత్పత్తి ద్వారా 103.3 మిలియన్ టన్నులు, ప్రపంచ స్టీల్ మార్కెట్ ఉత్పత్తిలో పది శాతం వృద్ధి కనబర్చారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే 2009 నాటికి సంస్థ 65.1 బిలియన్ డాలర్ల మేరకు ఆదాయం తగ్గింది. ఆ సమయంలో ముడి చమురు ఉత్పత్తి, స్టీల్ ఉత్పత్తులు కూడా 73.2 మిలియన్ టన్నులకు పడిపోయాయి. అలా ఆర్థిక మాంద్యం ఆయననూ వదల్లేదు. ఫలితంగా ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో ఎనిమిది శాతం వాటాను మిట్టల్ ఇవ్వగలిగారని ఆ సంస్థ పేర్కొంది.

సంస్థ పేర్కొన్న అంశంపై మిట్టల్ స్పందిస్తూ అతి క్లిష్టమైన వాతావరణంలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ నెట్టుకొచ్చిందని, అయినప్పటికీ తను ఏ మాత్రం కుంగి పోకుండా పుంజుకునేందుకు ప్రయత్నించామన్నారు. ఏదేమైనప్పటికీ 2010లో మళ్ళీ తాము ప్రస్తుతమున్న పోటీని తట్టుకుని నిలబడతామని మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు. దీంతోపాటు తమకు వచ్చే అవకాశాలలో దేనినీ వదలబోమని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి