బియ్యంపై దిగుమతి సుంకం రద్దుచేసిన కేంద్రం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం బియ్యంపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

దేశీయ మార్కెట్లో నిత్యావసర సరుకుల దిగుమతులను పెంచుకోవడం కోసం ప్రధానంగా బియ్యంపై దిగుమతి సుంకాన్ని రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడం, బియ్యం ఉత్పత్తులు తగ్గవచ్చునన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతమున్న 70 శాతం దిగుమతి సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించాలని, వచ్చే ఏడాది సెప్టెంబరు దాకా దీనిని కొనసాగించాలని గత నెలలో సమావేశమైన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల సాధికారిక గ్రూపు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గతంలో 2008 మార్చి 20న ఒకమారు ప్రభుత్వం బియ్యంపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దానిని పునరుద్ధరించారు. పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మంత్రుల గ్రూపు నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.

వెబ్దునియా పై చదవండి