మాంద్యం మబ్బులు తొలగాయ్: నియామకాల ఊపు

హమ్మయ్య... దేశాన్ని కమ్ముకున్న మాంద్యం పొరలు క్రమంగా తొలగిపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచీ దేశంలోని ఆయా కంపెనీలు తిరిగి ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇది ఒక్క మన దేశానికి సంబంధించినదే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద నియామకాల జోరు పెరిగినట్లు అంతర్జాతీయ రిక్రూట్ మెంట్ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది.

ప్రపంచంలో సుమారు 30 దేశాలలో 6వేల కంపెనీలు తమ తమ కంపెనీలకు మేనేజర్లు, ప్రొఫెషనల్స్ కావాలని గత ఏడాది చివరి త్రైమాసికంలో ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో పరిస్థితి ఇలావుంటే దేశంలోని 71 శాతం కంపెనీలు గత ఏడాది సెప్టెంబరు నెల నుంచి ఉద్యోగ నియామకాలను జోరుగా చేస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.

ప్రపంచం మొత్తమ్మీద చూసినప్పుడు... గత సెప్టెంబరు నెల నుంచి ఇప్పటివరకూ అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించిన దేశాలలో నైజీరియా ఉంది. మాంద్యం తొలగిపోయిందన్న విశ్వాసం కంపెనీల్లో కలగడం వల్లనే కొత్తగా నియామకాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా వచ్చే మూడు నెలల్లో ఉద్యోగ నియామకాలను 78 శాతం మేర పెంచాలని భారతదేశంలోని ఆయా కంపెనీలు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ దేశాలలో కూడా మాంద్యం ప్రభావం తొలగినట్లు కనబడుతోంది. చైనా- పాకిస్తాన్ దేశాలు కూడా 71, 70 శాతం మేర నియమకాలను పెంచాయి.

ఉత్పత్తి విభాగం, ఆటో, ఐటీ, ఫార్మా రంగాల్లో ఈ నియామకాలు మరింత ఊపందుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. దీన్నిబట్టి ప్రపంచం క్రమంగా మాంద్యం కోరల నుంచి బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి