1.6 లక్షల మందికి డ్రైవింగ్ నేర్పిన మారుతి

సోమవారం, 4 జనవరి 2010 (15:34 IST)
FILE
దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా 1.6 లక్షల మందికి డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చింది.

దేశంలో సురక్షితమైన డ్రైవింగ్‌ను పెంపొందించేందుకుగాను తన జాతీయ రోడ్డు భద్రతా మిషన్ ద్వారా తొలి సంవత్సరంలో ఒక లక్ష అరవై వేల మందికి డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది.

వచ్చే 2011 నాటికి దాదాపు ఐదు లక్షల మందికి డ్రైవింగ్‌లో శిక్షణనివ్వడమే తమ మిషన్ లక్ష్యమని, వీరిలో దేశంలోని సామాజిక వర్గాల వారు కూడా ఉంటారని ఆ సంస్థ వెల్లడించింది. తమ మిషన్ 2008లో ప్రారంభమైనట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

తమ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో డ్రైవింగ్ నేర్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చేందుకు పలు ప్రణాళికలు రూపొందించుకుందని సంస్థ తెలిపింది. వీటితోపాటు కంపెనీ తన డీలర్ల ద్వారా మారుతి డ్రైవింగ్ పాఠశాలలను నడుపుతోందని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.

కంపెనీ ఇప్పటి వరకు దేశంలో ఆరు లక్షల పది వేల మందికి డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చింది. దేశంలో ప్రస్తుతం నాలుగు డ్రైవింగ్ శిక్షణ, పరిశోధనా సంస్థలున్నాయి. వీటితోపాటు దేశంలోని 53 నగరాలలో 64 మారుతి డ్రైవింగ్ పాఠశాలలున్నట్లు సంస్థ తెలిపింది.

మారుతి సంస్థ త్రిపుర, అస్సోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఇలాంటి శిక్షణా సంస్థలను ప్రారంభించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తోందని మారుతి సంస్థ ఆ ప్రకటనలో వివరించింది.

వెబ్దునియా పై చదవండి